Saturday, April 27, 2024

ప్రజాస్వామ్యానికి పీడ!

- Advertisement -
- Advertisement -

Party Defection Act is eroding roots of Indian Democracy

 

భారత ప్రజాస్వామ్య మూలాలను దొలిచివేస్తున్న పార్టీ ఫిరాయింపుల రోగానికి ఇప్పటికీ సరైన మందు కనుక్కోలేకపోడాన్ని ఏమనాలి? రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టం లేదా రాజ్యాంగం పదో షెడ్యూలు ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను గుంపు ఫిరాయింపుల ద్వారా దింపి వేసే దుస్తంత్రానికి తెర దించడంలో ఘోరంగా విఫలమవుతున్న విషయాన్ని గమనించి కూడా దేశ పాలకులు మిన్నకుండడాన్ని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అయినా ఆ అప్రజాస్వామిక దురాగతాన్ని అరికట్టడానికి ఎవరూ నడుంకట్టడం లేదు. బలవంతుడైన రాజే దొంగతనానికి పాల్పడినప్పుడు నిస్సహాయులైన ప్రజలు మాత్రం ఏమి చేయగలరు? 2016 నుంచి 2020 వరకు దేశంలో జరిగిన ఎంఎల్‌ఎల పార్టీ ఫిరాయింపుల నుంచి ఎక్కువగా లాభపడింది భారతీయ జనతా పార్టీయేనని తాజాగా నిగ్గు తేలిన సత్యమే ఇందుకు తిరుగులేని తార్కాణం. 2016-2020 మధ్య ఫిరాయించిన 405 మంది శాసన సభ్యుల్లో 42 శాతం మంది కాంగ్రెస్‌వారేనని తేలింది.

అదే సందర్భంలో ఫిరాయించిన బిజెపి ఎంఎల్‌ఎలు కేవలం 4.4 శాతం మంది మాత్రమేనని బయటపడింది. ప్రజాస్వామిక సంస్కరణల సంఘం (ఎడిఆర్) అధ్యయనంలో ఈ సమాచారం వెల్లడైంది. ఇటీవలి కాలంలో మధ్యప్రదేశ్, మణిపూర్, గోవా, అరుణాచల్ ప్రదేశ్, కర్నాటక, పుదుచ్చేరి ప్రభుత్వాలు పడిపోడానికి ఫిరాయింపులే తోడ్పడ్డాయని ఈ అధ్యయనం కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. ఈ ఫిరాయింపులన్నీ డబ్బుకి, ప్రలోభాలకి లొంగిపోయి జరిగినవేనని స్పష్టం చేసింది. ఈ అన్ని చోట్ల ఫిరాయింపుల వల్ల లాభపడింది బిజెపియేనన్నది తెలిసిందే. మహారాష్ట్రలో రాజ్‌భవన్‌ను ఉపయోగించి, శివసేన ఎన్‌సిపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఫిరాయింపులతో కూలదోయడానికి కేంద్రంలోని బిజెపి పాలకులు విఫలయత్నం చేసిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియాను బుట్టలో వేసుకొని అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసిన పిమ్మట అదే తంత్రాన్ని సచిన్ పైలెట్ ద్వారా రాజస్థాన్‌లో నడిపించడానికి భారతీయ జనతా పార్టీ చేసిన ప్రయత్నమూ తెలిసిందే.

ఇలా ఎక్కడబడితే అక్కడ ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా అధికారాన్ని కొల్లగొట్టడంలో ఆరితేరిపోయిన కేంద్ర పాలకులు మన ప్రజాస్వామ్యానికి ఈ మహమ్మారి రోగం నుంచి విముక్తి సాధిస్తారని ఎంత మాత్రం ఆశించలేము. రాష్ట్రాల్లో ఫిరాయింపుల కారణంగా ప్రభుత్వాలు అర్థంతరంగా పడిపోయినప్పుడల్లా ఆ తప్పుడు పనికి పాల్పడిందెవరో ప్రజలకు, ప్రజాస్వామ్య హితులకు వివరంగా తెలుస్తూనే ఉంటుంది. కాని అలా కూల్చివేతలు జరిగిన ఆయా రాష్ట్రాల్లో గాని, దేశవ్యాప్తంగా గాని ప్రజలు గట్టిగా గొంతెత్తి ఆ ప్రజాస్వామ్య హత్యాకాండను నిరసించిన సందర్భం ఒక్కటీ లేదు. ఓట్లు వేయడం వరకే తప్ప ఆ ఓటు తీర్పుకి, విలువకు తూట్లు పడినప్పుడు అందుకు బాధ్యులైన వారిని నిలదీసి అడగడం మన ప్రజలకు అలవాటు లేదు. మీడియా తదితర శక్తుల బలం అపారంగా ఉన్న పార్టీలు ఫిరాయింపుల వల్ల అధికారాన్ని నష్టపోయినప్పుడు ఆ బలగాలను ఉపయోగించి తిరిగి దానిని సాధించుకున్న సందర్భాలు దేశ చరిత్రలో ఒకటో రెండో లేకపోలేదు. కాని ప్రజలే తమంతతాముగా సంఘటితమై ఇటువంటి ఫిరాయింపుల దురాగతాలను అడ్డుకోలేకపోడం బాధాకరమే.

అది దేశంలో ప్రజాస్వామ్య చైతన్య లోపానికి రుజువని చెప్పక తప్పుదు. ఇటువంటి సందర్భాల్లో క్రియాశీల పాత్ర పోషించవలసిన న్యాయ వ్యవస్థ కూడా చూసీచూడనట్టు ఊరుకోడం జరుగుతున్నది. మరి కొన్ని సందర్భాల్లో అదే ఫిరాయింపుదార్లకు మేలు కలిగే విధమైన తీర్పులు వెలువరిస్తున్నది. 2019 నవంబర్‌లో పార్టీ ఫిరాయించిన 17 మంది కాంగ్రెస్, జెడి(ఎస్) ఎంఎల్‌ఎల శాసన సభ్యత్వాలను రద్దు చేస్తూ అప్పటి స్పీకర్ తీసుకున్న నిర్ణయం సబబైనదేనని చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ మాజీ ఎంఎల్‌ఎలందరూ అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి పోటీ చేయడానికి అనుమతించింది.

ఆ విధంగా ప్రజాస్వామ్యానికి, ప్రజాభీష్ఠానికి వెన్నుపోటు పొడిచిన వారికే సుప్రీం న్యాయస్థానం మేలు చేసింది. ప్రభుత్వాలను పడదోయడానికి శాసన సభ్యత్వాలకు రాజీనామా చేసి ఆ తర్వాత అవతలి పక్షంలో చేరిన వారిని ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక కార్యకర్త దాఖలు చేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టులో విచారణ నడుస్తున్నది. అటువంటి, అంతకు మించిన కఠిన శిక్షలకు ఆస్కారమిచ్చే చట్టాన్ని తీసుకు వస్తేగాని ఫిరాయింపుల నుంచి దేశ ప్రజాస్వామ్యానికి కలుగుతున్న చెప్పనలవికానంత హాని శాశ్వతంగా తొలగిపోదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News