Tuesday, April 30, 2024

రైతన్నకు వరి కోత కష్టాలు

- Advertisement -
- Advertisement -

Paddy harvesting

 

ఒకవైపు లాక్‌డౌన్.. మరోవైపు అకాల వానల భయం
పలుచోట్ల హార్వెస్టర్ల కొరత.. గంటకు రూ.300 వరకు రేటు పెంపు
రాష్ట్రంలో 11,697 కోత యంత్రాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేందుకు ప్రభుత్వం అనుమతి
కూపన్ తేదీ ప్రకారమే కొనుగోళ్లు.. పకడ్బందీ ఏర్పాట్లు

మన తెలంగాణ/హైదరాబాద్: రబీ వరి కోతలు మొదలయ్యాయి. వాటితోపాటే కష్టాలూ రైతుల్ని వెంటాడుతున్నాయి. ఒకవైపు లాక్‌డౌన్.. మరోవైపు హాట్‌స్పాట్లు, ఇంకోవైపు వర్షభయం రైతులను వెంటాడుతోంది. ధాన్యం అమ్మకాలపై వీటి ప్రభావం పడుతుందనే ఆందోళన అన్నదాతల్లో వ్యక్తమవుతోంది. పలు చోట్ల వరికోత యంత్రాల కొరత నెలకొంది. ఫలితంగా ధరలు పెంచుతున్నారు.

టైర్ మిషన్‌కు మొన్నటిదాకా గంటకు రూ.1800 చొప్పున వసూలు చేయగా.. ఈ రబీలో మాత్రం గంటకు రూ.2 వేల నుంచి రూ.2200 వరకు పెంచారు. ఒక్క ఎకరం పొలం కోసేందుకు మిషన్‌కు గంట 10 నిమిషాల నుంచి గంట 20 నిమిషాల వరకు పడుతుంది. ఒకవేళ పొలం కొద్దిగా తడిగా ఉన్నా.. ఇంకా సమయం పడుతుంది. దీంతో ఎకరానికి రూ.3500 వరకు ఖర్చు అవుతోందని యదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక యువరైతు మన తెలంగాణతో వ్యాఖ్యానించారు.

మరోవైపు వరికోత ఎక్కువ సంఖ్యలో రైతులు ఒక్కరోజే చేపట్టోద్దని సిఎం సూచించారు. అయితే రైతులు మాత్రం పంట చేతికొచ్చిందని కోత చేపడుతున్నారు. రైతు అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న యంత్రాల యజమానులు ధరలను అమాంతంగా పెంచేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్‌తో అంతరాష్ర్ట చెక్‌పోస్టులను కట్టుదిట్టం చేయడంతో ఇతర రాష్ట్రాల నుంచి యంత్రాలు రాకపోవడంతో ఇక్కడి యంత్రాలకు బాగా డిమాండ్ పెరిగింది.

దీనికి తోడు వరణుడు భయపెడుతుండటంతో రైతుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. అయితే సిఎం కెసిఆర్ ఇతర రాష్ట్రాల నుంచి వరికోత యంత్రాలను రప్పించాలని, సరిహద్దుల్లో వాటిని అనుమతించాలని ఇప్పటికే పోలీసు శాఖకు ఆదేశించారు. కర్ణాటక, తమిళనాడుల నుంచి వరి హార్వెస్టర్లను అనుమతిస్తున్నారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో 11,697 పంట కోత యంత్రాలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే వాటిలో ఎన్ని రాష్ట్రానికి చెందినవాటిని గుర్తించే పనిలో ఉన్నారు.

దాదాపు ఇంకో ఐదారు వేలు అందుబాటులోకి రావాల్సి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కాళేశ్వరం జలాలు అందుబాటులోకి రావడంతో ఈ రబీలో తెలంగాణలో రికార్డు స్థాయిలో వరిసాగు నమోదైంది. సాధారణ సాగు విస్తీర్ణం అంచనా 17.08 లక్షల ఎకరాలు కాగా అంతకు రెండింతలుగా దాదాపు 39 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఏకంగా 1.05 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది.

చైన్‌ట్రాక్ మిషన్లతో గడ్డి కొరత
వరి ధాన్యం కోతకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతన్నలకు మరో సమస్య ఎదురవుతోంది. మామూలుగా హార్వెస్టర్ సాయంతో వరి కోతలు చేపడితే గడ్డి వస్తుంది. కానీ, అకాల వర్షాలతో బురదమయమైన పొలాల్లో వరి ధాన్యం కోతకు చైన్ ట్రాక్ మిషన్లు వాడుతుండడంతో గడ్డి పూర్తిగా నలిగి నేలపాలవుతోంది. దీంతో గడ్డి కొరత ఏర్పడుతోంది. ఇప్పటికే గడ్డి కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతన్నలకు చైన్ ట్రాక్ మిషన్ల వల్ల నెలకొన్న ప్రమాదంతో రానున్న సీజన్‌లో పశువులకు గ్రాసం కొరత ఏర్పడనుంది.

కూపన్ల పంపిణీ.. కొనుగోలు కేంద్రాలు
కొనుగోలు కేంద్రాలకు రైతులు ఒక్కసారిగా రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. వ్యవసాయ విస్తరణ అధికారి(ఎఇఒ), ఎఒ, పౌరసరఫరాల అధికారులు, ప్యాక్స్, గ్రామ కార్యదర్శులు, రైతుబంధు సమితుల సహాయంతో కమిటీలను ఏర్పాటు చేస్తోంది. కోతలు జరుగుతున్న దానికి అనుగుణంగా కూపన్‌లలో తేదీలు ఇస్తున్నారు. వాటికి అనుగుణంగానే కొనుగోలు కేంద్రానికి రైతులు వరిధాన్యాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. ఇచ్చిన తేదీ కంటే ముందుగా వస్తే కొనుగోళ్లు చేపట్టబోమని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై గ్రామాల్లో చాటింపు కూడా చేస్తున్నారు. హమాలీల కొరత లేకుండా స్థానికులను కూడా వినియోగంచడంపై ప్రభుత్వం దృష్టిసారించింది.

రైతుబంధు సమితులకు సమయమిదే : పల్లా రాజేశ్వర్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు
రైతుబంధు సమితుల సభ్యులు క్రియాశీలకంగా పనిచేసే సమయమిది. గ్రామానికి 15 మంది చొప్పున ఉన్నారు. గ్రామాలకు దగ్గర్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నందున వారంతా రైతులకు అవగాహన కల్పిస్తారు. ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలి. కూపన్‌లో ఇచ్చిన తేదీలకు అనుగుణంగా రైతులు కొనుగోలు కేంద్రాలకు వచ్చేలా చూడాలి. కేంద్రాల వద్ద సామాజిక దూరం కచ్చితంగా పాటించాలి.

 

Paddy harvesting difficulties for the Farmer
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News