Wednesday, February 21, 2024

తీరం దాటినట్లే దాటి కాటేసింది: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

తీరం దాటినట్లే దాటి కాటేసింది.. కరోనా మనపాలిటి భీకర తుపాన్
దేశాన్ని అతలాకుతలం చేసింది
సంకల్పబలం టీకాలతో ఎదుర్కొందాం
నిపుణుల సలహాలతోనే మున్ముందుకు
తాజా మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ

PM Modi interact with Nation in mann ki baat

న్యూఢిల్లీ: కరోనా వైరస్ దేశాన్ని తుపాన్‌లాగానే తాకిందని, అతలాకుతలం చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్‌తో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్లు, రాత్రిపూట కర్ఫూలు, పలు కీలక ఆంక్షల దశకు చేరుకున్న నేపథ్యంలో ప్రధాని మోడీ కరోనా తీవ్రతను తుపాన్‌తో పోల్చారు. ఆదివారం తమ 76వ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఆకాశవాణి, దూరదర్శన్‌ల నుంచి ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని పూర్తిగా కరోనా గురించే ప్రస్తావించారు. దేశమంతా సంఘటితంగా ప్రజల మనోబలంతో, మనం తీసుకున్న సంకల్పంతో నిరుడు మన ముందుకు వచ్చిన తొలి దశ కరోనా వైరస్‌ను సమర్థవంతంగా విజయవంతంగా ఎదుర్కొన్నామని ప్రధాని తెలిపారు. మనం అప్పుడు ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం, నిబ్బరం అందరికీ ఆదర్శప్రాయం అయిందన్నారు. అయితే పొంచి ఉండి దాడిచేసినట్లుగా తిరిగి విరుచుకుపడి వచ్చిన ఇప్పటి కరోనా తుపాన్ ధాటిని తలపిస్తోందని ప్రధాని అంగీకరించారు. దేశపు వృక్షాన్ని ఈ తుపాన్ వణికింపచేసిందని చెప్పారు. ప్రజలను భీతిల్లేలా చేస్తున్న కరోనాను వ్యాక్సిన్లతో ఎదుర్కొందామని పిలుపు నిచ్చారు. అర్హులందరికీ టీకాలు ఉచితంగా అందుతాయి. ఈ విషయంలో ఎటువంటి సందేహాలకు ఆస్కారం ఇవ్వరాదు. రాష్ట్రాలకు కేంద్రం నుంచి సాయం నిఖార్సుగా సాగుతుంది. ఇందులో వేరే మాట లేదన్నారు.
మన ఓపికను పరీక్షిస్తోన్న వైరస్
వీడకుండా సాగుతున్న కరోనా వైరస్ ఇప్పుడు మన సహనాన్ని పరీక్షిస్తున్నట్లుగా ఉందని ప్రధాని తెలిపారు. ఈ కొట్టుమిట్టాడే దశలో తాను మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలతో కరోనా మహమ్మారితో తలెత్తిన అంశాలను పంచుకుంటున్నానని అన్నారు. మనకు భయానక స్థితిని తెచ్చిపెడుతూ మన పరిమితులను అన్నింటికి అగ్నిపరీక్ష పెడుతున్నట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మనలో చాలా మంది వారివారి ఆప్తులను, అయినవాళ్లను అర్థాంతరంగా పోగొట్టుకోవల్సి వచ్చిందని, ఈ దుస్థితికి ఈ వైరస్ కారణభూతం అయిందన్నారు. మాస్క్‌లు, భౌతికదూరాలతో పాటు ప్రజలందరికి ఇప్పుడు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. కొవిడ్ 19 దాడి నాటి నుంచే ప్రజలు కరోనా సంబంధిత వ్యాక్సిన్‌లు అత్యవసరం అనే విషయాన్ని గుర్తించారు. శాస్త్రీయ సమాజం కూడా టీకాలు సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి రావాలనే విషయాన్ని ప్రతిపాదించాయి. దీనికి అనుగుణంగానే కేంద్రం అన్ని వనరులను వినియోగించుకుని సంబంధిత సమర్థవంతమైన వ్యాక్సిన్లను రికార్డు స్థాయి వేగంతో అందుబాటులోకి తేగల్గిందని ప్రధాని తెలిపారు. అయితే వ్యాక్సిన్ల విషయంలో ఇప్పుడు నెలకొంటున్న తటపటాయింపులు, వెలువడుతున్న వదంతులు దురదృష్టకరం అని ప్రధాని తేల్చిచెప్పారు. వ్యాక్సిన్ కరోనా పాలిటి ఆయుధం, మన అంతర్గత శక్తిని మరింత ఇనుమడింపచేస్తుంది. ఈ విషయాన్ని ప్రజలు విశ్వసించాలి. వదంతులతో వ్యాక్సిన్లకు దూరం కారాదు. భారతీయ శాస్త్రసాంకేతిక నిపుణుల సమన్వయపు పరిశోధనలు, అంతకు మించి వారి సమిష్టి కృషితో వెలువడ్డ అపూర్వ వ్యాక్సిన్లను ప్రజలు విశ్వసించాలి. ఏదో జరిగింది. ఏదో జరుగుతుందనే అవాస్తవిక, అశాస్త్రీయ వార్తలతో కరోనా పట్ల ఉన్న నమ్మకాలను వమ్ము చేసుకోరాదని ప్రధాని ప్రజలకు పిలుపు నిచ్చారు. కొవిడ్‌ను ఓడించేందుకు దేశం అంతా సంఘటితంగా ఉందని అన్నారు.
నిపుణులు, శాస్త్రీయ సలహాల మేరకు నడవాలి
కరోనా ఉధృతస్థాయిలో అంతకు మించి సరికొత్త పరిణామాలతో దూసుకువస్తున్న దశలో ఈ పోరు మనకు సంక్లిష్టమైన సవాళ్లను విసిరింది. ఇది ఇంతకు ముందు మనం ఎదుర్కొని సవాలు. ఈ దశలో ఈ పోరులో విజయం సాధించేందుకు, ఈ వైరస్‌ను తరిమికొట్టేందుకు మనం ఇప్పుడు వైరస్ సంబంధిత నిపుణులు, శాస్త్రీయ సలహాలు సూచనలకు అనుగుణంగా మెదలాల్సి ఉంటుంది. వారి నుంచి వెలువడే సూత్రీకరణలనే మార్గదర్శకాలుగా ఎంచుకుని ముందుకు సాగాల్సి ఉంటుందని ప్రధాని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఇప్పుడు పలు వేరియంట్లు మనుష్యులపై ప్రభావం చూపడం, మరణాల రేటు పెరుగుతూ ఉండటం, ప్రపంచస్థాయిలోనే వైరస్ విషయంలో భారత్ అత్యధిక సంఖ్య స్థాయికి చేరుకున్న దశలో ప్రధాని ఇప్పటి వైరస్ తీవ్రతను ప్రస్తావించారు.
రాష్ట్రాలకు శక్తివంచన లేకుండా సాయం
పలు రాష్ట్రాలు కరోనాతో విపత్తును ఎదుర్కొంటున్న విషయాన్ని కేంద్రం గుర్తించిందని, ఇందుకు అనుగుణంగా రాష్ట్రాలకు తగు సాయం చేసేందుకు కేంద్రం సిద్ధం అయిందని తెలిపారు. వైరస్ అణచివేతకు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న విశ్వ ప్రయత్నాలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తుందని, శక్తి సామర్థాలన్నింటిని ఇందుకు వినియోగిస్తుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుత తరుణంలో తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాయని, వాటికి కేంద్రం బాసట ఉండనే ఉంటుందని తెలిపారు.
ఎందరో ఔదార్యులు అందరికీ వందనాలు
ఇప్పుడు నెలకొన్న కరోనా కష్టకాలంలో ఎంతో మంది ఎన్నో విధాలుగా బాధితులను ఆదుకుంటున్నారని ప్రధాని తెలిపారు. వైరస్‌తో క్వారంటైన్‌లో ఉన్న కుటుంబాలకు కొందరు ఉదారతతో అవసరం అయిన మందులు అందిస్తున్నారు. మరికొందరు నిత్యావసర సరుకులు పాలు పండ్లు కూరగాయలు వంటివి సరఫరా చేస్తున్నారు. కొందరు మరింత పెద్ద మనస్సుతో అంబులెన్స్‌ల సేవలు కల్పిస్తున్నారు. వీటన్నింటిని సంక్షుభిత కాలంలో స్పందించే గుణంగా భావించుకుని అటువంటి సేవకులకు తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ప్రధాని తెలిపారు. సవాళ్లు తలెత్తిన దశలో సాయానికి ముందుకు వచ్చినప్పుడు సహకారం అందించడం నిజమైన మానవత అన్పించుకుంటుందన్నారు. పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, పలువురు ప్రముఖులు తమంత తాముగా ముందుకు వచ్చి బాధితులను ఆదదుకోవడం కరోనాపై సంఘటిత పోరులో కీలక ఘట్టం అని ప్రధాని తెలిపారు. ఇప్పటి ఈ మన్ కీ బాత్ అధ్యాయాన్ని తాను పూర్తిగా కరోనా వైరస్ ప్రభావం, ప్రస్తుత పరిస్థితికే కేటాయించినట్లు ప్రధానిగుర్తు చేశారు. దేశానికి ఇంతటి పెను సవాలు మునుపెన్నడూ రాలేదని, ఇప్పుడు ప్రభుత్వం, ప్రజలు, సేవా సంస్థలు వ్యక్తులు అందరి సంఘటిత శక్తిని కొవిడ్‌పై పోరుకు వినియోగించుకోవల్సి ఉందన్నారు. ఇంతకు మించిన ప్రాధాన్యతక్రమం మరోటి లేదని, దీనిని తాను అంగీకరిస్తూ వైరస్ గురించి వైరస్‌పై పోరు గురించి ప్రధానంగా పూర్తి స్థాయిలో విశ్లేషిస్తున్నట్లు స్పష్టం చేశారు.

PM Modi interact with Nation in mann ki baat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News