Wednesday, May 1, 2024

100% ఇథనాల్‌తో నడిచే టోయోటా ఇన్నోవా కారు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రపంచంలోనే మొట్టమొదటి నమూనా అయిన టొయోటా కిర్లోస్కర్ తయారు చేసిన బిఎస్6 స్టేజ్ 2 ‘ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ వెహికల్’ను మంగళవారం నాడు న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖమంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పాల్గొన్నారు. 100 శాతం ఇథనాల్ ఇంధనంతో నడిచే టయోటా ఇన్నోవా హైక్రాస్ కారు ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనం నమూనా. ఇది బిఎస్6 స్టేజ్-2 నిబంధనల ప్రకారం అభివృద్ధి చేశారు. హైబ్రిడ్ వ్యవస్థతో ఈ కారు ఇథనాల్ ఇంధనం నుండి 40 శాతం విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు. కాగా ఇథనాల్ ధర లీటరుకు దాదాపు రూ.60గా ఉంది. అంటే ప్రస్తుతం లీటరుకు రూ.100 చొప్పున విక్రయించే పెట్రోల్ కంటే ఇది చాలా తక్కువగా ఉంది. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, ఇథనాల్ ఇంధనంతో వాహనాలకు ఇంకా సమస్య ఉందని, దేశంలో ఇథనాల్ పంపుల కొరత ఉందని అన్నారు.

అందుకే అన్ని పెట్రోలియం కంపెనీలను ఇథనాల్ పంపులను ప్రారంభించేలా ఆదేశించాలని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్‌ని కోరుతున్నానని అన్నారు. దేశం 16 లక్షల కోట్ల విలువైన ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఇదొక పెద్ద సమస్య అని అన్నారు. మన దేశంలో 40 శాతం కాలుష్యం శిలాజ ఇంధనం కారణంగా ఉందన్నారు. ఇండియన్ ఆయిల్ పానిపట్‌లో ఒక ప్లాంట్‌ను కలిగి ఉందని, ఇది గడ్డి నుండి 1 లక్ష టన్నుల బయో-ఇథనాల్, 150 టన్నుల బయో-విటమిన్‌లను ఉత్పత్తి చేస్తుందన్నారు. బియ్యం, మొక్కజొన్నతో తయారు చేసే ఇథనాల్ ధర గతంలో రూ.56 ఉండేది. ఇప్పుడు దానిని రూ.54కు తగ్గించారు. ఈ చర్య వల్ల పరిశ్రమ చాలా లాభపడిందని వివరించారు. ఇథనాల్ ఆర్థిక వ్యవస్థ విలువ 2 లక్షల కోట్లకు చేరుకునే రోజు, వ్యవసాయ వృద్ధి రేటు 12 శాతం నుంచి 20 శాతానికి పెరుగుతుందని తెలిపారు.

మారుతీ కూడా ఫ్లెక్స్-ఇంధన వాహనంపై పనిచేస్తోంది..
టయోటాతో పాటు మారుతి ఫ్లెక్స్- ఇంధన వాహనాలపై కూడా పని చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కంపెనీ వ్యాగన్ ఆర్ ప్రోటోటైప్‌ను ప్రదర్శించింది. ఈ కారు 85 శాతం ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో నడుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News