Friday, May 3, 2024

మంత్రి తలసానిపై కేసులు కొట్టివేత..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్‌ః రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోపాటు మరి కొందరిపై మోపిన రెండు వేర్వేరు కేసులలో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా పేర్కొంటూ నాంపల్లి 2వ సెషన్ కోర్టులో ఎంపి, ఎంఎల్‌ఎ కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం విచారణ అనంతరం తీర్పునిచ్చింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ఆదూరి చిన్న శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం 2009 సంవత్సరం ఏప్రిల్ 13 వ తేదీన సికింద్రాబాద్ లోని అడ్డగుట్ట క్రాస్ రోడ్ లో ఎలాంటి అనుమతులు లేకుండా స్టేజి ని ఏర్పాటు చేశారనే కారణంతో అప్పటి తుకారాం గేట్ పోలీసులు ఎ1గా అజయ్ బాబు, ఎ5 గా తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పేర్కొంటూ మొత్తం ఐదుగురిపై 188, 290, 143 సెక్షన్ ల క్రింద కేసు నమోదు చేశారు.

అదేవిధంగా 2014 సంవత్సరంలో నిబంధనలకు విరుద్దంగా పాదయాత్రను నిర్వహించారని ఎ1 గా ఎంఎన్ శ్రీనివాస్, ఎ2 గా తలసాని శ్రీనివాస్ యాదవ్ లను పేర్కొంటూ వీరిద్దరిపై 188, 76 సిపి యాక్ట్ కింద గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్వాపరాలు విచారించిన నాంపల్లి రెండవ సెషన్ కోర్టులో ఎంపి, ఎంఎల్‌ఎ కేసుల విచారణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టు మంగళవారం విచారణ అనంతరం సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు కేసులో పేర్కొన్న వారందరిని నిర్దోషులుగా పేర్కొంటూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వరప్రసాద్ తీర్పునిచ్చారు. మంత్రి తరపున న్యాయవాదులు ఆదూరి చిన్న శ్రీనివాస్, అన్నపూర్ణ లు వాదించారు.

Nampally Court Dismisses case against Minister Talasani

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News