Friday, May 10, 2024

కేంద్రం పెత్తనం.. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం: బోయినపల్లి

- Advertisement -
- Advertisement -

కేంద్రం పెత్తనం.. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం
రాష్ట్ర ప్రణాళికాసంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్

మనతెలంగాణ,హైదరాబాద్: రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించినట్లే అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో ఎస్సీ, ఎస్టీ మేధావుల జాతీయ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన రాజ్యాంగ దినోత్సవ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం అంటే రాష్ట్రాల సమూహం అని, మనది ఫెడరల్ వ్యవస్థ కలిగిన దేశమని పేర్కొన్నారు. రాష్ట్రాల ఆర్థిక స్వావలంబనను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని స్పష్టం చేశారు.

రాజ్యాంగ స్ఫూర్తిని తూట్లు పొడుస్తూ దేశంలోని పాలకులు అవలంభిస్తున్న ధోరణిని ఎండగట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ వాటిని పూర్తి స్థాయిలో ప్రైవేటీకరిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఉద్యోగాలను హరించే చర్యలు జోరుగా సాగుతున్నాయని వినోద్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.ఇలాంటి చర్యలు ఏమాత్రం మంచిది కాదన్నారు.

రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి పౌరుడిపై ఉందన్నారు. రాజ్యాంగంపై ప్రతి ఒక్కరికి కనీస పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇందు కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ మేధావులు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవగాహనా శిబిరాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.బిసి కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మహా జ్ఞాని అని, ఆయనను ఒక వర్గానికి పరిమితం చేసేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు.ఎస్సీ,ఎస్టీ మేధావుల ఫోరం రాష్ట్ర చైర్మన్ ఆరేపల్లి రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఫోరం జాతీయ నాయకులు మురళీదర్శన్, నర్సింహా, బ్రాహ్మనాథరావు, భవాని, మాధవీ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News