Wednesday, May 1, 2024

మధ్యప్రదేశ్ పరిణామాలు!

- Advertisement -
- Advertisement -

Political crisis in Madhya Pradesh

 

మధ్యప్రదేశ్‌లో జరుగుతున్నది కేవలం అక్కడి అధికార కాంగ్రెస్ సొంత తప్పుల ఫలితమా, జాతీయ పాలక పక్షం భారతీయ జనతా పార్టీ అతిక్రమణ, అప్రజాస్వామిక రాజకీయాల భ్రష్ట పరిణామమా? తరచి చూస్తే భోపాల్ తాజా అంకంలో ఈ రెండింటి పాత్ర రుజువవుతుంది. 2018 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి కష్టం మీద బిజెపిని గద్దె దింపిన కాంగ్రెస్ పార్టీ దాని కంటే కేవలం ఆరుగురు సభ్యుల ఆధిక్యంతో బిఎస్‌పి, ఎస్‌పిల మద్దతుతో దాదాపు ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నది. 230 మంది సభ్యులతో కూడిన మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ సొంత బలం 114 కాగా మద్దతు పార్టీల సంఖ్యతో కలిసి 119. బిజెపి స్వయంగా 109 మంది సభ్యుల బలాన్ని కలిగి ఉన్నది. భారతీయ జనతా పార్టీ తనకు గల సకల అప్రజాస్వామిక పోకడలతో తిరిగి అధికారంలోకి రావడానికి ఆది నుంచి పన్నుతూ వచ్చిన వ్యూహాలను కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సొంత చాకచక్యంతో, పార్టీ అధిష్ఠానం మద్దతుతో విజయవంతంగా ఇంత కాలం ఎదుర్కొంటూ వచ్చాడు.

కాని కాంగ్రెస్ యువనేత మరో కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో విభేదాలు ముదిరి ఆయన వెంట ఉన్న ఆరుగురు మంత్రులు, ఇతర ఎంఎల్‌ఎలు మొత్తం 19 మంది ఉన్నపళంగా బెంగళూరు మకాం పెట్టి సెల్‌ఫోన్లను సైతం బంద్ చేసి సోమవారం నాడు తెర తీసిన కొత్త అధ్యాయంతో కమల్ నాథ్ ప్రభుత్వం పెను విపత్తులో పడిపోయింది. మంగళవారం సాయంత్రానికి ఈ కాంగ్రెస్ తిరుగుబాటు శాసన సభ్యుల సంఖ్య 22కి చేరుకున్నట్టు సమాచారం. వీరంతా స్పీకర్‌కు సమర్పించడానికి రాజీనామాలు సిద్ధం చేసుకున్నారని వార్తలు చెబుతున్నాయి. వాటిని స్పీకర్ ఆమోదిస్తే శాసన సభ మొత్తం బలం ఆ మేరకు పడిపోయి 109 మంది సభ్యుల సొంత బలం కలిగిన బిజెపిది పై చేయి అవుతుంది. కమల్ నాథ్ ప్రభుత్వం పతనం అనివార్యం కాగలదు. ఇంతవరకు ఇది కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల పర్యవసానంగా సంభవించిన పరిణామమే అనిపించుకుంటుంది.

మొదట్లో ముఖ్యమంత్రి పదవిని, ఆ తర్వాత పిసిసి అధ్యక్ష పదవిని కోరుకున్న తన ఆశలపై కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం చన్నీళ్లు చల్లడం సింధియాలో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. ముఖ్యమంత్రికి, ఆయనకు సయోధ్య కుదిర్చి అధికార పీఠానికి ఎటువంటి ముప్పు కలగని స్థితిని సాధించి కాపాడడంలో కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఘోరంగా విఫలమైంది. కమల్ నాథ్ కూడా పొంచి ఉన్న ముప్పును ముందుగానే ఊహించి సింధియా వర్గాన్ని సంతృప్తి పరచడం ద్వారా అధికారాన్ని కాపాడుకోడానికి తగినంత మెలకువను ప్రదర్శించలేకపోయాడు. సింధియా వర్గ ఎంఎల్‌ఎలు కొందరికైనా కేబినెట్‌లో చోటివ్వడానికి మంత్రులందరి నుంచి రాజీనామాలు తీసుకున్న ఆయన ఎత్తుగడ ఒకింత ఆలస్యమైనట్టు బోధపడుతున్నది. పరిస్థితి చేయి దాటిపోకముందే సింధియా తన వర్గీయులను కాపాడుకోడానికి బెంగళూరు మకాంను ఆశ్రయించాడు. తెర వెనుక ఉన్నది బిజెపియేనని భావించడానికి ఇది ఆస్కారం కలిగిస్తున్నది.

తండ్రి హఠాత్తుగా చనిపోయిన తర్వాత జ్యోతిరాదిత్యకు రాహుల్ గాంధీ సన్నిహిత సహచర బృందంలో ఒకడుగా ప్రాధాన్యం లభించింది. పిన్న వయసులోనే కేంద్రలోని యుపిఎ కేబినెట్‌లో మంత్రి పదవిని అనుభవించాడు. ఆయన కంటే సీనియర్, అనుభవజ్ఞుడనే కారణంతో కాంగ్రెస్ అధిష్ఠానం కమల్ నాథ్‌కు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. ఇంకా ఎంతో మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న సింధియా తన తండ్రికి, తనకు అగ్రతర ప్రాధాన్యమిచ్చిన కాంగ్రెస్‌ను రాష్ట్రంలో గద్దె దింపే కుట్రకు ఉపయోగపడుతున్నాడన్న అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. బిజెపి విషయానికి వస్తే ఇప్పుడు జరగబోతున్న రాజ్యసభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు పొందాలనే తొందరలోనూ కోల్పోయిన రాష్ట్ర అధికారాన్ని మళ్లీ చేజిక్కించుకోవాలనే ఆశతోనూ పావులు కదిపి సింధియాను ఆయన వర్గాన్ని తనవైపు తిప్పుకున్నదని స్పష్టపడుతున్నది.

సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా ఇచ్చాడు. మంగళవారం నాడు ప్రధాని మోడీని, అమిత్ షాను కలుసుకున్నాడు. ఆయన బిజెపిలో చేరడం దాదాపు ఖాయమే. అయితే ఆయన వర్గ శాసన సభ్యుల రాజీనామాలను ఆమోదించడంలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తీసుకునే వైఖరిపై అక్కడి తక్షణ భవిష్యత్తు పరిణామాలు ఆధారపడి ఉంటాయి. ఇంతకు ముందు కర్నాటకలో కూడా ఇదే వ్యూహం నడిచింది. అక్కడ కూడా కాంగ్రెస్, జెడి(ఎస్)శాసన సభ్యులతో రాజీనామాలు చేయించి బిజెపి అధికారంలోకి వచ్చింది.

 

Political crisis in Madhya Pradesh
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News