Friday, April 26, 2024

క్రికెట్ చాణక్యుడు ధోనీ గుడ్ బై

- Advertisement -
- Advertisement -

 అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతూ మహేంద్రుడు సంచలన నిర్ణయం
 ఇన్నేళ్లుగా మద్దతుగా నిలిచిన అభిమానులు, కుటుంబసభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు
 భారత సారథిగా వన్డే, టీ20 ప్రపంచకప్‌లను అందించిన ఘనత సొంతం
 ప్రపంచ క్రికెట్‌లో భారత్‌ను నెం.1 స్థానానికి చేర్చడంలో రాంచీ డైనమెట్ కీలక పాత్ర
 తనదైన శైలి హెలికాప్టర్ షాట్లతో అభిమానులను అలరించిన మహేంద్ర సింగ్ ధోనీ

MS Dhoni Retires from International Cricket

చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు శనివారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రకటించాడు. ఇన్నేళ్ల పాటు తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపాడు. వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా ధోనీ భారత క్రికెట్‌పై తనదైన ముద్ర వేశాడు. అతని సారథ్యంలో టీమిండియా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)లోని మూడు ప్రధాన ట్రోఫీలను గెలుచుకుంది. ధోనీ సారథ్యంలో భారత్ ట్వంటీ20 ప్రపంచకప్, వన్డే వరల్డ్‌కప్‌లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలను సాధించింది. మరే భారత క్రికెట్ కెప్టెన్ కూడా ఇలాంటి ఘనత సాధించలేదు. 2004 డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా ధోనీ భారట జట్టులోకి అడుగు పెట్టాడు. అప్పటి నుంచి ధోనీ మళ్లీ వెనుదిరిగి చూడలేదు. కిందటి ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత ధోనీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. అతని కెరీర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్ చివరి అంతర్జాతీయ పోటీగా నిలిచింది. ప్రపంచ క్రికెట్‌లోని అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ధోనీ ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. సుదీర్ఘ కాలం పాటు సాగిన కెరీర్‌లో ధోనీ ఎన్నో చిరస్మరణీయ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

అనూహ్య నిర్ణయం
కొంత కాలంగా ధోనీ రిటైర్మెంట్ అంశం చర్చనీయాంశంగా మారింది. ధోనీ అంతర్జాతీయ కెరీర్ ముగిసి పోయిందని వార్త కథనాలు వెల్లువెత్తిన అతను మాత్రం ఈ అంశంపైఎలాంటి ప్రకటన చేయలేదు. ఎప్పటికప్పుడూ రిటైర్మెంట్‌పై ఎదురైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే వాడు. అయితే వరల్డ్‌కప్ సెమీఫైనల్ తర్వాత ధోనీ క్రికెట్‌కు దూరంగా ఉంటూ వచ్చాడు. దీంతో అతని కెరీర్ ముగిసిందని అందరూ ఓ అంచనకు వచ్చేశారు. అయితే ధోనీ మాత్రం మరి కొంత కాలం పాటు క్రికెట్ ఆడాలనే ఉద్దేశంతో కనిపించాడు. ఐపిఎల్‌లో రాణించడం ద్వారా మళ్లీ క్రికెట్‌కు శ్రీకారం చుట్టాలని భావించాడు. కానీ కరోనా మహమ్మరి విజృంభించడంతో ఐపిఎల్‌తో సహా అన్ని ఫార్మాట్‌ల క్రికెట్ టోర్నీలు నిలిచి పోయాయి. సుదీర్ఘ కాలం పాటు సాగిన లాక్‌డౌన్‌తో ఐపిఎల్‌ను నిరవధికంగా వాయిదా వేయక తప్పలేదు. అంతేగాక కరోనా దెబ్బకు ఈ ఏడాది జరగాల్సిన ట్వంటీ20 ప్రపంచకప్ కూడా వాయిదా పడింది. ఇలాంటి స్థితిలో మరో ఏడాది పాటు కెరీర్ సాధించడం కష్టంగా తయారైంది. అంతేగాక రిషబ్ పంత్, లోకేశ్ రాహుల్, సంజు శాంసన్ వంటి యువ వికెట్ కీపర్లు టీమిండియాలోకి రావడంతో ధోనీకి చోటు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం తప్ప ధోనీకి మరో మార్గం లేకుండా పోయింది. ఇక తన అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనీ ఎన్నో మరుపురాని రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. అతని సారథ్యంలోనే టీమిండియా వన్డేల్లో, టెస్టుల్లో, ట్వంటీ20 ఫార్మాట్‌లలో నంబర్‌వన్‌గా నిలిచింది. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్‌గా ధోనీ పేరు తెచ్చుకున్నాడు. చివరి ఓవర్లలో అసాధారణ బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ముగించడం ధోనీకి వెన్నతో విద్యగా ఉండేది. 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీకారం చుట్టిన ధోనీ తన చివరి మ్యాచ్‌ను 2019 జులై 19న న్యూజిలాండ్‌పై ఆడాడు. 2005 డిసెంబర్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో టెస్టు క్రికెట్‌కు శ్రీకారం చుట్టాడు. మరోవైపు మొదటి ట్వంటీ20 మ్యాచ్‌ను 2006లో ఆడాడు. ఇక మొత్తం 90 టెస్టుల్లో ఆడిన ధోనీ 144 ఇన్నింగ్స్‌లలో 4876 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు, మరో 33 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక 350 వన్డేలు ఆడిన ధోనీ 10,773 పరుగులు నమోదు చేశాడు. ఇందులో పది శతకాలు, 73 అర్ధ శతకాలు ఉన్నాయి. వన్డేల్లో ధోనీ అత్యధిక వ్యక్తిగత స్కోరు 183 పరుగులు. మరోవైపు 98 ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 1617 పరుగులు చేశాడు. ఇక మూడు ఫార్మాట్‌లలోనూ ధోనీ అత్యుత్తమ వికెట్ కీపర్‌గా పేరు తెచ్చుకున్నాడు. టెస్టుల్లో 256 క్యాచ్‌లు, 38 స్టంపౌట్‌లు సాధించాడు. వన్డేల్లో 321 క్యాచ్‌లు, 123 స్టంపౌట్‌లు చేశాడు.

గోల్డెన్ డకౌట్‌తో కెరీర్ ఆరంభం
ఇక మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ డకౌట్‌తో ఆరంభమైంది. 2004 బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే ద్వారా ధోనీ ఆరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ డకౌటయ్యాడు. అయితే ఆ తర్వాతి మ్యాచ్‌లలో నిలకడైన ఆటతో చెలరేగి పోయాడు. పాకి స్థాన్‌తో విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ధోనీ విధ్వంసక ఇన్నింగ్స్‌తో తిరుగులేని బ్యాట్స్‌మన్‌గా ఎదిగి పోయాడు. సాగర తీరాన జరిగిన ఈ మ్యాచ్‌లో ధోనీ కళ్లు చెదిరే సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకు పడి ఏకంగా 148 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్ ధోనీ కెరీర్‌ను అనూహ్య మలుపు తిప్పింది. ఆ తర్వాత అతనికి ఎదు రే లేకుండా పోయింది. డకౌట్ కెరీర్‌ను ఆరంభించిన ధోనీ ఏకంగా 17266 పరుగులు సాధించి ప్రపంచ క్రికెట్‌లోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు.
చిరస్మరణీయ సిక్స్‌తో..
ఇక సొంత గడ్డపై జరిగిన 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ కొట్టిన మ్యాచ్ విన్నింగ్స్ సిక్స్ భారత క్రికెట్ చరిత్రలోనే మరుపురాని ఘట్టంగా చిరకాలం గుర్తుండి పోతుందనడంలో సందేహం లేదు. ఆ సిక్స్‌తో భారత్‌కు రెండో వన్డే ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గా ధోనీ తన పేరును భారత క్రికెట్‌లో సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. ధోనీ ఆ మ్యాచ్‌లో చివరి వరకు అజేయంగా ఉంటూ జట్టును విజయపథంలో నడిపించిన ఇన్నింగ్స్ ప్రపంచ క్రికెట్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లలో ఒకటిగా చిరకాలం గుర్తుండి పోవడం ఖాయం.

కెప్టెన్‌గా అరుదైన రికార్డు
ఇక కెప్టెన్‌గా కూడా మహేంద్ర సింగ్ ధోనీ ఎన్నో చిరస్మరణీయ విజయాలు తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ ట్రోఫీలుగా పేరున్న మూడు కప్పులను ధోనీ భారత్‌కు అందించాడు. 2007లో ట్వంటీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ ట్రోఫీలను అందించిన ధోనీ 2013లో జట్టుకు ఛాంపియన్స్ ట్రోఫీ సాధించి పెట్టాడు. దీంతో ప్రపంచ క్రికెట్‌లో మూడు ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా ధోనీ అరుదైన రికార్డును నెలకొల్పాడు.
మలుపు తిప్పిన ఇన్నింగ్స్
2005లో సొంత గడ్డపై చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్ ధోనీ కెరీర్‌ను అనూహ్య మలుపు తిప్పిందని చెప్పాలి. విశాఖలో పాకిస్థాన్‌తో జరిగిన ఓ వన్డేలో ధోనీ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయాడు. పాక్ బౌలర్లను చీల్చిచెండాడిన ధోనీ 123 బంతుల్లోనే 148 పరుగులు చేసి పెను ప్రకంపనలు సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత ధోనీకి ఎదురు లేకుండా పోయింది.

మ్యాచ్ ఫినిషర్‌గా గుర్తింపు

మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌లోని అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్లలో ఒకడిగా ధోనీ పేరు తెచ్చుకున్నాడు. ఎంత పెద్ద లక్షమైన చివరి వరకు క్రీజులో నిలిచి మ్యాచ్‌ను ముగించడం ధోనీకి వెన్నతో పెట్టిన విద్యగా ఉండేది. ఎన్నో మ్యాచుల్లో ధోనీ చివరి వరకు అజేయంగా నిలిచి జట్టుకు విజయాలు అందించే వాడు. దీంతో అతనికి అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్‌గా గుర్తింపు వచ్చింది. 2006లో సొంత గడ్డపై పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్ ద్వారా ధోనీకి ఈ పేరు సార్ధకం అయ్యింది. ఆ సిరీస్‌లో ధోనీ చాలా మ్యాచుల్లో మ్యాచ్‌ను ముగించి మంచి ఫినిషర్‌గా అవతరించాడు. ధోనీ అసాధారణ బ్యాటింగ్ వల్ల ఈ సిరీస్‌ను భారత్ 41తో సొంతం చేసుకుంది.

మహిమలకు కొదవలేదు

ఇక ప్రపంచ క్రికెట్‌లో మహేంద్ర సింగ్ ధోనీ సాధించిన మహిమలకు కొదవలేదు. అవును మరి అతని మహి మలు ఒకటా రెండా.. అనుకున్నదే తడవుగా సిక్సర్ కొట్టేసినా.. రెప్పపాటులో స్టంపింగ్స్ చేసినా..వికెట్లను చూడకుండానే రనౌట్లు చేసినా..సరికొత్త ఆలోచనలతో అద్భుతాలు సృష్టించినా ధోనీకే చెల్లింది. అంతేగాక కుర్రాళ్ల ఆటగా పేరున్న ఐపిఎల్‌లో డ్యాడ్స్ ఆర్మీతో మూడు సార్లు ట్రోఫీని ముద్దాడినా ఆ ఘనత మొత్తం ధోనీకే దక్కుతోంది. ఎంతో మంది కుర్రాళ్లను ఛాంపియన్లుగా తీర్చిదిద్దినా..అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ టీమిండియాకు టి20, వన్డే ప్రపంచకప్‌లు అందించినా, ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడినా ఆ రికార్డులన్నీ ధోనీ సారధ్యంలోనే సాకారం అయ్యాయి. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రపంచకప్ కలను నెరవేర్చిన ఘనత కూడా ధోనీ కెప్టెన్సీకే దక్కుతోంది. ఇక, ప్రపంచ టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల ఆధిపత్యానికి తెరదించుతూ భారత్‌ను నంబర్‌వన్‌గా నిలిపిన ఘనత కూడా ధోనీ సొంతం. ఇలాంటి ఎన్నో రికార్డులు ధోనీ తన ఖాతాలో జమచేసుకున్నాడు.

ప్రముఖుల అభినందనలు
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అభినందనలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)తో పాటు భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ధోనీ సాధించిన రికార్డులను గుర్తు చేస్తూ ట్వీట్ చేశాయి. ఇక భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రవిశాస్త్రి, మాజీ క్రికెటర్లు వివిఎస్.లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, గంభీర్, జహీర్, కృష్ణమా చారి శ్రీకాంత్, ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు హర్షా భోగ్లే తదితరులు ధోనీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత క్రికెట్‌కు ధోనీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మరోవైపు ధోనీ సారధ్యంలో ప్రపంచకప్‌ను గెలుచుకోవడం తన జీవితంలోనే అత్యంత అరుదైన ఘట్టమని సచిన్ పేర్కొన్నాడు. తన కలను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషించిన ధోనీని ఎన్నటికి మరచి పోలేనని తెలిపాడు. ఇక చాలా మంది మాజీ క్రికెటర్లు కూడా ధోనీతో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు.

MS Dhoni Retires from International Cricket

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News