Saturday, April 27, 2024

భయపడేది లేదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రంపై తనపై ఎన్ని కేసులు పెట్టినా ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడే లేదని టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. లిక్కర్ స్కాంలో తనపై తప్పుడు కేసులు పెట్టినా ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఇడి, సిబిఐ, ఐటి వంటి దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తామన్నారు. మహా అయితే బిజెపి ప్రభుత్వం తనను జైల్లో పెడుతుందా? పెట్టుకొమ్మను అంటూ మోడీ సర్కార్‌పై ఆమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల అండ ఉన్నంతకాలం తనకు ఏమీకాదన్నారు.

లిక్కర్ స్కాంలో పేరు వచ్చిన తర్వాత గురువారం మొదటిసారి మీడియా ముందుకు వచ్చిన కవిత మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి మోడీ వచ్చే ముందు ఇడి వస్తుందన్నారు. ఇదేమీ కొత్త విషయం కాదన్నారు. గత కొన్నేళ్లుగా దేశ ప్రజలు ఈ పరిణామాలను గమనిస్తూనే ఉన్నారన్నారు. వచ్చే సంవత్సరంలో తెలంగాణలో ఎన్నికలు ఉన్నందునే ఇడి పరుగులు తీసుకుంటూ వచ్చిందని ఎద్దేవా చేశారు. ఇడి, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలతో ప్రత్యర్ధి పార్టీలను భయపెట్టించి బిజెపి గెలవాలని చూస్తున్నారన్నారు. కానీ అది ఇతర రాష్ట్రాల్లో బిజెపికి సాధ్యం అవుతుందేమో కానీ….తెలంగాణలో కాదన్నారు. ఇడి వస్తే ఖచ్చితంగా సమాధానం చెబుతానని అన్నారు. అంతే తప్ప మీడియాకు లీకులు ఇచ్చి రాజకీయం చేయడం తగదని కవిత అన్నారు.

దేశంలో బిజెపి పాలన వచ్చి ఎనిమిది ఏళ్ళు పూర్తి అవుతోందన్నారు. ఈ ఎనిమిది ఏళ్లలో దర్యాంపు సంస్థలను ఉపయోగించి తొమ్మది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారని కవిత ఆరోపించారు. ఈ క్రమంలోనే వచ్చే డిసెంబర్‌లో రాష్ట్రంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో, మోడీ కంటే ముందు ఇడి వచ్చిందని కవిత సైటర్లు వేశారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుల ఇళ్లు, ఆఫీసులపై ఇడిలతో సోదాలు చేయించడం బిజెపి ప్రభుత్వానికి కామన్‌గా మారిందని ధ్వజమెత్తారు. టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులపై ఇడి, సిబిఐలతో దాడులు చేయించడం బిజెపి నీచ రాజకీయ ఎత్తుగడ అని ఆమె మండిపడ్డారు. దర్యాపు సంస్థలు వచ్చి ప్రశ్నలు అడిగితే సమాధానం చెబుతామన్నారు.

మోడీ సర్కార్‌ను ఎండగడుతున్నందుకే
మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర స్థాయిలో ఎండగడుతున్నారన్నారు. అందుకే మోడీ ప్రభుత్వం తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కవిత మండిపడ్డారు. ఇందులో భాగమే దర్యాపు సంస్థల నుంచి దాడులు కొనసాగుతున్నాయని ఆమె ఆరోపించారు. కేంద్రం ఉసిగొలుపుతున్న దర్యాపు సంస్థలకు సహకరిస్తామే తప్ప….భయపడమన్నారు. జైల్లో పెట్టడం కంటే మోడీ సర్కార్ ఎక్కువ చేసేది ఏమి లేదన్నారు. అందుకే కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామని…. ఈ పంధాన్ని మార్చుకోవాలని ఆమె సూచించారు.

బిఆర్‌ఎస్‌తో బిజెపికి దడ మొదలైంది
భారత్ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పార్టీ ఏర్పాటుపై సిఎం కెసిఆర్ చేసిన ప్రకటన భారతీయ జనతా పార్టీని గడగడలాడించిందన్నారు. ఆ దడతోనే మోడీ సర్కార్ చౌకబారు రాజకీయాలకు తెరతీసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రను భగ్నం చేసి ప్రజల ముందు ఉంచామన్నారు. దీంతో కక్ష సాధింపులు పాల్పడుతోందని మండిపడ్డారు. ఈ దాడులను పట్టించుకోనవసరం లేదు…. అయోమయానికి గురికావాల్సిన అవసరం అంతకన్నా లేదన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల వద్దకు వెళ్లి వాళ్లకు ఏం చేస్తామో చెప్పుకుని ఎన్నికల్లో గెలువాలి కానీ….ఇడి, సిబిఐలను ప్రయోగించి గెలవాలనుకుంటే కుదరదని స్పష్టం చేశారు. ఈ చౌకబారు ఎత్తుగడలను తెలంగాణ ప్రజలు సహించరని…చాలా ఘాటుగా తిప్పికొడుతారని ఈ సందర్భంగా కవిత హెచ్చరించారు.

MLC Kavitha Press Meet over Delhi Liquor Scam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News