Monday, April 29, 2024

‘టైమ్’ మెచ్చుకున్న భీమ్ నేత

- Advertisement -
- Advertisement -

Bhim leader Chandrashekhar azad who admired ‘Time’

 

అమెరికాకు చెందిన టైమ్ వారపత్రిక ప్రతి సంవత్సరం ఆ యేటి ఎన్నదగిన వారుగా వివిధ కేటగిరీల్లో వ్యక్తుల పేర్లను ప్రకటిస్తుంది. గత నెల ఫిబ్రవరి 17 న ‘2021 టైమ్ 100 నెక్స్ట్’ అని ప్రపంచ వ్యాప్తంగా వంద పేర్లను ఎంపిక చేసి విడుదల చేసింది. భవిష్యత్ తరాలకు ఆదర్శంగా, వారిని తీర్చిదిద్దే దిశలో మార్గదర్శకంగా వీరు సమర్థులు, ప్రతిభావంతులని, వీరికి తమ తమ రంగాల్లో చరిత్ర సృష్టించగల సత్తా ఉందని, ఇప్పటికే కొందరు దాన్ని రుజువు చేసుకున్నారని ఆ పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ డాన్ మాక్సయి పేర్కొన్నారు. సాధారణంగా ఈ జాబితాలో కళాకారులు, అడ్వకేట్లు, లీడర్లు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు ఉంటారు. ఈసారి మన దేశానికి చెందిన ఆరుగురి పేర్లు ఇందులో ఉన్నాయి. అయితే అందులో ఐదుగురు భారతీయ సంతతివారు కాగా ఒక్కరు పూర్తిగా ఈ దేశ పౌరుడు.

రిషి సునాక్‌కు 40 ఏళ్ళు, ఆయన భారతీయ మూలాలున్న బ్రిటిష్ మంత్రి. కరోనా సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడాడని ఆయనకు పేరుంది. 34 ఏళ్ల అపూర్వ మెహతా అమెరికా నివాసి. ఇంస్టాకార్ట్ అనే ఆన్‌లైన్ వ్యాపార సంస్థ వ్యవస్థాపకుడు. విజయ గద్దె అనే భారతీయ అమెరికన్ మహిళ, న్యాయవాది, ట్విట్టర్‌కు న్యాయ సలహాదారు. శిఖా గుప్తా అనే అమెరికన్ డాక్టరమ్మ కరోనా సమయంలో వైట్ హౌస్‌లో సేవలందించడమే కాకుండా గెట్ అస్ పిపిఇ అనే సంస్థ ద్వారా 65 లక్షల పిపిఇ కిట్లను నర్సులకు, ఇతర వైద్య సేవకులకు పంపిణీ అయ్యేట్లు చేశారు. 25 ఏళ్ల రోహన్ పావులూరి కూడా అమెరికా నివాసియే. అప్ సాల్వ్ అనే ఉచిత న్యాయ సలహా సంస్థ స్థాపకుడు. కరోనా సమయంలో దెబ్బతిన్న వ్యాపారాలకు దివాలా, రుణమాఫీ విషయాల్లో న్యాయ సూచనలు ఇచ్చి ఆర్థికంగా కుదేలు కాకుండా ఆదుకున్నాడు.

ఈ ఐదుగురు విద్యాధికులు, చిన్న వయసులోనే వివిధ వృత్తుల్లో స్థిరపడి వాటికి మరింత సార్థకతని చేకూర్చుతున్నారు. వీరిలో ఆరవ వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్ ‘రావణ్’. పై వారితో ఈ పోలికలేని వ్యక్తి. మొదటి ఐదుగురు సూటు బూటు వేసుకొని ఏసి రూముల్లో ఉంటూ ఖరీదైన కార్లలో తిరుగవచ్చు. కానీ ఈ ఆరవవాడు మాత్రం మట్టి మనిషి, దళిత జాతిపై జరిగే దాడుల్ని మీసం మెలేసి ఎదుర్కొంటున్న దళిత ధీరుడు. భీం ఆర్మీ సహా వ్యవస్థాపకుడు. ఈ 34 ఏళ్ల ఈ ధీశాలి తన ఊర్లో తమ ప్రాంతంలో తరాలుగా కొనసాగుతున్న దళిత వివక్షను, అవమానకర సంఘటనలను, హింసాకాండను ఎదురొడ్డి నిలిచి చరిత్ర మార్చే దిశగా పయనిస్తున్నాడు.

భీమ్ ఆర్మీ తరఫున చంద్ర శేఖర్ ఆజాద్ దళిత పిల్లలకోసం 350 కి పైగా పాఠశాలలు నడిపిస్తూ, విద్యను అందుకోలేని పేదరికంలో ఉన్న దళిత కుటుంబాలకు చేస్తున్న సేవకు గుర్తింపుగా ఆయనను ఎంపిక చేశామని టైమ్ పత్రిక పేర్కొంది. ఆజాద్ స్వగ్రామం ఉత్తర ప్రదేశ్‌లోని షహరన్ పూర్ జిల్లాలోని ఘడ్కౌలి అనే గ్రామం. తన తండ్రి అదే ఊర్లో స్కూల్ హెడ్ మాస్టర్. ఊర్లో, పక్కనున్న ఎహెచ్‌పి ఇంటర్ కాలేజీలో చదివి ఆ తర్వాత డెహ్రాడూన్ లోని డిఎవి పిజి కాలేజీలో లా డిగ్రీ అందుకున్నాడు.

అప్పటికే ఊర్లో అగ్రకులాల వారైన ఠాకూర్ల చేతిలో దళితులు హింస అవమానాల పాలవుతున్నారు. ఊర్లో చదువుకునే రోజుల్లోనే రాజపుత్ విద్యార్థులు దళిత పిల్లలతో క్లాస్ రూములను శుభ్రం చేయించేవారు. రాజపుత్ విద్యార్థులు నీళ్లు తాగినాకనే దళితులు తాగాలి. గీత దాటితే దెబ్బలే. ముందు తాగిన పాపానికి పడ్డ దెబ్బలకు ఓ దళిత విద్యార్ధి చేయి విరిగింది. పెళ్లి ఊరేగింపులో ఓ దళిత యువకుడు గుర్రం పై పెళ్లి కుమారుడుగా వెళ్లడాన్ని స్థానిక ఠాకూర్లు ఆగ్రహించి ఆయనను కాలినడకన పంపిన ఘటన ఆజాద్ మనసులో మాననిగాయంగా నిలిచిపోయింది. చిన్నప్పుడు చూస్తూ ఉండిపోయాడు గాని యువ రక్తం దానికి అంగీకరించలేదు.

ఊర్లో మేము పౌరులమే, ఊరుపై మాకూ హక్కుందని విధంగా ఊరి బయట ‘జై భీమ్, జై భారత్, ద గ్రేట్ చమార్ డాక్టర్ భీమ్ రావు అంబేడ్కర్ గ్రామం, ఘఢ్కౌలి మీకు హార్ధిక అభినందనలు తెలుపుతోంది’ అని హిందీలో పెద్ద బోర్డు నిలబెట్టాడు. ఊరు వీరి జాగీరయినట్లు బోర్డు ఏంటని ఠాకూర్లు దానిపై నల్ల రంగు పూశారు. దీనిపై రెండు వర్గాల మధ్య పెద్ద ఘర్షణ జరిగింది. చివరకు అగ్ర కులాలవారు వెనక్కి తగ్గక తప్పలేదు. ఇది దళితుల ఐక్యతకు ప్రేరణగా నిలిచింది.

అంబేడ్కర్ ఆదర్శంగా దళిత యువత ఒక ఛత్రం కిందికి రావడానికి 2015లో ఆజాద్, సతీష్ కుమార్, విజయ్ రతన్ సింగ్ కలిసి భీమ్ ఆర్మీని నెలకొల్పారు. దళిత పిల్లలు స్కూళ్లకు రావద్దు తల్లిదండ్రుల వెంట పనులకు వెళ్లాలని గ్రామ పెద్దలు తీర్మానించినందున విద్య ప్రాధాన్యత తెలిసి భీం ఆర్మీ నేతలు గ్రామీణ దళిత బహుజన ప్రాంతాల్లో ఉచిత పాఠశాలలను ఆరంభించారు. క్రమంగా ఇవి విస్తరించి సహరాన్ పూర్, మీరట్, షామిలి, ముజఫర్ నగర్ జిల్లాలో 350 మించిపోయాయి.

దళిత ఆత్మగౌరవానికి ప్రత్యక్ష కార్యాచరణయే మార్గంగా సాగుతున్న భీమ్ ఆర్మీ ఉత్తరభారతంలోని చాల రాష్ట్రాల్లో క్రియాశీలంగా ఉంది.అ రెస్టులకు, పోలీసు కేసులకు వెరవని ఆజాద్ ధీరత్వం, ఆయన ఆహార్యం, శైలి, మాట తీరు దళిత యువతకు స్ఫూర్తివంతంగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఆర్మీ వెబ్ సీట్లకు లక్షలాది మంది అనుచరులున్నారు. యూ ట్యూబ్ ఆయన పాల్గొన్న ఎన్నో వీడియోలున్నాయి. ఆజాద్ కు పూర్తిగా కుటుంబం మద్దతు ఉంది. ఆయనను అరెస్టు చేసినపుడు తల్లి తండ్రి సోదరులు పాల్గొని ఆందోళనను కొనసాగిస్తారు. ఆజాద్ తండ్రి ఊర్లో అధ్యాపకుడిగా ఉన్నరోజుల్లో తోటి ఉపాధ్యాయులు ఆయన ప్లేటు, గ్లాసును తాకేవారు కాదు. స్వయంగా కులవివక్షను అనుభవించిన ఆయన తన కొడుకులకు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ అని పేర్లు పెట్టాడు.

ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలు ఏదో కుట్రలో ఇరికించి ఆయన్ని జైల్లో తోసేయాలని చూస్తున్నా, పరిణామాలకు బెదిరి మిన్నకుంటున్నాయనుకోవచ్చు. ఒక వ్యక్తిని సంఘ వ్యతిరేక శక్తిగా చిత్రించేందుకు ప్రభుత్వాలు ఉబలాటపడుతుండగా అదే వ్యక్తిని ఒక అంతర్జాతీయ పత్రిక రాబోయే కాలపు నేతగా గుర్తించడం మన దేశంలో సాగుతున్న అప్రజాస్వామిక పాలనకు ప్రతీకగా చూడవచ్చు. పౌర సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆజాద్ ఢిల్లీలో చేపట్టిన ఆందోళన శాంతియుత నిరసనయేనని జడ్జి బెయిల్ మంజూరు చేశారు. తన తీర్పులో ఆయన ‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనిషి తల ఎత్తుకుని తిరుగగలడో, ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛను పొందుతుందో, అక్కడ నా ఈ దేశాన్ని మేలుకొలుపు’ అనే ఠాగూర్ కవితను ఉటంకించడం దేశంలో ఆజాద్ ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులని తెలియజేస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News