Monday, April 29, 2024

ఎన్నికల వేళ అమెరికాలో భయం.. భయం

- Advertisement -
- Advertisement -

Polling begins for President in US

వాషింగ్టన్/న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మంగళవారం పోటింగ్ మొదలైంది.అత్యంత శక్తివంతమైన పదవికోసం హోరాహోరీ ఎన్నికలు జరుగుతుండడంతో ప్రపంచ దేశాలన్నీ తమ దృష్టిని అమెరికా వైపునకు మళ్లించాయి. ప్రపంచం మొత్తం అమెరికా వైపు చూస్తుంటే అమెరికాలోని వ్యాపారులు మాత్రం తమ షాపులను రక్షించుకునే పనిలో తలమునకలై ఉన్నారు. అగ్రరాజ్యమైన అమెరికాను కరోనా మహమ్మారి మిగతా దేశాలకన్నా ఎక్కువగా కుదిపేసింది. లక్షలాది మంది మరణించారు. కోట్లాది మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ క్రమంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. కరోనా మహమ్మారి సృష్టించిన సమస్యల నడుమ అమెరికన్లు తమ అధ్యక్షుడిని ఎన్నుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ సారి అమెరికా ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. కాగా అధ్యక్ష పదవిని మరోసారి దక్కించుకోవడంపై దృష్టిపెట్టిన డొనాల్డ్ ట్రంప్ దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి మరోసారి జాతీయ వాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. డెమోక్రాట్ నేతలు మాత్రం కరోనా కట్టడి విషయంలో ట్రంప్ ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మంగళవారం రోజు పోలింగ్ ప్రాంభమైంది. కాగా ఎన్నికల అనంతరం పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగవచ్చన్న పుకార్లు అమెరికాలో బలంగా షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపారులు తమ దుకాణ సముదాయాలను రక్షించుకునే పనిలో పడ్డారు. అమెరికా ప్రధాన నగరాల్లోని వాణిజ్య సముదాయాల యజమానులు తమ షాపులకు ప్లైవుడ్‌తో రక్షణ కవచాలను ఏర్పాటు చేయిస్తున్నారు. నిరసనకారులు రాళ్లు రువ్వినా ఎటువంటి నష్టం జరగకుండా కిటికీలను, తలుపులను ప్లైవుడ్‌తో క్లోజ్ చేయిస్తున్నారు. వాణిజ్య సముదాయాలతో పాటుగా ప్రధానమైన ప్రభుత్వ కార్యాలయాలు, శ్వేతసౌధం వద్ద కూడా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

అధ్యక్ష భవనం చుట్టూ తాత్కాలికంగా ఎక్కడానికి వీలుకాని గోడను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అల్లర్లు చెలరేగిన పక్షంలో రంగంలోకి దిగడానికి వీలుగా దాదాపు 600 నేషనల్ గార్డు సైనికులను కూడా దేశవ్యాపతగా సిద్ధంగా ఉంచారు. గత జూన్‌లో నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ పోలీసుల చేతిలో మృతి సందర్భంలో అమెరికాలోని పలు నగరాల్లో పెద్ద ఎత్తున హింసాకాండ, లూటీలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా అదే తరహాలో హింసాకాండ చెలరేగవచ్చని పలువురు భయపడుతున్నారు. తాను నగర పోలీసు కమిషనర్ డెర్మాట్ షెయాతో మాట్లాడానని, ప్రస్తుతానికయితే అల్లర్లకు సంబంధించి ఎలాంటి నిర్దిష్ట సమాచారం లేదని న్యూయార్క్ సిటీ మేయర్ బిల్ డి బ్లాసియో సోమవారం చెప్పారు. ‘అయితే ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల ఫలితాల గురించి ఆందోళన చెందుతున్నారు. ప్రస్తునికయితే ఎలాంటి ప్రమాదమూ లేదు. అయితే ఎలాంటి సవాళ్లనయినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గత కొన్ని వారాలుగా బోలెడంత సన్నద్ధత కొనసాగుతోంది’ అని ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. ఎన్నికల రోజు తర్వాత నగరంలో అల్లర్లు జరగవచ్చన్న వార్తల గురించి, దుకాణదారులు తమ దుకాణాలకు ప్లైవుడ్ బోర్డులతో భద్రత ఏర్పాటు చేసుకోవడం గురించి అడగ్గా, ప్రతి దుకాణదారుడు తమ సొంత నిర్ణయాలను తీసుకోవాలని, వారి నిర్ణయాలను తాను గౌరవిస్తానని డి బ్లాసియో చెప్పారు.
ఫలించని రిపబ్లికన్ల యత్నం
ఇదిలా ఉండగా హ్యూస్టన్‌లో దాదాపు 1,27,000 ఓట్లను చెల్లకుండా చేయడం కోసం రిపబ్లికన్ పార్టీ చివరి క్షణంలో చేసిన మరో ప్రయత్నాన్ని ఫెడరల్ జడ్జి ఒకరు తోసిపుచ్చారు. కరోనా సమయంలో ఏర్పాటు చేసిన డ్రైవ్‌త్రూ పోలింగ్ సెంటర్లలో ఓటు వేసినందున ఈ ఓట్లు చెల్లవని ప్రకటించాలని కోరుతూ కన్సర్వేటివ్ టెక్సాస్ యాక్టివిస్ట్‌లు ఈ పిటిషన్ వేశారు. హ్యారిస్ కౌంటీలో పెద్ద సంఖ్యలో ఇలాంటి డ్రైవ్‌త్రూ ఓటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే చాలా మంది ఈ కేంద్రాల ద్వారా తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. గతంలో ఇదే తరహా లా సూట్‌ను టెక్సాస్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే అధ్యక్ష ఎన్నికలకు కొద్ది గంటల ముందు ఈ పిటిషన్‌పై విచారణ జరపాలని డిస్ట్రిక్ట్ జడ్జి ఆండ్రూ హనెన్ తీసుకున్న నిర్ణయం ఓటింగ్ హక్కు ఉద్యమకారుల్లో ఆందోళనకు కారణమైంది. కాగా మంగళవారంపోలింగ్ రోజున మరో 20 వేల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ కేంద్రాలను ఉపయోగించుకోవచ్చని భావిస్తున్నారు. కారులో ప్రయాణిస్తూనే ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా హ్యారిస్ కౌంటీ అధికారులు 10 డ్రైవ్‌త్రూ ఓటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Polling begins for President in US

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News