Monday, April 29, 2024

2022లో పది జట్లతో ఐపిఎల్

- Advertisement -
- Advertisement -

IPL with ten teams in 2022:BCCI

 

వచ్చే ఏడాది 8 జట్లే, బిసిసిఐ సమావేశంలో కీలక నిర్ణయాలు

అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్‌కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జరిగే ఐపిఎల్‌ను 8 జట్లతోనే నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించింది. అయితే 2022లో మాత్రం పది జట్లతో ఐపిఎల్‌లో నిర్వహించేందుకు సమావేశంలో ఆమోదం తెలిపారు. గురువారం అహ్మదాబాద్‌లో బిసిసిఐ వార్షిక సమావేశం నిర్వహించారు. ఇందులో పలు కీలక నిర్ణయాలను బిసిసిఐ తీసుకొంది. ఈ ఏడాది యూఎఇ వేదికగా జరిగిన ఐపిఎల్ అనుకున్న దానికంటే రెట్టింపు ఆదరణ లభించడంతో రానున్న టోర్నమెంట్‌లను మరింత విజయవంతంగా నిర్వహించాలని బిసిసిఐ భావిస్తోంది. వచ్చే ఏడాది పది జట్లతో టోర్నమెంట్ నిర్వహిస్తారనే ప్రచారం జరిగినా తగినంత సమయం లేనందున పాత పద్ధతిలోనే టోర్నీ జరిపాలని నిర్ణయించారు. ఇక టోర్నమెంట్ ఎక్కడ నిర్వహించాలనే దానిపై ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తర్వాత దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.

కొత్తగా రెండు జట్లు

మరోవైపు 2022లో జరిగే ఐపిఎల్‌లో తాజాగా మరో రెండు కొత్త జట్లకు అవకాశం కల్పించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఐపిఎల్‌లో 8 జట్లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కానీ 2022లో ఐపిఎల్‌లో పాల్గొనే జట్ల సంఖ్యను పదికి పెంచాలని సర్వసభ్య సమావేశంలో నిర్ణయించారు. వచ్చే ఏడాది నుంచే పది జట్లతో టోర్నీ నిర్వహించాలని భావించినా సమయం తక్కువగా ఉన్నందున ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఇక వచ్చే ఏడాది భారత్‌లో జరిగే ట్వంటీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలను సమావేశంలో తీసుకున్నారు. దీంతో పాటు 2023లో భారత్‌లోనే జరిగే వన్డే ప్రపంచకప్‌లో తీసుకోవాల్సిన ఏర్పాట్లపై కూడా ఈ సందర్భంగా చర్చించారు.

ఇక టోర్నమెంట్‌లకు పన్ను మినహాయింపుల కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. త్వరలోనే బిసిసిఐ కార్యదర్శి జైషా, కోశాధికారి అరుణ్ ధుమాల్ ఈ అంశంపై ప్రభుత్వంతో చర్చిస్తారు. ఇక 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు కల్పించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా నిలువాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో చాలా కాలంగా బిసిసిఐలో ఖాళీగా ఉన్న ఉపాధ్య పదవిని ఈ సమావేశంలో భరీ చేశారు. బిసిసిఐ కొత్త ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లాను ఎంపిక చేశారు. ఈ మేరకు గురువారం శుక్లా బాధ్యతలు స్వీకరించారు. ఈ సమావేశంలో బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైషా, కోశాధికారి అరుణ్ ధుమాల్‌తో పాటు ఆయా రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News