Monday, April 29, 2024

ఓలా స్కూటర్‌లో రివర్స్ గేర్

- Advertisement -
- Advertisement -

Ola Electric reveals reverse gear feature

ముంబయి: బైక్ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని కొన్నిఫీచర్లను సంస్థ శనివారం వెల్లడించింది. ద్విచక్ర వాహనాల్లో అరుదుగా ఉండే రివర్స్ మోడ్‌ను దీనిలో పొందుపరచినట్లు కంపెనీ సిఇఓ భవీష్ అగర్వాల్ ప్రకటించారు. ‘రివల్యూషన్ టు రివర్స్ క్లైమేట్ చేంజ్’ అనే క్యాప్షన్‌తో స్కూటర్ రివర్స్‌లో వెళుతున్న ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ‘నమ్మశక్యం కాని వేగంతో స్కూటర్‌ను రివర్స్ చేయొచ్చు’ అని రాసుకొచ్చారు. టూవీలర్స్‌లో రివర్స్ మోడ్ చాలా అరుదుగా ఉంటుంది. ఖరీదైన బైక్ హోండా గోల్డ్ వింగ్‌తో పాటుగా బజాజ్ చేతక్, ఏథర్ 450 ఎక్స్, టివిఎస్ ఐక్యూట్ వంటి ఈ స్కూటర్లలో మాత్రమే ఈ ఫీచర్ ఉంది. ఓలా స్కూటర్‌ను 18 నిమిషాల్లో 50 శాతం చార్జ్ చేయొచ్చని కంపెనీ గతంలో ప్రకటించింది. ఈ సగం చార్జింగ్‌తో 75 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయొచ్చని తెలిపింది.

వీటితో పాటుగా తాళం చెవి లేకుండానే యాప్ ద్వారానే స్కూటర్‌ను స్టార్ట్ చేసే అత్యాధునిక ఫీచర్‌ను కూడా దీనిలో చేర్చినట్లు సమాచారం. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న ఈ స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేయనున్నారు. గత నెల 15న ఈ స్కూటర్ ప్రీ బుకింగ్స్ మొదలు కాగా తొలి 24 గంటల్లోనే లక్ష స్కూటర్లు బుక్ అయిన విషయం తెలిసిందే. మరిన్ని ఫీచర్లను లాంచింగ్ రోజే వెల్లడించనున్నారు. కాగా ఇప్పటివరకు సంస్థ ఈ స్కూటర్ ధరను వెల్లడించలేదు. అయితే రూ.85,000 వరకు ఉండవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారత్‌లో తయారు చేస్తున్న ఓలా స్కూటర్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. వేగం, చార్జింగ్, బూట్ స్పేస్ విషయంలో ఈ విభాగంలో ఇదే అత్యుత్తమమైనదిగా నిలిచే అవకాశముందని మార్కెట్ వర్గాల అంచనా. పది రంగుల్లో ఈ స్కూటర్ లభించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News