Tuesday, April 30, 2024

శ్వాస సమస్యల రోగుల్లో 40 శాతం మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

Corona

 

న్యూఢిల్లీ: కరోనా సోకిన వారితో సన్నిహితంగా మెలగనప్పటికీ, అలాగే ఇప్పటివరకు ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయనప్పటికీ తీవ్రమైన శ్వాస సంబంధిత ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతున్న వారిలో 40 శాతం మందికి కరోనా సోకిందని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) తెలిపింది. దేశవ్యాప్తంగా 15 రాస్ట్రాల్లోని 36 జిల్లాల్లో ఇలాంటి కేసులు వెలుగు చూశాయని ఆ సంస్థ అంటూ, వైరస్ వ్యాప్తి కారకాలుగా ఉన్న ఈ ప్రదేశాల్లో అలాంటి రోగులపై నిఘా పెట్టడంతో పాటుగా సమూహ వ్యాప్తి కట్టడిపై ప్రధానంగా దృష్టిపెట్టాలని సూచించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 5,981 తీవ్రమైన శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిలో 104 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని , వీరిలో నలభై మందికి కరోనా బాధితులతో సన్నిహితంగా మెలిగిన లేదా, అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన చరిత్ర లేదని ఐసిఎంఆర్ తెలిపింది.

అంతే కాకుండా కరోనా పాజిటివ్ కేసుల్లో పురుషులే ఎక్కువగా ఉన్నారని, అది కూడా 50 ఏళ్లు పైబడిన వారు అధికంగా ఉన్నారని కూడా ఆ సంస్థ తెలిపింది. కాగా మొత్తం కోవిడ్19 కేసుల్లో 39.2 శాతం మందికి కరోనా రోగులతో సన్నిహితంగా మెలిగిన లేదా అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన చరిత్ర లేదని ఐసిఎంఆర్ తాజా అధ్యయనం పేర్కొంది. కాగా కరోనా బాధితుల్లో రెండు శాతం మంది మాత్రమే ఈ వైరస్ ధ్రువీకరణ అయిన వారితో సన్నిహితంగా మెలిగిన చరిత్ర ఉండగా, ఒక శాతం మంది ఇటీవల విదేశీ ప్రయాణాలు చేసిన వారున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి రోగుల విషయంలో మరింత గట్టి నిఘాను కొనసాగించడంతో పాటుగా వైరస్ గొలుసుకట్టును తెంచడానికి సమూహ నిరోధక వూహాన్ని(క్లస్టర్ కంటైన్‌మెంట్ స్ట్రాటజీ)ని పకడ్బందీగా అమలు చేయాలపి ఐసిఎంఆర్ తన అధ్యయనంలో పేర్కొంది.

ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధం
కాగా కరోనానుంచి కోలుకున్న వ్యక్తి రక్తంలోని యాంటీ బాడీస్ ద్వారా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులకు చికిత్స చేయడానికి ఉద్దేశించిన ప్లాస్మా చికిత్సకు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి ప్రోటోకాల్‌ను రూపొందించే ప్రక్రియ తుది దశలో ఉందని ఐసిఎంఆర్ అధికారి ఒకరు చెప్పారు. కాగా, ప్రయోగాత్మకంగా ఈ థెరపీని ప్రాణాపాయస్థితిలో ఉండే కరోనా రోగులపై ప్రారంభించే తొలి రాష్ట్రం కేరళ కానున్నదని కూడా తెలుస్తోంది. దేశంలో తొలిసారిగా ఆ రాష్ట్రంలో ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి శ్రీ చిత్ర తిరునాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అండ్ టెక్నాలజీ సంస్థకు ఐసిఎంఆర్ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి ముందు వారు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియానుంచి అనుమతి తీసుకోవలసి ఉంటుందని ఆ అధికారి చెప్పారు.

 

Patients with breathing problems have Corona
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News