Friday, April 26, 2024

మరింత ఆర్థిక సంక్షోభం!

- Advertisement -
- Advertisement -

More financial crisis in India

గత సంవత్సరం లాక్‌డౌన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్దీపన చర్యల మూలంగా ఆర్థిక కార్యలాపాలలో రికవరీ ప్రారంభం అయి పలు రంగాలు వృద్ధి బాటపట్టాయి. ఆర్థిక సర్వే ఫలితాలను ప్రకటించేటప్పుడు కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలు వృద్ధి బాట పడుతున్నాయని తద్వారా ఆర్థిక వ్యవస్థ ‘వీ’ ఆకార వృద్ధిని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా 2020-21 ఆర్థిక సంవత్సరంలో జిడిపి 7.7 శాతం క్షీణతను నమోదు చేస్తుందని జాతీయ గణాంక సంస్థ (ఎన్‌ఎస్‌ఒ) అంచనా వేసింది. అదే విధంగా అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు భారత దేశం 2021-22 లో రెండంకెల వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా కట్టాయి. అయితే చాప కింద నీరులా వచ్చి మహోగ్రరూపం దాల్చిన కరోనా రెండవ దశ మహమ్మారి భారత దేశం ఆర్థికాభివృద్ధి ఆశలపై నీళ్లుచల్లి నూతన సవాళ్లను విసురుతున్నది. ఇది మొదటి త్రైమాసిక వృద్ధిని ప్రభావం చేయనుందనీ ఆర్థికవేత్తలు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు 2021-22 ఆర్థిక సంవత్సరానికి గతంలో అంచనా వేసిన వృద్ధి రేట్లను తగ్గిస్తున్నాయి. వృద్ధి రేటును 12.5 శాతంగా అంచనా వేసిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తన అంచనాలను తగ్గించనున్నట్లు తెలిపింది. మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ సంస్థ వృద్ధి రేటును 13.7 శాతం నుండి 9.3 శాతానికి కోత విధించింది. కరోనా వ్యాప్తి, టీకా కార్యక్రమం నేరుగా ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం చూపగలదని, ఈ ప్రభావం మొదటి త్రైమాసికానికే పరిమితం కావొచ్చని, ఆ తర్వాత బలమైన రికవరీ సాధిస్తుందని తెలిపింది. 2022-23 సంవత్సరం వృద్ధి రేటును 6.2 శాతం నుండి 7.9 శాతంగా అంచనా వేసింది. ఆదాయాలు తగ్గి, ప్రభుత్వ వ్యయం పెరగడంతో ద్రవ్యలోటు 10.9 శాతం నుండి11.8 శాతానికి పెరగవచ్చని తెలిపింది. ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్ సంస్థ ప్రస్తుత పరిస్థితుల్లో దేశ సార్వభౌమ రుణ రేటింగ్ అయిన బిబిబిలో మరో రెండేళ్ల వరకు మార్పు ఉండదని తెలిపింది. కరోనా ప్రస్తుత పరిస్థితి కొనసాగితే వృద్ధి రేటు 11 శాతం నుండి 9.8 శాతానికి, ఇంకా తీవ్రమైతే 8.8 శాతానికి తగ్గ వచ్చని అంచనా వేసింది. భారత దేశ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ జిడిపి వృద్ధిరేటు అంచనాలను మార్పు చేసింది. ఈ నెలలో కరోనా కేసులు గరిష్ఠ స్థాయికి చేరి తగ్గడం ప్రారంభం అయితే వృద్ధి రేటు 11 శాతం నుండి 9.8 శాతానికి, జూన్ నెలలో తగ్గనారభించినట్లయితే 8.2 శాతం క్షీణిస్తుందని ప్రకటించింది.

అదే విధంగా ఆదాయ పెరుగుదల రేటు కూడా 15 శాతం నుండి 10-12 శాతానికి క్షీణించవచ్చని అభిప్రాయపడింది. జపాన్ బ్రోకరేజ్ సంస్థ నోముర జిడిపి వృద్ధి రేటును 12.6 శాతం నుండి 10.8 శాతానికి తగ్గించింది. ఇదే అభిప్రాయాన్ని ఫిచ్ రేటింగ్ సంస్థ, గోల్ మాన్ సాక్స్, ఐక్యరాజ్య సమితి సైతం వెల్లడించాయి. కరోనా రెండవ దశ ఉద్ధృతి 2021-22 ఆర్థిక సంవత్సర జిడిపి వృద్ధిరేటుతో పాటు మొదటి త్రైమాసిక వృద్ధిని సైతం ప్రభావం చేయనున్నట్లు అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల అయిన ఏప్రిల్‌లో వివిధ రంగాలు క్షీణతను నమోదు చేస్తున్నాయి.

వివిధ రాష్ట్రాల్లో విధించిన లాక్ డౌన్, రాత్రి పూట కర్ఫ్యూలతో వ్యాపారాలు, పరిశ్రమలు మూసివేయడంతో ఉత్పత్తి నిలిచిపోయి, కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. ముఖ్యంగా వలస కార్మికులు తిరిగి వారి సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. దీనితో ఉత్పత్తితో పాటు ఉపాధికి విఘాతం కలుగుతుంది. ఇటీవల ముంబాయికి చెందిన సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) ఏప్రిల్ నెలకు సంబంధించి విడుదల చేసిన నిరుద్యోగిత గణాంకాల ప్రకారం ఏప్రిల్ లో 73.5 లక్షల మంది ఉపాధి కోల్పోగా, నిరుద్యోగిత 7.97 శాతానికి పెరిగింది. ఇది ఫిబ్రవరి లో 6.89 శాతం కాగా, మార్చిలో 6.5 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో 7.3 శాతం కాగా, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు మార్చిలో 7.27 శాతం నుండి ఏప్రిల్ లో 9.78 శాతానికి ఎగబాకింది. దీని ద్వారా రెండవ దశ కరోనా లాక్‌డౌన్ ప్రభావం నిరుద్యోగితపై స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ సంవత్సరం మార్చి నెలతో పోల్చినపుడు వాహన తయారీదారులు డీలర్లకు టోకుగా అమ్మే వాహనాల సంఖ్య ఏప్రిల్‌లో 30 శాతం క్షీణించినట్లు భారత వాహనదారుల తయారీ సంఘం (సియామ్) వెల్లడించింది. వీటిలో ప్యాసింజర్ వాహనాలు 10.7 శాతం క్షీణించగా, ద్విచక్ర వాహనాలు 33.5 శాతం, త్రి చక్ర వాహనాలు 57 శాతం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆశావహంగా ఏప్రిల్ నెలలో వాహనాల ఎగుమతులు మాత్రం మంచి వృద్ధిని నమోదు చేశాయి. ప్యాసింజర్ వాహనాలు 4.58 శాతం, ద్విచక్ర వాహనాలు 21.1 శాతం, త్రి చక్ర వాహనాలు 16.8 శాతం వృద్ధిని నమోదు చేశాయి. కరోనా లాక్ డౌన్ వలన డీలర్లు వ్యాపారాలను మూసి ఉంచడం, వినియోగదారుల సెంటిమెంట్ బలహీనపడి డిమాండ్ తగ్గడం క్షీణతకు కారణాలని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. కరోనా కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రీటైల్ వాహనాల అమ్మకాలు 29.85 శాతానికి తగ్గినట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే నెలల్లో కూడా లాక్ డౌన్ ప్రభావం పడనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) వెల్లడించింది.

రెండవ దశ కరోనాతో మల్టీప్లెక్స్ వ్యాపారాలు సైతం రెండవ ఏడాది నష్టాలు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు క్రిసిల్ రేటింగ్ ఏజెన్సీ అంచనా వేసింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలోనే ఈ రంగం పుంజుకునే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి అర్థ భాగంలో 10 12 శాతం ఆక్యుపెన్సి చేరుకుంటుందని అంచనా. అదే విధంగా పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (పిపిఎసి) వెల్లడించిన డేటా ప్రకారం అయిల్ డిమాండ్ మార్చిలో 18.77 మిలియన్ టన్నుల నుండి ఏప్రిల్‌లో 17.01 మిలియన్ టన్నులకు తగ్గి 9.38 శాతం క్షీణతను నమోదు చేసింది. పెట్రోల్ అమ్మకాలు 13 శాతం, డీజిల్ అమ్మకాలు 7.5 శాతం తగ్గినట్లు తెలిపింది.

ఇది ఇలా ఉండగా, మరో వైపు కొన్ని రంగాలు మంచి వృద్ధిని నమోదు చేస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా జిఎస్‌టి వసూళ్లు గత సంవత్సరం అక్టోబర్ నుంచి ప్రతి నెల లక్ష కోట్లకు పైగా వసూలవుతున్నాయి. ఏప్రిల్ నెలలో జిఎస్‌టి వసూళ్లు జీవితకాల రికార్డు గరిష్ఠ స్థాయిలో రూ. 1.41 లక్షల కోట్లు వసూలు చేయడం విశేషం. మార్చి నెలతో పోల్చినపుడు 14 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇది ఆర్ధిక పునరుజ్జీవనానికి ఒక సంకేతమని, అయితే ఇది రాబోయే నెలల్లో ఉండక పోవచ్చని ఈ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరొక విశేషం ఎగుమతి దిగుమతులలో వృద్ధి సాధించడం. గత సంవత్సరం ఏప్రిల్‌తో పోల్చినపుడు ఈ ఏప్రిల్‌లో ఎగుమతులు మూడింతలు పెరిగి 1017 కోట్ల డాలర్ల నుంచి 3021 కోట్ల డాలర్లకు చేరాయి. అదే విధంగా దిగుమతులు కూడా మూడింతలు పెరిగి 1709 కోట్ల డాలర్ల నుంచి 4545 కోట్ల డాలర్లకు పెరిగాయి. దీనితో వాణిజ్య లోటు 692 కోట్ల డాలర్ల నుంచి 1524 కోట్ల డాలర్లకు చేరింది.

ఇంజినీరింగ్, వజ్రా భరణాలు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్లో పెరుగుదల వలన ఈ వృద్ధి నమోదైనట్లు వెల్లడించారు. ఇటీవల కేంద్ర గణాంక సంస్థ విడుదల చేసిన సమాచారం ప్రకారం మార్చి నెల పారిశ్రామిక ఉత్పత్తి 22.4 శాతం వృద్ధిని సాధించిండం ఊరట కలిగించే అంశం. పారిశ్రామిక ఉత్పత్తిలో కీలకమైన ఎనిమిది రంగాలలో తయారీ రంగం 25.8 శాతం, విద్యుచ్ఛక్తి తయారీ రంగం 22.5 శాతం పెరుగుదలను నమోదు చేయడంతో ఈ వృద్ధి సాధ్యం అయినట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరానికి మొత్తానికి పారిశ్రామిక రంగం 8.6 శాతం క్షీణత నమోదు చేసింది. అయితే మార్చి నెలలో నమోదు అయిన పారిశ్రామిక వృద్ధి రేటు స్వాగతించదగినప్పటికీ అది లాక్‌డౌన్ ముందు కాలానికి సంబంధించినదని, ఏప్రిల్‌లో వివిధ రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్, రాత్రి పూట కర్ఫ్యూల ప్రభావం పారిశ్రామిక ఉత్పత్తిపై ఉండనుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుత తరుణంలో ఈ కరోనా సునామీ నుండి ప్రజలను, ఆర్థిక వ్యవస్థను కాపాడేది టీకాలనేది నగ్నసత్యం. ప్రస్తుతం ప్రభుత్వం ముందు రెండు అతి పెద్ద సవాళ్లున్నాయి. ఒకటి ప్రస్తుతం కరోనా, రెండవ దశ మహమ్మారిని కట్టడి చేస్తూ, టీకా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం. రెండవది ఈ రెండవ దశ సంక్షోభం వల్ల దెబ్బతింటున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టడానికి అవసరమైన దిద్దుబాటు చర్యలు చేపట్టడం. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి బహుముఖ వ్యూహాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు కరోనా చికిత్సకు అవసరమైన వైద్య సదుపాయాలను మెరుగుపర్చాలి. ఆక్సిజన్ సరఫరాను, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను, రెమిడెసివిర్ ఇంజక్షన్ల లభ్యతను పెంచడం, వెంటిలేటర్లు, ఐసియు పడకలను మరింత పెంచడం, ఇతర కరోనా చికిత్స అత్యవసరాలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలను ముమ్మరం చేయాలి. మరోవైపు యూనివర్సల్ టీకా కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలి.

దీనికి ప్రస్తుతం టీకాలను అందిస్తున్న కంపెనీల ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడంతో పాటు విదేశీ కంపెనీల టీకాల మన దేశంలో ఉత్పత్తి చేయడానికి కావాల్సిన తోడ్పాటు, ప్రోత్సాహం అందించాలి. టీకా జాతీయ విధానాన్ని రూపొందించి టీకా పంపిణీలో అసమానతలను రూపుమాపాలి. అమెరికా, చైనా వంటి దేశాలలో టీకా కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నందు వల్లనే ఆ దేశాల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టి, ఉత్పత్తి, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తద్వారా ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతున్నట్లు ఇటీవల ఐక్యరాజ్య సమితి పేర్కొనడం గమనార్హం. అక్టోబర్‌లో కరోనా మూడవ దశ ముప్పు పొంచి ఉందన్న నిపుణుల అంచనాను పరిగణనలోకి తీసుకుని దానిని కట్టడి చేయడానికి ఇప్పటి నుండే సన్నద్ధతను ప్రారంభించాలి. ఇది చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపబోతుందన్న అంచనాల నేపథ్యంలో వారికి కూడా టీకాల తయారీని ప్రోత్సహించాలి. అదే విధంగా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టడానికి ప్రభుత్వ వ్యయం పెరగాలి.

దీనికి రుణాలను పెంచుకోవడానికి సైతం వెనకాడ కూడదు. ప్రభుత్వం ప్రజల చేతిలో నగదు సరఫరా పెంచే ఉద్దీపన చర్యలు చేపట్టాలి తద్వారా వస్తువుల డిమాండ్ పెరిగి ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం ‘మిని అత్మనిర్భర భారత్ అభియాన్’ ప్యాకేజీనీ తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉందని ఇటు ప్రజలు, కార్మికులు, అటు వర్తక, పారిశ్రామిక వర్గాలు అభిప్రాపడుతున్నారు. గతంలో మాదిరిగా సప్లయ్ వైపు చర్యలు కాకుండా ప్రజలు, కార్మికులు, వర్తకుల చేతిలో ద్రవ్య సరఫరాను పెంచే చర్యలుండాలని కోరుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు, వైద్య సిబ్బంది సంపూర్ణ సమన్వయంతో కరోనా కట్టడికి. ఆర్థిక వ్యవస్థను తిరిగి అభివృద్ధి బాటలో నడిపించడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది!

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News