Friday, May 17, 2024

ఎంఎల్‌సి ఎన్నికలలో ఓట్లు ఎలా లెక్కిస్తారో తెలుసా?

- Advertisement -
- Advertisement -

 ఎలిమినేషన్ పద్ధతిలో ఎంఎల్‌సి ఓట్ల లెక్కింపు
 గెలుపునకు రెండు, మూడు, నాలుగవ ప్రాధాన్యత ఓట్లూ కీలకమే
 ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓటేసే విధానం, లెక్కింపు కూడా ఆసక్తికరమే

Telangana MLC Votes counting

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ఈ నెల 14వ తేదీన ఎన్నికలు జరగనుండగా, 17న ఓట్ల లెక్కింపు జరుగనుంది. శాసనమండలికి జరిగే ఎన్నికలు పూర్తి విభిన్నం. ఈ ఎన్నికల్లో ఓటింగ్ విధానమే కాకుండా ఓట్ల లెక్కింపు సైతం ఆసక్తికరంగా ఉంటుంది. సాధారణ ఎన్నికల్లో ఒక్కో ఓటరు ఒక్కో అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాల్సి ఉండగా, శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల్లో అందుకు భిన్నంగా ఓట్లువేసే విధానం అమలులో ఉంటుంది. ప్రాధాన్యత క్రమమే ప్రాతిపదికగా నిర్వహించే ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కూడా ఎలిమినేషన్ పద్ధతిలో ఉంటుంది. ఓట్ల లెక్కింపులో పోలైన ఓట్లలో 50 శాతానికి మించి ఏ అభ్యర్థికి ముందుగా లభిస్తాయో వారినే విజేతగా ప్రకటిస్తారు. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో సుమారు 10 లక్షల మందికి పైగా గ్రాడ్యుయేట్లు ఓటు కలిగి ఉండగా, వీరిలో సగం మందిపైగా తొలిసారి ఓటు వేయనున్నారు. ఈ ఎన్నికల్లో ప్రాధాన్య పద్ధతిలో ఓటు వేయాల్సి ఉన్న నేపథ్యంలో కొత్త ఓటర్లలో సందేహాలు నెలకొన్నాయి. అయితే గందరగోళానికి గురి కాకుండా, అభ్యర్థులకు ప్రాధాన్య ఓటు ద్వారా తమ మద్దతు తెలియజేయవచ్చు. పోటీ చేస్తున్న వారిలో కేవలం ఒక్కరికి లేదా ఒకరి కంటే ఎక్కువ మందికి లేదా పోటీలో ఉన్న వారందరికీ ఓటు వేయవచ్చు. అయితే అందరికీ ఒకేలా కాకుండా.. ప్రాధాన్య క్రమంలో అంకెల రూపంలోనే ఓటు వేయాలి.
ఎలిమినేషన్ పద్ధతిలో ఓట్ల లెక్కింపు
పోటీ చేసే అభ్యర్థులందరీకి ఒక్కో ఓటరుకు 1,2,3,4,5,6…పోటీలో ఎంతమంది అభ్యర్థులు ఉంటే ఆ సంఖ్య వరకు అంకెల్లో ప్రాధాన్యతలను ఇస్తూ ఓటు హక్కు వినియోగించుకునే విధానం అమలులో ఉంటుంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో నేరుగా జరిగే ఓట్ల లెక్కింపులో సాధారణ మెజారిటీ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. కానీ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల్లో పోలైన ఓట్లలో చెల్లుబాటు అయిన 50 శాతం ఓట్లు దాటిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. ఒక వేళ ఏ అభ్యర్ధికి కూడా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 50శాతం ఓట్లు అధిగమించకపోతే ఎలిమినేషన్ పద్ధతిలో ఓట్లు లెక్కిస్తారు. తొలుత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో అందరి కంటే తక్కువ వచ్చిన వారిని రౌండ్ల వారీగా ఎలిమినేషన్ చేస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ విధంగా ఎలిమినేట్ అయిన అభ్యర్థుల్లో 2వ,3వ, 4వ, 5వ, 6వ, తదితర ప్రాధాన్యత ఓట్లను పరిగణలోనికి తీసుకుంటూ ఏ అభ్యర్థి ప్రప్రథమంగా 50 శాతం ఓట్లు అధిగమిస్తే అతడిని విజేతగా ప్రకటిస్తారు. ఒక వేళ ఏదైనా రౌండ్‌లో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు 50 శాతానికి పైగా ఓట్లు సాధిస్తే వారిలో ఆధిక్యత ప్రాతిపదికన విజేతను నిర్ణయిస్తారు. ఒక వేళ ఎలిమినేషన్ పద్ధతిలో చివరివరకు ఏ అభ్యర్థి కూడా 50శాతం ఓట్లు అధిగమించకపోతే చివరికి మిగిలిన ఇరువురు అభ్యర్థుల్లో మెజారిటీ ఓట్లు పొందిన వారిని విజేతగా ప్రకటిస్తారు.
ఓట్ల లెక్కింపు ఇలా
శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల్లో పోలైన మొత్తం ఓట్లలో చెల్లుబాటు అయిన ఓట్లలో సగం కంటే ఒక్క ఓటు ఎక్కువగా వచ్చినా తొలి అభ్యర్థిని గెలుపొందినట్లుగా ప్రకటిస్తారు. ఉదాహరణకు ఒక పట్టభద్రుల నియోజకవర్గంలో ఎన్నికల్లో పోలైన వాటిలో చెల్లుబాటైనవి 10వేల ఓట్లు ఉన్నాయనుకుంటే, వాటిలో గెలుపొందడానికి అభ్యర్థికి 5,001ఓట్లు రావాల్సి ఉంటుంది. ఆ విధంగా సగం కంటే ఒక్క ఓటు అధికంగా వచ్చిన వారిని విజేతగా నిర్ణయిస్తారు. ఇందుకు తొలుత పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఏ ఒక్కరికి కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లలో 5,001 ఓట్లు లభించకపోతే ఎలిమినేషన్ పద్ధతి ద్వారా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ క్రమంలో ఎలిమినేట్ అయ్యే అభ్యర్ధికి లభించిన బ్యాలెట్ పత్రాల్లో ఇతర ప్రాధాన్యాలను పరిగణలోకి తీసుకుంటూ ఓట్ల లెక్కింపు జరుపుతారు. ఈ విధంగా జరిగే ఓట్ల లెక్కింపులో చెల్లుబాటు అయిన ఓట్లలో సగానికి కంటే ఒక్క ఓటు అధికంగా లభించిన అభ్యర్దిని విజేతగా ప్రకటిస్తారు.

TS MLC votes to Counting by elimination Process

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News