Saturday, May 4, 2024

గల్వాన్ లోయకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ

- Advertisement -
- Advertisement -

గల్వాన్ లోయకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సును కూడా..
మే-జూన్‌లో సందర్శనకు నిర్ణయం

న్యూఢిల్లీ: భారత్-చైనా సైనిక దళాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న తూర్పు లడఖ్ ప్రాంతంలోని గల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సును సందర్శించాలని రక్షణ రంగానికి చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి జువల్ ఓరమ్ అధ్యక్షతలోని 30 మంది సభ్యులతో కూడిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మే చివరి వారం లేదా జూన్‌లో ఆ ప్రాంతాలను సందర్శించాలని నిర్ణయం తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఎసి)ను సందర్శించాలని స్టాండింగ్ కమిటీ భావిస్తున్నందున దీనికి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించవలసి ఉంటుంది. స్టాండింగ్ కమిటీలో సభ్యుడైన కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ సమావేశానికి హాజరుకాలేదని వర్గాలు తెలిపాయి.
గల్వాన్ లోయలో ఘర్షణల అనంతరం గడచిన తొమ్మిదినెలలుగా అక్కడ ఇప్పటికీ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడంతో పాంగాంగ్ సరస్సుకు ఉత్తర, దక్షిణ ఒడ్డున మోహరించిన ఉభయ దేశాలకు చెందిన సైనిక బలగాలను ఉపసంహరించుకోవడంపై భారత్, చైనా సైన్యాల మధ్య ఒక అంగీకారం కుదిరింది. దశలవారీగా సమన్వయంతో, పరస్పర తనిఖీలతో దళాల ఉపసంహరణ జరగాలని ఉభయ దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. సైనిక బలగాల ఉపసంహరణ ఒప్పందంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం పార్లమెంట్‌లో సుదీర్ఘ ప్రకటన చేశారు. ఈ ఒప్పందం మేరకు చైనా తన బలగాలను పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరాన ఫింగర్ 8 ప్రాంతంలోని తూర్పు వైపునకు వాపసు రప్పించుకోవాలి. కాగా..భారత బలగాలు ఫింగర్ 3 ప్రాంతానికి సమీపాన ఉన్న ధన్ సింగ్ థాపా పోస్ట్ వద్ద తన శాశ్వత స్థావరానికి పరిమితం కావాల్సి ఉంటుంది. ఇదే రకమైన కార్యాచరణ సరస్సుకు దక్షిణ ఒడ్డున కూడా చేపట్టాల్సి ఉంటుంది.


పాంగాంగ్ సరస్సు వద్ద నిస్సైనికీకరణ ఒప్పందాన్ని కుదుర్చుకున్న భారత్ ఏ సరిహద్దులను చైనాకు అప్పగించలేదని దక్షణ మంత్రి స్పష్టం చేశారు. దేప్‌సంగ్, హాట్ స్ప్రింగ్స్, గోగ్రా తదితర అపరిష్కృత సమస్యలపై త్వరలో ఉభయ దేశాల సైనిక కమాండర్ల మధ్య జరగనున్న చర్చలలో ప్రస్తావించనున్నట్లు ఆయన తెలిపారు. భారత భూభాగాన్ని కేంద్ర ప్రభుత్వం చైనాకు వదులుకుందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించడంతోపాటు నిస్సైనికీకరణ ఒప్పందం ప్రక్రియపై అనేక ప్రశ్నలను సంధించిన నేపథ్యంలో రక్షణ మంత్రి పార్లమెంట్‌లో ఈ ప్రకటన చేశారు. పాంగాంగ్ సరస్సు ప్రాంతంలోని ఫింగర్ 4 వరకు భారత సరిహద్దులు ఉన్నాయన్న వాదనను రక్షణ శాఖ నిర్దంద్వంగా ఖండించింది. ఆ ప్రాంతంలోని రెండు వైపులా శాశ్వత స్థావరాలు ఎప్పటి నుంచో ఉన్నాయని, వాటిలో ఎటువంటి మార్పు లేదని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఒప్పందం ఫలితంగా భారత్ తన సరిహద్దులను వదులుకోలేదని, పైగా ఎల్‌ఎసిని రెండు దేశాలు గౌరవించాల్సిందేనని స్పష్టం చేయడంతోపాటు ఏకపక్షంగా ఎటువంటి మార్పులు జరగకుండా నిరోధించిందని ఆయన చెప్పారు.

Parliamentary Panel proposes visit to Galwan Valley

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News