Monday, May 6, 2024

తగ్గిన ఓటింగ్ ఎవరికి లాభం…?

- Advertisement -
- Advertisement -

సన్నగిల్లిన ఓటింగ్…సర్‘కారు’కే సానుకూలం
ఓల్డ్ మలక్‌పేట్‌లో పోలింగ్ రద్దుతో ఎగ్జిట్‌పోల్స్‌కు బ్రేక్

Polling percentage decreased in GHMC Elections

మనతెలంగాణ/హైదరాబాద్ : జిహెచ్‌ఎంసి ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే పోలింగ్ శాతం దారణంగా నమోదు అయింది. గతంతో పోల్చుకుంటే చాలా తక్కువగా నమోదు అయింది. జిహెచ్‌ఎంసిలోని 149 డివిజన్లకు మంగళవారం ఎన్నికలు జరుగగా, మొత్తంగా 40 శాతం కంటే తక్కువగా పోలింగ్ నమోదైంది. 2009లో 41.22 శాతం పోలింగ్ నమోదు కాగా, 2016లో 45.27 శాతం నమోదైంది. ఈసారి గతంలో కంటే అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదయ్యింది. రెండు మూడు డివిజన్లలో మాత్రమే 50 శాతం పోలింగ్ నమోదు అయింది. కొన్ని చోట్ల 50 శాతం కంటే తక్కువగా, మరికొన్ని చోట్ల 40 శాతం కంటే తక్కువగా పోలింగ్ నమోదు అయింది. పోలింగ్ కేంద్రాలకు 6 గంటలు తరువాత వచ్చే వారికి అనుమతిని నిరాకరించారు. ఆరు గంటల లోపు పోలింగ్ కేంద్రంలో ఉంటే వారికి ఓటు హక్కు వినియో గించుకొనేందుకు అవకాశం ఇచ్చారు. ఈసారి మందకొడిగా పోలింగ్ శాతం సాగింది. ఉదయం నుండి పోలింగ్ కేంద్రాలు వెలవెల బోయాయి. సాయంత్రం 6 గంటల వరకు కేవలం 37 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ఆర్సీపురం, పటాన్‌చెరు, అంబర్‌పేట్‌లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదు కాగా, మలక్‌పేట్, కార్వాన్‌లో అత్యల్పంగా ఓటింగ్ శాతం నమోదయ్యింది.

తగ్గిన ఓటింగ్ ఎవరికి లాభం..?

జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పోలింగ్ శాతం పడిపోవడం రాజకీయంగా ఎవరికి కలిసొస్తుందన్న అంశంపై చర్చ జరుగుతోంది. తగ్గిన ఓటింగ్ శాతం ఎవరికి లాభం..? ఎవరికి నష్టం అనే విషయాలపై రాజకీయ వర్గాలు విశ్లేషణలు చేస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఉంటేనే ఓటింగ్ శాతం గణనీయంగా పెరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓటింగ్ శాతం తగ్గడం అధికార పార్టీకే కలిసొస్తుందని పలువురు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, కెసిఆర్ కిట్ తదితర సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందుతున్న వర్గాలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నట్లు తెలిసింది. ఎక్కువగా బస్తీవాసులు, నిరక్షరాసులు ఓటింగ్‌లో పాల్గొనగా, ఐటి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఓట్లు వేసేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. ప్రధానంగా వృద్దులు, వికలాంగులు ఓటింగ్‌లో ఎక్కువగా పాల్గొన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్లు పొందుతున్న వృద్దులు, వికలాంగులు సొంతంగా పోలింగ్ కేంద్రానికి రాలేని పరిస్థితి ఉన్నా కుటుంబ సభ్యులు, ఇతరుల సహాయంతో పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సహజంగా ఏ ఎన్నికల్లో అయినా అధికార పార్టీపై ఆగ్రహం ఉంటే, ఓటర్లు పోలింగ్ కేంద్రానికి ఉత్సాహంగా తరలివస్తారు. ఆ పార్టీపై తమ ఆగ్రహాన్ని ఓటు రూపంలో ప్రదర్శిస్తారు. సహజంగా ప్రజలకు అధికార పార్టీలపైనే ఆగ్రహం ఉంటుంది కాబట్టి.. దానిని ఓడించాలని భావిస్తే, పోలింగ్‌బూత్‌లు ఓటర్లతో నిండిపోతాయి. ఆ పరిస్థితి, అలాంటి ఆగ్రహం ప్రదర్శించాలన్న కసి-, పట్టుదల, గ్రేటర్ ఎన్నికల్లో కనిపించలేదు. ఇక సహజంగా ఒక పార్టీకి మద్దతునివ్వాలనుకునే ఓటరు, తాపీగా సమయం చూసుకుని తమ పనులు ముగించుకున్న తర్వాత వీలుంటేనే పోలింగ్ కేంద్రానికి వస్తారు. పోలింగ్ సరళి పరిశీలిస్తే బస్తీలు, మురికివాడలున్న ప్రాంతాల్లో టిఆర్‌ఎస్‌కు మొగ్గు కనిపించింది. ఇక కాలనీల్లో ఉన్న పోలింగ్ బూత్ ప్రాంతాల సరళి మాత్రం టిఆర్‌ఎస్ వైపే సానుకూలత వ్యక్తమయింది.

ఎగ్జిట్ పోల్స్‌కు బ్రేక్

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్‌లో పోలింగ్ రద్దు కావడంతో ఎగ్జిట్‌పోల్స్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. జిహెచ్‌ఎంసి ఎన్నికలు ముగిసినా ఎగ్జిట్ పోల్స్‌పై ఆంక్షలు కొనసాగనున్నాయి. గుర్తులు తారుమారు కావడంతో ఓల్డ్ మలక్‌పేట్‌లో పోలింగ్ రద్దయింది. ఓల్ మలక్‌పేట్‌లో ఈ నెల 3వ తేదీన(గురువారం) రీపోలింగ్ జరగనుంది. ఈ నెల 4న గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. పోలింగ్ ముగియగానే గతంలో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు బహిర్గతమయ్యేవి. అయితే ఈసారి మాత్రం రీపోలింగ్ దృష్ట్యా గురువారం సాయంత్రం 6 గంటల వరకూ ఎగ్జిట్‌పోల్స్‌పై ఎస్‌ఇసి నిషేధం విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News