Monday, April 29, 2024

రాష్ట్రవ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్

- Advertisement -
- Advertisement -

రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం
హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
పొంగిపోర్లుతున్న చెరువులు, వాగులు
నగరంలోనూ దంచికొట్టిన వాన
పలు ప్రాంతాలు జలమయం
నిలిచిపోయిన ట్రాఫిక్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 131.3 మిల్లీమీటర్ల వర్షపాతం

Orange alert in Telangana
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది. రానున్న రెండురోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని, ఈ నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో ఈ రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిరి, నాగర్ కర్నూల్ జిల్లాలో గంటకు 30 నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ మండలాల మధ్య నిలిచిన రాకపోకలు

పశ్చిమ, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో చెరువులు, వాగులు, పొంగిపోర్లుతున్నాయి. పిట్లం మండలం తిమ్మానగర్ దగ్గర వరద ఉధృతి పెరిగింది. తిమ్మానగర్ దగ్గర ఉన్న నల్లవాగు వరద ఉధృతికి తెగింది. దీంతో పిట్లం నుంచి సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు.

Orange alert in Telangana

రోడ్లపై భారీగా వరద నీరు

సోమవారం హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, మాదాపూర్, మెహిదీపట్నం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం నేపథ్యంలో రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. పలుచోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.

లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు

అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో రెండు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇక హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా, తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Orange alert in Telangana

22 గ్రామాలకు నిలిచిన రాకపోకలు

కుండపోత వానకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చిగురుటాకులా వణికిపోతోంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలకు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి వాగులు, వంకలు, కుంటలు, చెరువుల్లో భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఆసిఫాబాద్ మండలంలోని 22 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

దౌలతాబాద్ వంతెనపై ఉధృతంగా వరద నీరు

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. భైంసా డివిజన్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు గ్రామాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు చోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. తానుర్ మండలంలోని కార్బల, దౌలతాబాద్ వంతెనపై ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

నిండు కుండలా కడెం ప్రాజెక్టు

కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. నిన్నటి నుంచి కురుస్తున్న కుండపోత వర్షానికి ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 696.7 అడుగులకు చేరుకుంది. ఇన్ ఫ్లో 34, వేల క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 29 వేల క్యూసెక్కులుగా ఉంది. ఎగువ నుంచి ఇన్ ఫ్లో పెరుగుతుండడంతో ఐదు గేట్లు ఎత్తి గోదారిలోకి అధికారులు నీటిని వదులుతున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రాణహిత నదికి వరద పోటెత్తింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజికి భారీగా వరద వస్తోంది. బ్యారేజిలో 24 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి 95,960 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తుండగా లక్షా 2వేల 840 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మేడిగడ్డ సామర్థ్యం 16 .17 టిఎంసిలకు గాను 13.3 టిఎంసీలకు నీటిని నిల్వ ఉంచారు.

బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు దాటేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం కారణంగా కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ గనుల్లో వర్షపునీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.

మహబూబాబాద్‌లో 94 మిల్లీమీటర్లు

సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 131.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురవగా, మహబూబాబాద్‌లో 94, జయశంకర్ భూపాలపల్లిలో 85, వికారాబాద్‌లో 80.8, మహబూబ్‌నగర్‌లో 80.5, భద్రాద్రి కొత్తగూడెంలో 73.8, జనగాంలో 71.3, వనపర్తిలో 68.5, ములుగులో 70.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News