Saturday, November 2, 2024

ఎంపి అర్వింద్‌పై రైతుల కన్నెర్ర

- Advertisement -
- Advertisement -

Nizamabad Farmers fires on MP Arvind

 

చేతకాకపోతే ఎంపి పదవికి రాజీనామా చేయి
నీవ్వు తప్పకుంటే కేంద్రంతో తామే తాడోపేడో తేల్చుకుంటాం
ఎంపి అరవింద్‌పై నిజామాబాద్ పసుపు రైతుల ఫైర్

మన తెలంగాణ/హైదరాబాద్/నిజామాబాద్ : పసుపు బోర్డు తేలేకపోయిన ఎంపి అరవింద్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని నిజామాబాద్ పసుపు రైతులు డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పసుపు బోర్డును తీసుకొస్తానని ఎన్నో హామీలు ఇచ్చిన అరవింద్ ఇప్పటి వరకు దానిని ఎందుకు సాధించలేకపోయారని వారు ప్రశ్నించారు.

శుక్రవారం నిజామాబాద్‌లోని వేల్పుర్ మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పసుపు రైతులు ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ స్థానిక ఎంపి పసుపుబోర్డు విషయంలో ఎందుకు దృష్టి సారించడం లేదని నిలదీశారు. దీనిపై ఆయన ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రైతుల కోసం బిజెపి హైకమాండ్‌ను నిలదీసే ధైర్యం అరవింద్‌కు లేదా? అని వ్యాఖ్యానించారు. రైతులను మోసం చేసి తప్పించుకునేందుకే రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు చూస్తున్నారని వారు మండిపడ్డారు. తనను ఎంపిగా గెలిపిస్తే కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే పసుపుబోర్డును తీసుకరావడంతో పాటు రైతులకు మద్దతు ధర ఇప్పిస్తానని అరవింద్ ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేసి బాండ్ పేపర్ రాసి ఇచ్చాడని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. మరి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి దాదాపు రెండు సంవత్సరాలు కావొస్తున్నప్పటికీ ఆ విషయంపై అరవింద్ ఎందుకు నోరు విప్పడం లేదన్నారు.

నిజామాబాద్ రైతులకు స్పైస్ బోర్డు అవసరం లేదన్నారు. కావాల్సింది పసుపు బోర్డు మాత్రమేనని అన్నారు. దానిని సాధించేవరకు పోరాటం ఆపేది లేదని పసుపు రైతులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆయన మాటలను నమ్మి ఎంపిగా గెలిపిస్తే తమను నిండా ముంచాడని ఆరోపించారు. పసుపుబోర్డు సాధించ లేదని ఆయన ఇప్పుడేమో పసుపుబోర్డు కావాలని మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి….మార్కెట్ ఇంట్రవెన్షన్ స్కీమ్ అమలు చేయాలని కొత్త నాటకాలు ఆడుతున్నాడని ధ్వజమెత్తారు. గతంలో టిఆర్‌ఎస్ ఎంపి కవితతో పసుపుబోర్డు, మద్దతు ధర సాధ్యం కాలేదనే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అని అరవింద్‌ను గెలిపించుకున్నామన్నారు. ఆయనకు చేత కాకుంటే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తమను తీసుకెళ్లాలని వారు సూచించారు. అక్కడే కేంద్రంతో తాడోపేడో తేల్చుకుని వస్తామన్నారు. ఇచ్చిన మాటప్రకారం అరవింద్ పసుపు బోర్డును తీసుకరాని పక్షంలో తగు రీతిలో బుద్ధిచెబుతామని వారు హెచ్చరించారు. ఇందులో భాగంగా అరవింద్ ఇంటిని ముట్టడించడంతో పాటు గ్రామగ్రామాన బిజెపి నాయకులను అడ్డుకుంటామన్నారు. పసుపు బోర్డు కోసం ఉద్యమాలు చేసిన నిజమైన రైతులను అరవింద్ విస్మరిస్తున్నారని వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News