Monday, May 6, 2024

నీతి ‘అయోగ్యం’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో అత్యున్నతమైన వ్యవస్థ అయిన నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి వెళ్లకూడదని, ఈ సమావేశాన్ని బహిష్కరించి తన నిరసనను తెలియజేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించుకొన్నట్లు తెలిసింది. ప్రధాన మం త్రి నరేంద్రమోడీ అధ్యక్షతన ఈనెల 27న ఢిల్లీలో జరుగనున్న నీతి ఆయోగ్ జనరల్ కౌన్సిల్ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మ మత బెనర్జీ, న్యూఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజా బ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌మాన్ కూడా బహిష్కరిస్తున్నట్లు తెలిసింది. నీతి ఆయోగ్ వ్యవస్థను కేంద్ర ప్రభు త్వం నీరుగార్చిందని, ఆ సంస్థ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకుండా బుట్టదాఖలు చేయడంతోనే నీతి ఆయోగ్ దండుగమారి వ్యవస్థగా మారిపోయిందనే విమర్శలు, ఆరోపణలు జాతీయస్థాయిలో తీవ్రంగా ఉన్నాయనే విషయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలకు స్పష్టంగా తెలిసేటట్లు చేసేందుకే ఈ నేతలు నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకొన్నట్లుగా తెలిసింది.

దీనికి తోడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ శనివారం (ఈ నెల 27న) హైదరాబాద్‌కు వచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో భేటీ అవుతారని, ఎన్నో కీలకమైన అంశాలపై ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు సుదీర్ఘంగా చర్చలు జరుపుతారని, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డా.బి.ఆర్.అంబేద్కర్ సచివాలయం నూతన భవనాన్ని సందర్శిస్తారని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. వీరిద్దరి సమావేశానికే ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిపారు. అంతేగాక నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్తే అత్యంత విలువైన సమయం వృథా అవ్వడమే కాకుండా విమాన ఖర్చులు కూ డా దండుగేనని, అందుచేత నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లాల్సి న ప్రాముఖ్యత ఏమీ లేదని ప్రభుత్వం భావిస్తోందని ఆ అధికారులు వెల్లడించారు. అంతేగాక నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించే ముఖ్యమంత్రుల జాబితాలో తమిళనాడు రాష్ట్రా లు కూడా ఉన్నాయని తెలిపారు.

అయితే స్టాలిన్, పినరయి విజ యన్‌లను రప్పించడానికి ప్రధాని కార్యాలయం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరువురు నాయకులకు సన్నిహి తులైన జాతీయ నేతలను పురమాయించి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. రికమండేషన్లు, ఒత్తిళ్లను గౌరవించి ఆ ఇద్దరు సిఎంలు నీతి ఆయోగ్ సమావేశానికి వెళతారో… లేదో.. అనే విషయంపై శనివారం ఉ దయమే స్పష్టత వస్తుందని ఆ అధికారులు వివరించారు. ప్రధాన మంత్రి అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో బిజెపియేతర రాష్ట్రాలకు ఒరిగేదేమీ ఉండదనే విషయం గత సమావేశాలన్నీ స్పష్టం చేశాయని, ఇప్పుడు ఈ సమావేశానికి వెళ్లినా కొత్త గా వచ్చే ప్రయోజనం ఏమీలేదని  తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలు గట్టిగా భావిస్తున్నాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా సుమారు 90 వేల కోట్లకు పైగా నష్టపరిచిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు కేవలం రాజకీయపరమైన కక్షసాధింపులకు పాల్పడుతూ నీతి ఆయోగ్ సిఫారసులు, 14వ ఆర్థ్ధిక సంఘం సిఫారసులు, 15వ ఆర్థ్ధిక సంఘం సిఫారసులను కూడా అమలు చేయకుండా బుట్టదాఖలు చేసిన ఘనతను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమే మూటగట్టుకుటోందని ఆ అధికారులు వివరించారు.

వాస్తవానికి తెలంగాణ రాష్ట్రానికి 2018లోనే నీతి ఆయోగ్ సిఫారసుల ప్రకారం మన రాష్ట్రంలోని మిషన్ భగీరథ పథకానికి 19,205 కోట్ల రూపాయలను గ్రాంటుగా నిధులు రావాల్సి ఉందని తెలిపారు. అంతేగాక మిషన్ కాకతీయ పథకానికి మరో రూ.5వేల కోట్ల నిధులను ఇవ్వాలని కూడా అప్పట్లో నీతి ఆయోగ్ సిఫారసు చేసిందని, కానీ ఇప్పటి వరకూ ఆ సిఫారసులు అమలుకు నోచుకోలేదని అన్నారు. నీతి ఆయోగ్ సిఫారసు చేసిన నిధులే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి 14వ ఆర్థ్ధిక సంఘం, 15వ ఆర్థ్ధిక సంఘం సిఫారసు చేసిన నిధులు కూడా నాలుగేళ్ల క్రితమే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థ్ధిక మంత్రిత్వశాఖ, నీతి ఆయోగ్‌లు నిజాయితీగా వ్యవహరించి తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా ఇవ్వాల్సిన 35,099 కోట్ల రూపాయల నిధులు ఏనాడో విడుదల అయ్యేవని వివరించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ పెద్దలు తెలంగాణ రాష్ట్రంపై కక్షగట్టి కేవలం రాజకీయపరమైన దురుద్దేశ్యంతో 2022-23వ ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 47,869 కోట్ల రూపాయలను నష్టం చేశారని వివరించారు.

గ్రాంట్ -ఇన్ -ఎయిడ్‌లో రూ.27,821 కోట్లకు కోత విధించిన కేంద్రం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని, అంతేగాక రుణాల సమీకరణలో మరో 20,048 కోట్ల రూపాయలు నష్టంచేసిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇక నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశంలో కొత్తగా చెప్పేదేముంది అని ఆ అధికారులు వ్యాఖ్యానించారు. దేశ రాజధాని నగరం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి-ఆప్) పాలనలో ఉన్న ఢిల్లీ రాష్ట్రాన్ని కబళించడానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలు చేసిన కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొనే పనిలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారని, తన ఉద్యమాలకు మద్దతును కూడగట్టేందుకు దేశంలోని బిజెపి యేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తున్నారని వివరించారు. ఇక పంజాబ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేటట్లు చేసింది కేంద్ర సర్కార్ పెద్దలేనని, ఆ రాష్ట్రంపై నీతి ఆయోగ్ ఇచ్చిన సిఫారసులను కూడా కేంద్రం అమలు చేయలేదనే కోపంతోనే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకొన్నారని వివరించారు.

ఇలా దేశంలోని అన్ని రాష్ట్రాలూ నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వ పెద్దలపైనా గుర్రుగానే ఉన్నాయని, కాకుంటే బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ కోపాన్ని, అసహనాన్ని, అసంతృప్తులను మనసులోనే దిగమింగుకొంటున్నారని తెలిపారు. బిజెపి యేతర రాష్ట్రాలే కాకుండా బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వ ఆర్థ్ధిక విధానాల మూలంగా వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నాయని, ఈ విషయంలో తప్పకుండా బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా అంతులేని అసంతృప్తులతోనే ఉన్నాయని, ప్రతి ఒక్కరూ తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నారని వివరించారు. అందుకే నీతి ఆయోగ్ సమావేశాలను బహిష్కరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకొన్న

నిర్ణయాలకు దేశంలోని ఇతర మెజారిటీ రాష్ట్రాలు సంపూర్ణంగా మద్దతు పలికాయని, అంతేగాక సమావేశానికి వెళ్లే ముఖ్యమంత్రులు కూడా మనస్ఫూర్తిగా వెళ్లడంలేదని, గత్యంతరం లేక, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో గొడవలు పెట్టుకోలేకనే కోపాన్ని, ఆవేదనను దిగమింగుకొని వెళుతున్నారని తెలిపారు. లేకుంటే ఐటి దాడులు, సిబిఐ కేసులు, ఈడీ కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని భయంతోనే నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశాలకు వెళుతున్న ఆయా రాష్ట్రాల అధికారులు కూడా తమకు వివరించారని, ఇప్పటికే చాలా రాష్ట్రాల అధికారులు తెలంగాణ ప్రభుత్వ అధికారులకు ఫోన్లు చేసి నీతి ఆయోగ్ సమావేశానికి వస్తున్నారా? రావడం లేదా? అని ఎంతో ఆసక్తిగా వాకబు చేశారని ఆ అధికారులు వివరించారు.
నీతి ఆయోగ్ భేటీకి హాజరుకావొద్దని ఆప్ సిఎంల నిర్ణయం
ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన శనివారంనాడు జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్ సిఎంలు కేజ్రీవాల్, భగవంత్ మాన్ బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆప్ అధినేత కేజ్రీవాల్ శనివారంనాడు ప్రధాని మోడీకి లేఖ రాశారు. ‘ఒక ప్రధానే సుప్రీంకోర్టు ఉత్తర్వుకు కట్టుబడి ఉండనప్పుడు ఇక ప్రజలకు న్యాయం ఎక్కడ లభిస్తుంది అని ప్రజలు అడుగుతున్నారు. సహకార సమాఖ్యవాదమే ఓ జోక్ అయింది. అలాంటప్పుడు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవ్వడంలో అర్థమేముంది?’ అని కేజ్రీవాల్ తన లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ పాలనాధికారాలపై కేంద్రం ఆర్డినెన్స్ నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రధానికి లేఖ రాశారు. ఇక రాష్ట్రాలకు నిధుల పంపిణీపై కేంద్రం చూపుతున్న వివక్షను నిరసిస్తూ సమావేశాన్ని బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించుకున్నట్టు పంజాబ్ సిఎం భగవంత్ మాన్ ప్రధానికి లేఖ రాశారు. ఇదిలావుండగా ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ కూడా హాజరుకావొద్దని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటన చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News