Saturday, May 11, 2024

జాతీయ రహదారుల మరమ్మతుల్లో ఎన్‌హెచ్‌ఎఐ నిర్లక్ష్యం !

- Advertisement -
- Advertisement -

నాసిరకం సిమెంట్, ఇసుక వినియోగంతో
రోడ్లపై గుంతలు
పట్టించుకొని కాంట్రాక్టర్లు
రాష్ట్ర రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించడంలోనూ
కేంద్రం మీనమేషాలు

Centre Take up Greenfield highway between TS and AP
మనతెలంగాణ/హైదరాబాద్:  ప్రజలు రోడ్డు ప్రయాణం అంటేనే వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంతో కనెక్టివిటీ ఉన్న జాతీయ రహదారులు పలుచోట్ల దెబ్బతిన్నాయి. ఈ సంవత్సరం అక్టోబర్, నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు జాతీయ రహదారులపై ఉన్న తారు కొట్టుకుపోవడంతో గుంతల్లో నుంచి ప్రయాణించాలంటే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బెంగళూరు, విజయవాడ, వరంగల్, ముంబై హైవేలతో పాటు మరో రెండు హైవేల్లో సుమారు (400 కి.మీలు) ఇదే పరిస్థితి నెలకొందని ఇప్పటికే దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం జాతీయ రహదారుల మరమ్మతుకు చాలాచోట్ల సాంకేతిక అంశాలు అడ్డుగా మారుతున్నాయని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు సైతం మరమ్మతు పనులు చేపట్టడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని వారిపై ఫిర్యాదులు వస్తున్నాయని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పేర్కొంటున్నారు. జాతీయ రహదారుల నిర్మాణం జరిగేటప్పుటు నాసిరకం వస్తువులను (సిమెంట్, ఇసుకను) వాడడం వలన ఆ రోడ్లు త్వరగా దెబ్బతింటున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. కనీసం జాతీయ రహదారుల మరమ్మతుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న కేంద్రం రాష్ట్ర రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించడంలో మీనమేషాలు లెక్కిస్తుందని ఆర్‌అండ్‌బి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకు 1,366 కిలోమీటర్ల పొడవు మాత్రమే

రాష్ట్రం ఏర్పడిన తరువాత 3,135 కిలోమీటర్ల పొడవు గల 25 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించడానికి సూత్రప్రాయంగా కేంద్రం అంగీకారం తెలపగా, వీటిలో ఇప్పటివరకు 1,366 కిలోమీటర్ల పొడవు మాత్రమే జాతీయ రహదారులుగా కేంద్రం గుర్తించింది. గత సంవత్సరం కేవలం 289 కిలోమీటర్ల జాతీయ రహదారులకు రూ.7,233 కోట్ల నిధులను విడుదల చేసి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారుల సాంద్రత 3.49 కి.మీలు/100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కాగా, దేశంలో ఉన్న జాతీయ రహదారుల సగటు సాంద్రత 4.01 కి.మీలు/100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కన్నా చాలా తక్కువగా ఉంది. రాష్ట్రంలో కనీసం 1,000 కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారులను గుర్తించాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. కానీ కేంద్రం మాత్రం జాతీయ రహదారులుగా గుర్తించడానికి ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరిన్ని రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా కేంద్రం గుర్తిస్తే వాహనదారులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించవచ్చని రాష్ట్ర ఆర్‌అండ్‌బి అధికారులు పేర్కొంటున్నారు.

కేంద్రానికి మంత్రి వేముల విజ్ఞప్తి

చౌటుప్పల్ (ఎన్‌హెచ్‌ఏఐ 65) షాద్‌నగర్ (ఎన్‌హెచ్‌ఏఐ 44) కంది (ఎన్‌హెచ్‌ఏఐ 65) ఆర్‌ఆర్‌ఆర్ యొక్క దక్షిణభాగం 182 కి.మీలు హైదరాబాద్ (గౌరెల్లి వద్ద ఓఆర్‌ఆర్ జంక్షన్) వలిగొండ టు తొర్రూర్ టు నెల్లికుదురు టు మహబూబ్‌నగర్ టు ఇల్లందు టు కొత్తగూడెం (ఎన్‌హెచ్‌ఏఐ 30) జంక్షన్ వద్ద 234 కి.మీలు. మెదక్ టు ఎల్లారెడ్డి టు రుద్రూర్ 92 కి.మీలు, బోధన్ టు బాసర టు భైంసా 76 కి.మీలు, మెదక్ టు సిద్ధిపేట టు ఎల్కతుర్తి 33 కి.మీలు, మహబూబ్‌నగర్ టు కోడంగల్ టు తాండూర్ టు చించోలి 96 కి.మీలు, కరీంనగర్ టు కామారెడ్డి టు ఎల్లారెడ్డి టు పిట్లం 165 కి.మీలు, కొత్తకోట టు గద్వాల్ టు మంత్రాలయం 70 కి.మీలు, జహీరాబాద్ టు బీదర్ టు డెగ్లూర్ 25 కి.మీలను కొత్త జాతీయ రహదారులుగా (1,073 కి.మీలను) ప్రకటించాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి గతంలో కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. అయినా దీనిపై కేంద్రం స్పందించడం లేదు.

5 ఏళ్లలో రూ.25వేల కోట్ల ఖర్చు

రాష్ట్ర, జాతీయ రహదారుల అభివృద్ధి నిమిత్తం 5 ఏళ్లుగా సుమారు రూ. 25వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. గత సంవత్సరం కురిసిన వర్షాలకు చాలావరకు రోడ్లు దెబ్బతినడంతో ప్రభుత్వానికి అపారనష్టం వాటిల్లింది. అప్పట్లో కురిసిన వర్షానికి దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించడానికి సుమారు రూ.2 వేల కోట్లను కేటాయించింది. రాష్ట్రంలోని 445 చోట్ల బిటి రోడ్లు, 6 చోట్ల నేషనల్ హైవేలు దెబ్బతినగా, పంచాయతీరాజ్ రోడ్లు 475 చోట్ల, 269 చోట్ల రోడ్లు తెగిపోగా, ఆర్‌అండ్‌బి రోడ్లు 113 చోట్ల దెబ్బతిన్న వాటికి అధికారులు మరమ్మతులు చేశారు.

జాతీయ రహదారుల కనెక్టివిటీని కొనసాగించి…

ఐటి, పరిశ్రమలు, గజ్వేల్ వద్ద కొత్త హార్టికల్చర్ విశ్వ విద్యాలయం, యాదాద్రి టెంపుల్ సిటీ, బీబీనగర్ వద్ద ఎయిమ్స్, కడ్తాల్ సమీపంలో ఫార్మాసిటీ, కంది వద్ద ఐఐటి, హైదరాబాద్ చుట్టుపక్కల అనేక పరిశ్రమల రాకతో నగరం చుట్టూ అభివృద్ధి జరుగుతోంది. ఈ నేపథ్యంలో రానున్న 4 నుంచి 5 సంవత్సరాల లోపు ఓఆర్‌ఆర్ ట్రాఫిక్‌తో నిండిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో నగరం చుట్టూ జాతీయ రహదారుల కనెక్టివిటీని కొనసాగిస్తే భవిష్యత్‌లో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News