Saturday, April 27, 2024

‘జూబ్లీహిల్స్’ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీసుల విచారణ తీరుపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలికల, మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వారం రోజుల్లోగా నివేదిక పంపాలని డిజిపికి జాతీయ మహిళా కమిషన్ ఆదేశాలిచ్చింది. అదేవిధంగా వరుస అత్యాచార ఘటనలపై సీరియస్ అయిన కమిషన్ పోలీసు శాఖకు నోటీసులు జారీచేసింది. జూబ్లీహిల్స్ ఘటనలో రాజకీయ నాయకుల పిల్లలు కారులో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన తమ దృష్టికి వచ్చిందని, మరో అత్యాచార ఘటన కూడా కమిషన్ దృష్టికి రావడంతో వీటిని తమ పరిగణలోకి తీసుకుంటున్నట్లు కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మ వెల్లడించారు. మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని, నిందితులపై తక్షణ చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ కోరింది. బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేసే ఈ వీడియోలను ఆన్‌లైన్ నుంచి తొలగించాలని, వీడియోలను పోస్టుల చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కమిషన్ కూడా కోరింది. ఇప్పటికే జాతీయ బాలల హక్కు పరిరక్షణ కమిషన్ నుంచి పోలీసు శాఖకు నోటీసులు అందాయి. మరోవైపు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్ తమిళిసై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లకు వివరణాత్మక నివేదిక సమర్పించాలని ఆదేశించిన విషయం విదితమే.

National Women Commission serious on Jubilee Hills Rape Case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News