Monday, April 29, 2024

నగరంలో వేగానికి కళ్లెం

- Advertisement -
- Advertisement -

police who will set up speed guns in hyderabad

కార్లు 40 స్పీడ్ దాటితే జరిమానా
స్పీడ్ గన్స్ ఏర్పాటు చేయనున్న పోలీసులు
రోడ్డు ప్రమాదాలే కారణం

హైదరాబాద్: నగరంలో వాహనాల వేగానికి కళ్లెం వేయడానికి పోలీసులు సమాయత్తమవుతున్నారు. వరుసగా నగరంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో స్పీడ్ లిమిట్‌ను పెట్టారు. ఆయా జంక్షన్లలో స్పీడ్ గన్స్ ఏర్పాటు చేసి నిర్ణీత వేగానికంటే ఎక్కువ వేగంతో వెళ్లేవారికి జరిమానా విధించేవిధంగా నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, హైటెక్ సిటీ ఎక్స్ రోడ్డు, కూకట్ పల్లి జెఎన్‌టియూ జంక్షన్ల వద్ద వాహనాల స్పీడ్‌ను కిలో మీటర్‌కు 40గా నిర్ధారించారు. నిర్ణీత వేగం కంటే ఎక్కువగా వెళ్లేవారిని గుర్తించి రూ.1,035 జరిమానా విధించనున్నారు. ఈ జరిమానా నాన్ కాంటాక్ట్ పద్దతిలో వాహనదారుడికి రానుంది. నగరంలోని జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ ఎక్స్ రోడ్డులో అర్ధరాత్రి సమయంలో వాహనదారులు మితిమీరిన వేగంతో వాహనాలు నడపడంతో చాలామంది అమాయకులు బలవుతున్నారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద చాలా కార్లను వేగంగా నడపడంతో మెట్రో ఫిల్లర్లను ఢీకొట్టారు. కొన్ని సార్లు అమాయకులు మృతిచెందారు. హైటెక్ సిటీ వద్ద మద్యం తాగి ఇద్దరు యువకులు వేగంగా కారు నడిపి రెడ్ సిగ్నల్ ఉన్నా కూడా ముందుకు రావడంతో బైక్‌పై పోతున్న దంపతులను ఢీకొట్టారు.

దీంతో కంట్రీక్లబ్ మేనేజర్‌గా పనిచేస్తున్న భర్త మృతిచెందగా, భార్య తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయింది. ఇటీవల ఐకియ వద్ద ఆడి కారులో వెళ్తున్న ఇద్దరు యువకులు మద్యం మత్తులో ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టడంతో వెనుక కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటో పనికిరాకుండా పోయింది. ఈ కేసులో ఇద్దరు తప్పించుకునేందుకు యత్నించగా పోలీసులు కారు యజమానిని కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు సమీపంలో చాలా పబ్బులు ఉండడంతో అర్ధరాత్రి వరకు పీకలదాకా మద్యం తాగి కార్లను నడుపుకుంటూ వచ్చి రోడ్డు ప్రమాదాలు చేసి అమాయకులను బలిగొంటున్నారు. నగరంలో అర్ధరాత్రి జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా అమాయకులు మృతిచెందుతున్నారు. దీంతో చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మద్య మత్తులో వాహనాలు నడపడంతో పేదవారు బలవుతున్నారు.

స్పీడ్ గన్స్…

పోలీసులు నగరంలో అన్ని ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. కానీ అవి ప్రమాదం జరిగినప్పుడు వాహనాలను గుర్తించేందుకు ఉపయోగపడుతున్నాయి తప్ప ఎంత వేగంగా వెళ్తున్నాయే తెలియడంలేదు. దీంతో కార్లకు ఓవర్ స్పీడ్ జరిమానా విధించే అవకాశం లేకుండా పోయింది. ఓవర్ స్పీడ్‌ను గుర్తించేందుకు డిస్‌ప్లే బోర్డులు, స్పీడ్ గన్స్ ఏర్పాటు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ పద్ధతి ఇప్పటికే ఓఆర్‌ఆర్, జాతీయ రహదారుల్లో అమలులో ఉంది. దానినే నగరంలో ఏర్పాటు చేయనున్నారు. అర్ధరాత్రి పీకలదాకా మద్యం తాగి వేగంగా కార్లను నడిపే వారికి జరిమానా రానుంది. దీంతో కొంత వరకు కార్ల వేగం తగ్గి రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News