Friday, April 26, 2024

ప్రజలే ప్రజాస్వామ్య రక్షకులు

- Advertisement -
- Advertisement -

2005 నుండి ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛాయుత వాతావరణం క్షీణిస్తూ, నిరంకుశ అణచివేతలు, రాజకీయ అస్థిరత, ప్రజాస్వామ్య ప్రక్రియలు సన్నగిల్లుతూ వస్తుండడంతో ఒక విధమైన ఆందోళన కలుగుతుంది. అయితే, 2022లో అణచివేతలకు, నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచంలో పలు చోట్ల సామాన్య ప్రజానీకం, వివిధ వర్గాలు గొంతెత్తి మాట్లాడుతూ దారుణమైన నిరంకుశ పాలకులకు తీవ్ర ప్రతిఘటన ఇస్తూ ఉండడంతో సరికొత్త ఆశ చిగురిస్తుంది. దాదాపు ప్రతి రోజూ, క్రెమ్లిన్, బీజింగ్‌లలోని నిరంకుశ పాలన, ఇరాన్‌లోని అవినీతి మతాధికారుల పాలన లేదా మయన్మార్‌లోని మిలిటరీ జుంటా హేయమైన చర్యల గురించి మాత్రమే కాకుండా, సాధారణ ప్రజల -ఉక్రేనియన్ సైనికులు, ఇరానియన్ మహిళలు, సూడానీస్ ఉపాధ్యాయుల సాహసోపేత చర్యల గురించి కూడా మనం వింటున్నాము.

అనేక మంది సాధారణ వ్యక్తులు దౌర్జన్యాన్ని ఎదిరించి, తమ దేశాలకు మంచి భవిష్యత్తును సృష్టించడానికి అనూహ్యమైన సాహసాలకు పాల్పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్వాతంత్య్రాన్ని ఇష్టపడే ప్రజలు తమ ప్రాథమిక హక్కులను నిరాకరించడానికి ప్రయత్నిస్తున్న వారిపై తీవ్రంగా పోరాడిన సంవత్సరంగా 2022 మనకు గుర్తుండిపోతుంది. ప్రజాస్వామ్యం ఒక పదార్థంగా తనను తాను రక్షించుకోదని, బలపరచుకోలేదని, ప్రోత్సహించుకోలేదని ఈ సందర్భంగా ఫ్రీడమ్ హౌస్ అధ్యక్షుడు మైఖేల్ అబ్రమోవిట్జ్ స్పష్టం చేశారు. సమానత్వం, వైవిధ్యం, స్వేచ్ఛ, జవాబుదారీతనం వంటి మౌలిక సూత్రాల పట్ల దృఢ నిబద్ధత కలిగిన వ్యక్తులచే ప్రజాస్వామ్య సంస్థలను సృష్టించి రక్షించుకో గలుగుతామని, వారే అటువంటి సంస్థలను మరింతగా మెరుగు పరుచుకుంటారని తెలిపారు.

కేవలం రాజ్యాంగం, చట్టం ఇచ్చిన హామీల మేరకు ప్రజాస్వామ్యం మనుగడ సాగింపలేదని ఈ సందర్భంగా గుర్తించాలి. ప్రజాస్వామ్య పరిరక్షణకు మన రాజకీయ నాయకులు ఖచ్చితంగా తగు నిబద్ధతను ప్రదర్శించాల్సి ఉంది. రాజ్యాంగంలో కీలకమైన వ్యవస్థలు సహితం తమ విధులను నిష్పక్షపాతంగా నెరవేర్చవలసిన ఉంది. అయితే, వాటితో పాటు సాధారణ ప్రజలపై కూడా ఈ విషయంలో సమిష్టి బాధ్యత ఉంటుందని గ్రహించాలి. అప్పుడే ప్రజాస్వామ్య ప్రక్రియ ఆశించిన ఫలితాలు ఇవ్వగలదు. నిరంకుశ వ్యవస్థలలో మాదిరిగా ప్రభుత్వాలు, పాలకుల దయాదాక్షిణ్యాలతో ప్రజాస్వామ్య భవిష్యత్తు ఆధారపడి ఉండదు. ప్రజాస్వామ్యం, నిరంకుశత్వం మధ్య ప్రపంచ యుద్ధాన్ని నడిపించే శక్తులు కొన్నిసార్లు వ్యక్తుల ప్రభావానికి అతీతంగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ వాస్తవం భిన్నంగా ఉంటుంది.

మనం మన పొరుగున ఉన్న చైనా, మయన్మార్‌లలో నిరంకుశ పాలకులకు కిరాతక సైనికుల దుశ్చర్యలకు సహితం తలవంచకుండా సాధారణ ప్రజలు ఏ విధంగా తిరగబడుతున్నారో చూస్తున్నాము. ఇరాన్‌లో నిరసన తెలుపుతున్న మహిళలపై క్రూరమైన అణచివేతను పాలకులు అమలు పరుస్తున్నా వారిని శాంతింప చేయలేకపోతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక వ్యవస్థలలో ఒకటిగా చెప్పుకొనే, మరే దేశం వద్ద కూడా లేని అత్యాధునిక అణ్వాయుధాలు ఉన్నప్పటికీ రష్యా, ఉక్రెయిన్ సాధారణ పౌరుల ధృడ సంకల్పం ముందు నిలబడలేకపోతున్నాయి.

మన దేశంలో సహితం తిరుగులేని రాజకీయ ఆధిపత్యం ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల ఉధృతమైన నిరసనల ముందు తలవంచి మూడు రైతు చట్టాలను ఉపసంహరించుకోవలసి వచ్చింది. చట్టాల అమలుకు కావలసింది కేవలం రాజకీయపరమైన అధికారం మాత్రమే కాదని, ప్రజా సమ్మతం కూడా అని మరోసారి రుజువయింది. ప్రజా భాగస్వామ్యంలేని ఎంతటి బలవంత ప్రభుత్వాలైన సరే అస్థిరత్వానికి గురయ్యే ప్రమాదం ఉన్నట్లు అనేక సందర్భాలలో, అనేక దేశాలలో జరిగిన సంఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 2023లో స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి అనుకూలమైన వాతావరణం ఏర్పాటులో తమ వంతు పాత్ర పోషించాలనుకునే వారికి పరిగణించవలసిన కొన్ని అర్థవంతమైన, సాధించగల అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించు కుందాము.

ప్రేక్షక పాత్ర పనికిరాదు

వ్యవస్థను మార్చాలనుకొనేవారు ముందుగా ఆ వ్యవస్థలో చేరాలని, ప్రేక్షక పాత్ర వహించడం పనికి రాదని జర్నలిస్ట్, చరిత్రకారుడు అన్నే యాపిల్‌బామ్ తెలిపారు. ఏదైనా సంస్థ ద్వారా లేదా ఏదైనా అంశంపై స్వచ్ఛందంగా ఇటువంటి సేవ చేయాలని సూచించారు.ఆ విధంగా చేయడం వల్లన సానుకూల ప్రభావాన్ని చూపే వారి సామర్థ్యాన్ని అంతర్గతీకరించడానికి, ఇతరులకు ప్రదర్శించడానికి కూడా అవకాశం కల్పిస్తుంది. వివిధ మార్గాల ద్వారా కీలక సమస్యలపై అభిప్రాయాలను వ్యక్తం చేయడం ద్వారా ప్రజాస్వామ్యం పట్ల ప్రదర్శించే నిబద్ధత తమ నాయకులను జవాబుదారీగా ఉంచగలిగేందుకు దోహదపడే అవకాశం ఉంటుంది. ఓటు వేయడానికి స్నేహితులు, కుటుంబ సభ్యులను నమోదు చేసుకోవడంలో సహాయపడటం, ఓటర్ల జాబితా దోష రహితంగా ఉండే విధంగా అప్రమత్తంగా వ్యవహరించడం సహితం ప్రజాస్వామ్యంలో కీలక అంశం కాగలదు.

ప్రమాదంలో జర్నలిజం

స్వతంత్ర జర్నలిజం ప్రజాస్వామ్యానికి రక్షణ కల్పించడంలో ప్రధానమైన అంశం కాగలదు. అయితే, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక కారణాలతో ఈ రక్షణ వ్యవస్థ ప్రమాదంలో పడింది. ప్రపంచ వ్యాప్తంగా, నిజ- ఆధారిత రిపోర్టింగ్‌ను నిరోధించడానికి లేదా శిక్షించడానికి నిరంకుశ పాలకులు, శక్తులు భౌతిక దాడులు, డిజిటల్ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా విస్తృతంగా వ్యాపించడం, సాంప్రదాయ ప్రకటనల ఆధారిత వ్యాపార నమూనాల పతనం మీడియా స్వతంత్రంకు ప్రధాన సవాల్‌గా మారింది. సోషల్, ఎలెక్ట్రానిక్ మీడియా సాధనాలు ఎంతగా వ్యాపిస్తున్నప్పటికీ ఇప్పటికీ వార్త కథనాల విశ్వసనీయతలో ప్రింట్ మీడియా అగ్రస్థానంలో ఉందని చెప్పవచ్చు.

ఒక పరిశీలకుడి అభిప్రాయం ప్రకారం సోషల్ మీడియా నకిలీ వార్తల వ్యాప్తి సాధనంగా, ఎలెక్ట్రానిక్ మీడియా నిబద్ధత లేని ఆవేశాలు లేదా విద్వేషాల వ్యాప్తి సాధనాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా స్థానికంగా వార్తలు సేకరించడం, ఘర్షణ పూర్వక వాతావరణంలో వార్తా సేకరణ ప్రాణాంతకంగా మారుతుంది. టర్కీ ప్రభుత్వం ప్రకటించిన ఉగ్రవాదుల జాబితాలో కనీసం 14 మంది జర్నలిస్టులు ఉండటం పరిస్థితి తీవ్రతను వెల్లడి చేస్తుంది. ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక ఆందోళన సందర్భంగా, ఉక్రెయిన్ లో రష్యా యుద్ధం కారణంగా అనేక మంది జర్నలిస్టులు తీవ్ర నిర్బంధాలను ఎదుర్కొంటున్నారు.

ధృడమైన సమాలోచనలు పునాది

ప్రజాస్వామ్యం అనేది పోటీ ఆలోచనలు, ఆసక్తుల శాంతియుత సయోధ్యపై నిర్మించబడుతుంది. అందుకనే ప్రజాస్వామ్య మనుగడకు ధృడమైన సమాలోచనలు, సహకారం, ప్రజా ప్రయోజనాలలో రాజీ పడకపోవడం ప్రధానం కాగలదు. అటువంటి ప్రక్రియను ప్రోత్సహించడంలో ప్రతి ఒక్కరికీ పాత్ర ఉంటుంది, విభిన్న రాజకీయ ఆలోచనలను ద్వేష భావంతో చూసే అసహనానికి స్వస్తి చెప్పవలసి ఉంది. విభిన్న దృక్కోణాలను వినడానికి, పరిగణించడానికి, అర్థం చేసుకోవడానికి, గౌరవప్రదంగా సహకరించడానికి సిద్ధపడటమే ప్రజాస్వామ్యంలో ఉన్న అందమైన సంస్కృతి కాగలదు. విభిన్న రాజకీయ అభిప్రాయాలు లేదా ప్రపంచ దృక్పథాలను కలిగి ఉన్న వ్యక్తులతో సమాలోచనలు జరపడం ద్వారా మనం మన సైద్ధాంతిక పునాదులను మరింత బలోపేతం చేసుకోగలమని గ్రహించాలి.

ప్రజాస్వామ్యం అంటే కేవలం సంఖ్య బలం మాత్రమే కాదు. ఆలోచనల మధ్య సయోధ్య, ఉమ్మడి బాధ్యతలకు పునాది ఏర్పరచుకోవడం అని గ్రహించాలి. స్వతంత్ర భారత దేశంలో 400 మందికి పైగా ఎంపిలతో రాజీవ్ గాంధీ అందరికన్నా బలమైన ప్రధాని అయి ఉండాలి. అయితే అభద్రతా భావం వెంటాడటంతో ఫిరాయింపుల నిరోధక బిల్లు తీసుకు వచ్చి, ఎంపిలు చేజారిపోకుండా కట్టడి చేసుకొనే ప్రయత్నం చేశారు. అయితే, పివి నరసింహారావు, వాజపేయి ప్రభుత్వాలు అందుకు పూర్తి భిన్నమైనవి. పార్లమెంట్‌లో మైనారిటీ ప్రభుత్వ సారథగా మరే ప్రభుత్వం సాహసింపలేని ఆర్థిక సంస్కరణలను పివి నరసింహారావు ప్రభుత్వం తీసుకు వచ్చింది. సుమారు రెండు డజన్ల పార్టీల మద్దతుతో పాలన సాగించిన వాజపేయి ప్రభుత్వం సహితం అణు ప్రయోగం నుంచి అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకొని, అమలు చేయగలిగింది.

ఈ రెండు ప్రభుత్వాల నిర్ణయాలు, చర్యలే ఆ తర్వాత వచ్చిన డా. మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ ప్రభుత్వాల పాలనకు ఆధారంగా ఉన్నాయని మరువలేము. సొంత పార్టీలో మద్దతు లేని, ‘కీలు బొమ్మ’గా భావించే డా. మన్మోహన్ సింగ్ అవిశ్వాస తీర్మానంను సహితం లెక్కచేయకుండా అమెరికాతో అణు ఒప్పందం చేసుకోగలిగారు. స్వతంత్ర భారత దేశంలో ప్రజలకు విశేషమైన అధికారాలు కల్పించి, ప్రజాస్వామ్యాన్ని జనస్వామ్యం వద్దకు తీసుకు వెళ్లిన సమాచార హక్కు, అటవీ భూమి హక్కులు, భూసేకరణ చట్టానికి సవరణలు వంటి విప్లవాత్మకమైన చట్టాలు తీసుకురావాల్సి వుంది. సాధారణ ప్రజలలో గల ధృఢ సంకల్పమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష అని గమనించాలి.

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News