Saturday, April 27, 2024

మనిషి శరీరంలో ఆరో భూతం!

- Advertisement -
- Advertisement -

మనిషి శరీరంలో ప్రాణప్రదమైన పంచ భూతాలే కాకుండా మరో భూతం కూడా వచ్చిచేరింది. ఇది అత్యంత ప్రమాదకరమైన కాలుష్య ప్లాస్టిక్‌భూతం. ఆధునిక జీవనశైలి. ఎగిసిపడి వచ్చే నిత్య సరికొత్త వాడకపు సాధనాలతో మనిషి శరీరంలో సూక్ష్మకణాల రూపంలో ఈ ప్లాస్టిక్ వచ్చిచేరుతోందని పర్యావరణ, మానవ శరీర ధర్మ సైంటిస్టులు, డాక్టర్లు గత దశాబ్ద కాలంగా చెపుతూ వస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పుడు దాదాపుగా ప్రతి మనిషిలో జీవకణాల ప్లాసెంటాలో అంతర్గతంగా ఈ ప్లాస్టిక్ సూక్ష్మకణాలు చేరుకుని, కాలం గడుస్తున్న కొద్దీ పేరుకుపోతున్నాయి. పలురకాల అనారోగ్య సమస్యలు తలెత్తేలా చేస్తున్నాయి. ఇవి నిజానికి ఇప్పడు చివరికి డాక్టర్లకే అంతుచిక్కని, చికిత్సకు వీలు కాని రోగాలకు దారి తీస్తున్నాయని అధ్యయనంలో వెల్లడైంది. విచిత్ర రీతిలో తలెత్తుతున్న రోగాలకు గురవుతున్న వారిని పరీక్షించిన ప్రఖ్యాత డాక్టర్లకు వారిలోని కణజాలాలలో పేరుకుని ఉన్న ప్లాస్టిక్ రేణువులు కన్పించాయి.

మార్కెట్‌లో ప్రతి సరకు ప్లాస్టిక్‌యుత కవర్లతో భద్రం అయి ఉండటంతో అనుకోకుండానే ఎంతో కొంత శాతం ప్లాస్టిక్‌ను మనిషి అవాంఛనీయ రీతిలోనే తనలోకి తీసుకోవల్సి వస్తోంది. ప్లాస్టిక్ కాలుష్య తీవ్రత గురించి చాలా కాలంగా పర్యావరణవేత్తలు హెచ్చరికలు వెలువరిస్తున్నారు. అయితే మనం కోరుకునే వాడుకునే వాటితోనే మనలోకి విషతుల్య ప్లాస్టిక్ వచ్చిచేరుతోందని గుర్తించారు. చివరికి ఇప్పుడు మనిషి శరీరంలో అంతర్లీనం అయిపోతున్నాయని గుర్తించారు. పొద్దునే వచ్చే పాల ప్యాకెట్లు, బిస్కట్ ప్యాకెట్లు, కిటికీల ఫ్లేమ్‌ల నుంచి మనిషికి ఏదో విధంగా ప్లాస్టిక్ సోకుతోంది. ప్లాసిక్ నుంచి అని తెలియకుండానే క్రమేపీ ఇవి అనారోగ్యంపాలు చేస్తున్నాయి. సంబంధిత తాకిడితో దెబ్బతింటున్న మానవుడి గురించి న్యూ మెక్సికో హెల్త్ యూనివర్శిటీ సైన్స్ విభాగం విశేష అధ్యయనాలు నిర్వహించింది. మానవ ప్లాసెంటాలో ఏ శాతంలో మైక్రో ప్లాస్టిక్ వచ్చి చేరుతోందనే విషయాన్ని నిర్ధారించే ప్రత్యేక సాధనం ద్వారా సైంటిస్టులు గుర్తించారు. ఈ అధ్యయన వివరాలను ఇప్పుడు టాక్సికలిజకల్ సైన్సెస్‌లో ప్రచురించారు. మనిషి కణజాలంలో ప్రతి గ్రాము లెక్కన చూసుకుంటే వివిధ స్థాయిల్లో 6.5 నుంచి 790 మైక్రోగ్రాముల మేర ప్లాస్టిక్ రేణువులు వచ్చి చేరినట్లు నిర్ధారణ అయింది.

మనుషుల కణజాల శాంపుల్స్ పరిశీలనలో ఈ నిజాలు వెల్లడయ్యాయి. శరీరంలో ఇప్పుడు పేరుకునిపోతున్న ప్లాస్టిక్ శాతం పరిణామం తక్కువే అయినప్పటికీ ఇది క్రమేపీ కలిగించే ముప్పు తీవ్రతరం అని వెల్లడైంది.ప్రత్యేకించి గర్భిణుల్లో ఇది ముప్పు తెచ్చిపెడుతుంది. పుట్టబోయే బిడ్డలకు చేటును తెచ్చిపెడుతుంది. భవిష్యత్తరాల మేధో వికాసానికి భంగపాటు అవుతుందని తేల్చారు. అన్ని రకాల ప్రాణుల శరీర స్థితిగతులను ప్లాస్టిక్ కణజాలం ఏదో విధంగా ప్రభావితం చేస్తుంది. అయితే ఆధునిక జీవిత క్రమంలో నిత్యావసరాల దిశలో ప్లాస్టిక్ వాడకం లేకుండా గడపడం సాధ్యమేనా అనే ప్రశ్న కీలకం అయింది. ఏదో విధంగా శరీరంలోకి వచ్చి చేరే ప్లాస్టిక్ కాలుష్యం మనిషికి కన్పించని శత్రువు అవుతోంది. ప్రత్యేకించి ప్లాస్టిక్ బ్యాగులు, సీసాలు తయారు చేసేందుకు వాడే పాలిథిన్ చివరికి మనిషి కణజాలంలోకి సులువుగా చేరుకొంటోంది. మొత్తం ప్లాస్టిక్‌లో ఇది 54% వరకూ మనలో వచ్చిచేరే పరాయి కణజాలం అవుతోందని ఈ అధ్యయన కర్తలు తేల్చి చెప్పారు. ప్రత్యేకించి పాలివినైల్ క్లోరైడ్ (పివిసి), నైలాన్ ఎక్కువగా మనిషి కణజాలాల్లోకి చేరుకుంటున్నాయి. వీటి వాటా దాదాపు పది శాతం వరకూ ఉంటోంది.

ఎటువంటి అవలక్షణాలు ?
మనిషిని ఇటీవలి కాలంలో ఎక్కువగా కండరాల నొప్పి, చివరికి కొరుకుడు పడని గొంతు క్యాన్సర్, జీర్ణాశయ వ్యాధులకు ప్రత్యేకించి 50 ఏండ్ల లోపువారిలో తలెత్తే పలు అనారోగ్యాలకు ఈ ప్లాస్టిక్ బెడదనే కారణం అని తేల్చారు. అన్నింటికన్నా ప్రత్యేకించి సంతానోత్పత్తి దశలోని మగవారిలో క్రమేపీ వీర్యకణాలు తగ్గడం కూడా దీనితోనే ఏర్పడుతోందని సైంటిస్టులు తమ అధ్యయన పత్రంలో తెలిపారు. పిండస్థ దశలోని కణజాలంలో ఉండే అత్యంత స్వల్ప స్థాయి ప్లాస్టిక్ రేణువుల శాతాన్ని తగ్గించేందుకు ఇప్పటి నుంచి అయినా తగు చర్యలు తీసుకున్నా కూడా పెద్దగా ఫలితం ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2050 నాటికి ఇది మూడురెట్లు అత్యధికశాతానికి చేరుకుంటుందని అధ్యయన కర్తల్లో ఒకరైన కాంపెన్ తెలిపారు. ఎందుకంటే ఇది నివారించలేని స్థితికి చేరుకుంది. అయినా ఇప్పటికిప్పుడు మనం వెంటనే కానీ ఇక ముందు కానీ ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపివేసే పరిస్థితుల్లో లేం అని ఈ సైంటిస్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News