Monday, April 29, 2024

శుష్క ప్రసంగం

- Advertisement -
- Advertisement -

Vaccine is mainstay of protection against corona:Modi

 

‘మీ బాధల్లో పాలు పంచుకుంటున్నాను’ కొవిడ్ సెకండ్ వేవ్ మృత్యు కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్న దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నాడు ఆవేదనాభరిత స్వరంతో పలికిన పలుకులివి. రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి సాయాన్ని విడుదల చేసిన సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఆయన ఈ విధంగా అన్నారు. కొవిడ్ సృష్టిస్తున్న ప్రాణాంతక ప్రళయాన్ని కలిసి కట్టుగా ఎదుర్కొంటున్నందుకు దేశ ప్రజలను ఆయన మెచ్చుకున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకోవలసిందని హితవు పలికారు. వైరస్ ఇప్పుడు గ్రామాలకు పాకుతున్నది. దానిని ఎదుర్కోడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద పని చేస్తున్నది అని కూడా చెప్పారు. ప్రధాని మోడీ బహుశా ఐదు అసెంబ్లీల ఎన్నికల ప్రచార పర్వంలో తీరిక లేకుండా పాల్గొన్నందువల్ల కలిగిన బడలిక నుంచి తేరుకున్న తర్వాత కనీవినీ ఎరుగని కష్టాలెదుర్కొంటున్న ప్రజల మీద జాలి కలిగి వారి ముఖ్య సేవకుడుగా ఈ ప్రేమాస్పద ధైర్య వచనాలు పలికినట్టున్నారు. అయితే రోజు రోజుకీ తీవ్రమవుతూ నోటికందిన వారందరినీ వయసు తేడాలు చూపకుండా కబళిస్తున్న కొవిడ్ సెకండ్ వేవ్‌ను త్వరగా ఓడించడానికి కేంద్ర ప్రభుత్వం తరపున కొత్త నిర్ణయాలేవీ ఆయన ప్రసంగంలో కనిపించలేదు.

కరోనా నుంచి కాపాడే ప్రధానాస్త్రం టీకాయేనని చెప్పిన ప్రధాని మీ వంతు వచ్చేటప్పుడు తప్పనిసరిగా వేయించుకోండి అని మాత్రం ఉద్బోధించారు. ప్రస్తుతం టీకాకు అనువైన వయసులోని దేశ ప్రజలు 90 కోట్ల మంది వరకు ఉంటారు. అంటే 18, ఆ పైబడిన వారు అంత మంది ఉండగలరని అంచనా. వీరందరికీ రెండు సార్లు వేయడానికి 180 కోట్ల డోసుల టీకా అవసరం. వృథా కాగలదాన్ని కూడా కలుపుకుంటే అంతకంటే ఎక్కువే కావాలి. కాని ప్రధాని చెప్పిన దానిని బట్టే ఇప్పటి వరకు 18 కోట్ల డోసుల టీకా మాత్రమే వేశారు. మిగతా వారందరికీ అవసరమైన టీకా సమకూర్చుకొని వేయడానికి ఇంకో ఏడాది పట్టినా ఆశ్చర్యపోనవసరం ఉండదు. టీకా వేయాలనుకోడం వేరు, దానిని ఆర్థిక భారం లేకుండా సునాయాసంగా ప్రజలందరికీ అందేటట్టు చూడడం వేరు. దేశంలోని రెండు టీకా ఉత్పత్తి సంస్థల నుంచి కేంద్రం, రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు తదితరాలు రూ. 150 నుంచి రూ. 600 పైచిలుకు వరకు వేర్వేరు ధరలకు రాష్ట్రాలు కొనుగోలు చేసుకోవాలంటూ ఈ నెల 21న విడుదల చేసిన కొత్త జాతీయ టీకా విధానం చెబుతున్నది. దీనిని విమర్శించని వారు లేరంటే ఆశ్చర్యపోనక్కర లేదు.

అలాగే కొవిడ్ టీకాలు, ఇతర మందుల విక్రయంపై వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ను మినహాయించాలన్న డిమాండ్‌ను కూడా కేంద్రం తోసిపుచ్చింది. వ్యాపార వర్గ ప్రయోజనాలు, కేంద్ర ఖజానా దెబ్బ తింటాయన్న ఉద్దేశంతోనే దేశ పాలకులు టీకాలకు వివిధ రేట్ల అవకాశాన్ని కల్పించారని, జిఎస్‌టి రద్దు డిమాండ్‌ను అందుకే తోసిపుచ్చారని స్పష్టంగా తెలుస్తున్నది. ప్రజల ప్రాణాల మీదకు వైరస్ విరుచుకుపడిన ఇంతటి అపూర్వ, అసాధారణ ఆపత్కాలంలో కూడా కేంద్రంలోని మన ప్రజా పాలకులు బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలకే అగ్ర తాంబూలం ఇస్తున్నందుకు ఆనందించవలసిందే! 18 45 ఏళ్ల వయసులోని వారికి రాష్ట్ర ప్రభుత్వాలే వ్యాక్సిన్‌ను కొని పంపిణీ చేయాలన్న ఈ విధానాన్ని రాజ్యాంగం 14, 21 అధికరణల వెలుగులో సవరించి మెరుగుపరుచాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మాసారంభంలో కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్ర విధానం ఒకే రకమైన కష్టంలో కూరుకుపోయిన భిన్నవర్గాల ప్రజల మధ్య విచక్షణ జ్ఞానంతో కూడిన తేడాను చూపకపోడాన్ని ఎత్తి చూపింది.

చట్టం నిర్దేశించిన పద్ధతుల్లో తప్ప ఎవరూ ఏ వ్యక్తి ప్రాణాన్ని గాని, వ్యక్తిగత స్వేచ్ఛను గాని హరించడానికి ఎంత మాత్రం వీలు లేదని రాజ్యాంగం 21 వ అధికరణ చెబుతున్నది. అలాగే 14 వ అధికరణ దేశ ప్రజలందరికీ సమాన రక్షణను హామీ ఇస్తున్నది. ఈ విషయాలను ప్రస్తావించిన ధర్మాసనం అన్ని వయసుల వారికీ అవసరమైన టీకాను కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు విక్రయించాలని సూచించింది. కేంద్రీకృత కొనుగోలు, వికేంద్రీకృత పంపిణీ సూత్రాన్ని పాటించాలని చెప్పింది. అయినా కేంద్రంలో కదలిక రాలేదు.

వాస్తవానికి టీకా కొనుగోలుకు కేంద్ర బడ్జెట్‌లో కేటాయించిన రూ. 35 వేల కోట్లు దేశ ప్రజలందరికీ ఉచిత టీకా వేయించడానికి సరిపోతుందని కూడా నిపుణులు చెబుతున్నారు. కాని ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంలో సుప్రీంకోర్టు సూచించినట్టు టీకా విధానాన్ని సవరించుకొనే విషయాన్ని పట్టించుకోలేదు. టీకాలు వచ్చినప్పుడే వేసుకోండని చెప్పి చేతులు దులుపుకున్నారు. జిఎస్‌టిని విధించినప్పుడు ఒకే జాతి, ఒకే పన్ను అని ఇచ్చిన నినాదం ఇప్పుడు ఏమైంది, ఒకే జాతి, ఒకే టీకా విధానాన్ని ఎందుకు అమలు చేయడం లేదు? దేశ ప్రజలు తమ కన్నీటి వాగుల్లో ఈదుకుంటూ ఈ కష్ట కాలాన్ని ఎలాగోలా గట్టెక్కుతారనే అభిప్రాయంతో ప్రధాని మోడీ ఇటువంటి శుష్క ప్రసంగాలను ఆశ్రయిస్తున్నట్టు అనిపిస్తే ఆక్షేపించలేము.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News