Wednesday, May 1, 2024

దా‘రుణ’ యాప్‌లు!

- Advertisement -
- Advertisement -

Police raid on Online Loan apps

 

ఇంతకంటే దారిగాచి హత్యలు చేసి దోపిడీలకు పాల్పడడం నయమనిపిస్తూ రుణ యాప్‌ల ద్వారా అంతర్జాతీయ మోసకారి దోపిడీ ముఠాలు సాగిస్తున్న దారుణాలను అరికట్టడానికి నడుం బిగించిన హైదరాబాద్ పోలీసులను అభినం దించకుండా ఉండలేము. హైదరాబాద్, గుర్‌గాంవ్‌ల వంటి చోట్ల కాల్ సెంటర్లు పెట్టి అవసరంలో ఉన్నవారిని యాప్‌ల ద్వారా ఆకట్టుకొని అప్పులిచ్చి విపరీతమైన వడ్డీతో స్వల్ప వ్యవధిలోనే తిరిగి రాబట్టుకోడం, గడువులోగా చెల్లించలేనివారి పరువు బజారు పాలు చేయడం వ్యూహంగా నడుస్తున్న ఈ దగుల్బాజీ బ్లాక్ మెయిల్ దుకాణాల దుర్మార్గానికి రాష్ట్రంలో ఇంతవరకు నలుగురు బలి పశువులైన ట్టు వార్తలు చెబుతున్నాయి. కిస్మత్‌పూర్‌కు చెందిన 29 ఏళ్ల సునీల్, మెదక్ జిల్లా నర్సాపూర్ వాసి శ్రవణ్ యాదవ్, సిద్దిపేటకు చెందిన మౌనిక రుణయాప్‌ల విష వలయంలో చిక్కుకొని ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా శుక్రవారం నాడు రామగుండం ఎరువుల కర్మాగారం ఉద్యోగి సంతోష్ కుమార్ ప్రాణాలు తీసుకున్నట్టు సమాచారం.

ఇటువంటి ఉదంతాలతో కళ్లు తెరిచిన భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) తన అనుమతి లేని ఫైనాన్స్ కంపెనీలు విసిరే రుణ యాప్ వలల్లో చిక్కుకోవద్దని వాటి నుంచి అప్పులు తీసుకోవద్దని ఓ ఉచిత సలహా పారేసింది. కరోనా లాక్‌డౌన్ వల్ల చెప్పనలవికాని ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ప్రజలను మోసగించి డబ్బు చేసుకోడానికి బరి తెగిస్తున్న అక్రమ ఫైనాన్స్ సంస్థలపై తాను ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయకపోడం వల్లనే ఈ దారుణాలు ఇలా పేట్రేగిపోతున్నాయని గ్రహించి అందుకు తగిన ఏర్పాట్లను ఆర్‌బిఐ చేయకపోడం బాధాకరం. కరోనా సృష్టించిన అపూర్వ మూసివేతలు, ఆంక్షల వల్ల ఉత్పాదక రంగం ఘోరంగా దెబ్బతినిపోయి దేశంలో 10 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు గణాంక సమాచారం తెలియజేస్తున్నది. అసంఖ్యాక చిన్న వ్యాపారులు చేతిలో చిల్లిగవ్వలేని దయనీయ స్థితికి చేరుకున్నారు. దేశంలోని వయోజనులపై సగటున లక్ష రూపాయల రుణ భారముందని తెలుస్తున్నది.

ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యక్తిగత సహాయ సహకారాలపరంగా ప్రజలకు ఎటువంటి చేయూత లేకపోడంతో అప్పుల్లో కూరుకున్న కోట్లాది జనం రుణ యాప్‌ల వైపు మళ్లుతున్నారు. ఇటువంటి యాప్‌లను క్రమబద్ధం చేసి నియంత్రించే బాధ్యత, సామర్థం గల ఆర్‌బిఐ ముందుగానే దేశ ప్రజలను హెచ్చరించి ఉంటే వారు వీటికి బలి అయి ఉండేవారు కాదు. ప్లే స్టోర్, యాప్ స్టోర్ల జాబితాలో చేరిన 484 రుణ యాప్‌లు దేశంలో అందుబాటులో ఉన్నాయట. వీటిలో చట్టబద్ధమైన వాటితో పాటు మోసాల యాప్‌లు కూడా చేరాయి. ఏవి చట్టబద్ధమైనవో, ఏవి కావో ప్రజలకు తెలిసే అవకాశం లేదు. రుణ యాప్‌లను వినియోగించుకుంటున్న వారు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కెల్లా ఇండియాలోనే అత్యధికంగా ఉన్నారని తేలింది. అత్యధిక జనాభా ఉన్న దేశం కావడం వల్ల అది సహజమైన విషయమే.

అప్పు తీసుకునే వ్యక్తి తాము పెట్టే గడువులోగా అసలు, వడ్డీలు సహా చెల్లించకపోతే న్యాయ స్థానాలు ఆశ్రయించడం వంటి మర్యాదపూర్వకమైన పద్ధతులను దొంగ రుణ యాప్ సంస్థలు పాటించవు. వాటి యజమాను లెవరో, ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. ఏ ఇండోనేషియా నుంచో, చైనా నుంచో పని చేసే ఈ సంస్థలు ఇక్కడున్న తమ సిబ్బంది ద్వారానే బ్లాక్ మెయిల్ చేయించి వసూలు చేసుకునే తుచ్చ విధానాన్ని ఎంచుకుం టున్నాయి. రుణం తీసుకున్నవారి సెల్‌ఫోన్లలో నిక్షిప్తమైన నంబర్లు గల వారందరికీ ఆ వ్యక్తి అప్పు ఎగ్గొట్టిన విషయాన్ని తెలియజేస్తున్నాయి. రుణగ్రహీతల తలిదండ్రులకు, దగ్గరి బంధువులకు చెబుతున్నాయి. దానితో పరువు నష్టమేర్పడి బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్, గుర్‌గాంవ్‌లలో ఇటువంటి 30 రుణ యాప్‌లను 4 కంపెనీ లు నడిపిస్తున్నట్టు వీటి కార్యాలయాల్లో టెలీ కాలర్స్‌గా 1100 మంది పని చేస్తున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు.

ఈ కేసులకు సంబంధించి పది పదిహేను మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి వందలాది ల్యాప్ టాప్‌లు కూడా స్వాధీనం చేసుకున్నారు. లీఫాంగ్ టెక్నాలజీస్, హాట్‌పుల్, పిన్ పాయింట్, నబ్లూమ్ టెక్నాలజీస్ పేరిట ఈ నాలుగు కంపెనీలు బెంగళూరులో నమోదైనట్టు తెలిసింది. గూగుల్ మరి కొంత సమాచారం ఇస్తేగాని వీటి మూలాలు సమూలంగా బయటపడవని అంటున్నారు. ఈ సంస్థల వెనుక ఇక్కడివారి హస్తమూ ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ కృషిని హైదరాబాద్ పోలీసులే చివరికంటా జరిపించి అసలు దొంగలను బయటపెడతారని ఆశిద్దాం. జరిగిన దారుణోదంతాలను దృష్టిలో ఉంచుకొని ఏవి నిజాయితీగల రుణ యాప్‌లో, ఏవి కావో గ్రహించి ఆత్మరక్షణ చేసుకోవలసిన బాధ్యత నిస్సహాయులైన ప్రజలపైనే ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News