Tuesday, April 30, 2024

ప్రజలే బలి పశువులు!

- Advertisement -
- Advertisement -

Petrol price is one hundred rupees per liter

 

పెట్రోల్ ధర లీటరు వంద రూపాయల వద్ద ఉగ్ర నాట్యం చేస్తున్నది. దీని వల్ల అన్ని వస్తువుల ధరలు పేట్రేగిపోయి జనజీవనాన్ని అశాంతికి, అభద్రతకు గురి చేసి దేశానికి చెప్పనలవికానంత హాని కలిగిస్తున్నాయి. అయినా కేంద్ర పాలకులకు చీమ కుట్టినట్టయినా ఉండకపోడం ఆందోళనకరం. రవాణా వాహన ఇంధనాలైన పెట్రోల్, డీజెల్ ధరల అపూర్వ విజృంభణ పట్ల రెండు రోజులుగా ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న నిరసన పార్లమెంటు సమావేశాలను ముందుకు సాగనివ్వడం లేదు. ఏ సమస్య మీదనైనా ప్రజల ఆందోళన ఎంతగా మిన్నంటినా దానిని పట్టించుకోకుండా రోజులు, నెలల తరబడి నిర్లక్షం వహించడం దేశ పాలకులకు అలవాటైపోయింది. పెట్రోల్, డీజెల్ ధరలను ప్రభుత్వం అదుపు నుంచి తప్పించి అనియంత్రితం చేసినందువల్ల వాటి పెరుగుదలను ఆపే అధికారం తమకు లేదని పాలకులు చెప్పేదంతా అబద్ధమని ఏనాడో రుజువైపోయింది. కేంద్రం పెట్రోల్ పై ఇష్టావిలాసంగా సుంకాలు విధించి తన ఆదాయం పెరుగుదలకు దానినే ఏకైక వనరుగా చేసుకుంటున్నందునే పెట్రోల్, డీజెల్ ధరలు ఈ విధంగా ఆకాశయానం చేస్తున్నాయన్నది వాస్తవం.

మరొక వైపు వంట గదులను ఆర్పడానికి వీల్లేని మంట గదులుగా చేస్తూ గ్యాస్ ధరను కూడా విపరీతంగా పెంచివేశారు. ఆ రకంగా మార్కెట్‌లో అన్ని వస్తువుల ధరలకు కళ్లేలు వదిలేసి వాటికి పోటీ పెట్టి తమాషా చూస్తున్నారు. కేంద్రం తన ఆదాయం కోసం పెట్రోలియం ఉత్పత్తుల మీద ఆధారపడడం మానుకోవాలని పెట్రోల్, డీజెల్‌ను కూడా వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) పరిధిలోకి తీసుకు రావాలని అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ (అసొచెమ్) ప్రధాన కార్యదర్శి దీపక్ సూద్ వంటి వారు చేస్తున్న సూచనలను కేంద్ర పాలకులు వినిపించుకుంటారనే ఆశలకు ఆస్కారం కలగడం లేదు. మన పెట్రోల్ అవసరాల్లో 86 శాతం మేరకు దిగుమతులు మీదనే ఆధారపడుతున్నామనేది వాస్తవం. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర ఇప్పటి కంటే రెట్టింపు స్థాయిలో బ్యారెల్ 120130 డాలర్ల వద్ద ఉన్నప్పుడు కూడా దేశంలో ఈ రెండు ఇంధనాల ధర ఇంతగా పెచ్చరిల్లిపోలేదనడం అతిశయోక్తి కాదు. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకం పరంగా కేంద్రానికి వచ్చిన ఆదాయం అంతకు ముందరి కంటె 48 శాతం ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి.

కరోనా దారుణంగా విజృంభించి దేశంలో పెట్రోల్, డీజెల్ వినియోగం అసాధారణంగా పడిపోయినప్పుడు కూడా ఈ ఆదాయం శిఖర ప్రాయంగానే ఉన్నది. 2020 ఏప్రిల్ నవంబర్ కాలంలో పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకం రాబడి రూ. 1,96,342 కోట్లు, అంటే 2019 ఏప్రిల్ నవంబర్ కాలంలో వచ్చిన రూ. 1,32,899 కోట్ల కంటే ఎంత ఎక్కువో చెప్పనక్కర లేదు. వాహన రవాణా అవసరాల కోసం అత్యధికంగా ఉపయోగించే డీజెల్ వినియోగం కరోనా లాక్‌డౌన్ కాలం (2020 ఏప్రిల్ నవంబర్) లో మామూలు కంటే 10 మిలియన్ టన్నులు తక్కువగా ఉన్నప్పటికీ దానిపై కేంద్ర ప్రభుత్వం పన్ను ఆదాయం ఇంత భారీగా ఉందంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ కొనుగోలుకు పెడుతున్న ఖర్చుకి అదనంగా రవాణా, శుద్ధి ఛార్జీలను కలుపుకొని నేరుగా ప్రజలకు అందజేసినా వారు ఆనందంగా భరించే స్థాయిలో పెట్రోల్, డీజెల్ ధరలుండేవి. అలా చేయకుండా వీటిపై ఇష్టానుసారం పన్నులను విధిస్తుండడం వల్లనే ఈ దుర్గతి.

ప్రధాని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014లో పెట్రోల్ మీద ఎక్సైజ్ సుంకం లీటర్‌కు రూ. 9.48, డీజెల్ మీద లీటర్‌కు రూ. 3.56 అని గణాంకాలు చెబుతున్నాయి. 2014 నవంబర్, 2016 జనవరి మధ్య ఈ రెండింటి మీద ఆయన ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తొమ్మిది సార్లు పెంచివేసింది. 2017 అక్టోబర్‌లో మాత్రం ఒక సారి వీటిపై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 2 తగ్గించింది. ఆ తర్వాత ఒక సంవత్సరానికి మరో రూ. 1.50 తగ్గించింది. కాని 2019 జులైలో మళ్లీ రెండు రూపాయలు వడ్డించింది. 2020 మార్చిలో రూ. 3 పెంచింది. అదే సంవత్సరం మేలో పెట్రోల్ మీద రూ. 10, డీజెల్ మీద రూ. 13 ఎక్సైజ్ సుంకాన్ని బాదింది. వీటి ధరలను ఇంతగా పెంచనిస్తున్న కేంద్రం సంపన్నుల నుంచి వసూలు చేసే కార్పొరేట్ పన్నును 35 శాతం తగ్గించి వారి నెత్తిన పాలు పోసింది.

కేంద్ర ప్రభుత్వ ఆదాయ దాహమంతటినీ పెట్రోల్, డీజెల్ నుంచే తీర్చుకున్నంత కాలం దేశంలోని వంద కోట్లకు పైగా ఉన్న సాధారణ ప్రజలు లబోదిబో మంటూ విలపించవలసిందే. తిండి, గుడ్డ, విద్య, వైద్యం, ఇల్లు వంటి కనీసావసరాలు తీర్చుకునే స్తోమతకు ఆమడ దూరంలో అరచి గీపెట్టవలసిందే. అనునిత్యం ప్రధాని మోడీ పఠించే అచ్ఛేదిన్‌ను అధిక ధరల అద్దంలో చూసుకొని గుండె బాదుకోవలసిందే. ప్రజలను బలి పశువులను చేయడమే ప్రజాస్వామ్య ధర్మమని నేటి మన కేంద్ర పాలకులు చాటుతున్నారని భావించడంలో తప్పు లేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News