Saturday, April 27, 2024

మన ఆలోచనలే మన ఆరోగ్యం

- Advertisement -
- Advertisement -

ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. దీన్ని ఆధారంగా చేసుకుని వైద్య శాస్త్రంలోని వివిధ విభాగాలకు చెందిన ప్రముఖ పరిశోధకులు వ్యక్తి ఆరోగ్యానికి, వారి మనసుకు అవినాభావ సంబంధం ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుసుకొని సైకో న్యూరో ఇమ్యునాలజీ అనే పేరుతో సరికొత్త విభాగాన్ని ఏర్పాటు చేశారు. మనిషి చేసే సానుకూల ఆలోచనల ఫలితమే వారి ఆరోగ్యమని, ప్రతికూల ఆలోచనలే వారి అనారోగ్యమని ఈ కొత్త విభాగం ఎత్తి చూపుతుంది. ఆలోచనలంటే మనసే కదా! మనిషి ఆరోగ్యానికి అనారోగ్యానికి మూలం మనస్సన్నమాట.

Think

 

సానుకూలత ఆరోగ్యానికి రక్షణ కవచం: సానుకూల భావోద్వేగాలు చెప్పుకునే ప్రేమ, అనురాగం, అభిమానం, ఆప్యాయత వంటి గుణాలు కలిగున్న మనిషి ఆరోగ్యంగా ఉంటాడని చెబుతున్న శాస్త్రజ్ఞులు “అనుకూలమైన అనుభూతులతో ఉన్న మనిషిలో తెల్ల రక్తకణాలు వృద్ధి చెంది వ్యాధికారక క్రిములను పెరగకుండా నిరోధిస్తాయి” అంటారు.
కోపం, ద్వేషం, దుఃఖం, విచారం, అసూయ వంటి ప్రతికూల భావోద్వేగాలు మనిషిని మానసికంగా ఒత్తిళ్లు, ఆందోళనలకు గురిచేసి తెల్ల రక్తకణాలను తగ్గిస్తాయి. ఫలితంగా మనిషి అనారోగ్యానికి గురవుతాడంటారు శాస్త్రజ్ఞులు. అందుకే మంచి ఆలోచనలు మనిషిని ఆనందంగా, ఆరోగ్యంగా ఉంచుతాయంటారు మనోవైజ్ఞానికులు.
ప్రేమగల జీవితం సుఖమయం: కాలిఫోర్నియా యూనివర్సిటీ సైకాలజిస్ట్ డా. రాబర్ట్‌టైలర్ ప్రేమ వ్యక్తుల మధ్య చక్కని సంబంధాన్ని ఏర్పరిచి ఒంటరితనాన్ని దూరం చేయడమే కాక వారిలో ఆత్మవిశ్వాసం, ఆత్మనిగ్రహణ శక్తి పెంచి ఆశావాదాన్ని కలిగిస్తుంది.
మనసును సరైన దారిలో నడిపిస్తూ సమస్యలను ఎదిరించే ధైర్యాన్ని కలిగిస్తుంది” అంటాడు.
“ప్రేమ మెదడులోని ప్రధాన భాగాలను ఏకం చేసి వాటి మధ్య సమన్వయం ఏర్పరుస్తుంది. ఇదే విషయాన్ని అమెరికాకు చెందిన న్యూరో బయాలజిస్ట్ డా॥ డాన్ సీజల్ అక్కడి ప్రవాస భారతీయులకు చెందిన నలందా ఇన్స్‌టిట్యూట్స్ ఆఫ్ కాంటేప్లేటివ్ స్టడీస్‌లో జరిగిన సదస్సులో వివరంగా తెలుపుతూ ప్రేమతో కూడిన కరుణ, జాలి, సానుభూతి వల్ల మెదడులోని అన్ని ప్రధాన భాగాలు ఏకమై మనిషిని ప్రతిభావంతుడు, సృజనశీలిగా తయారు చేస్తాయి. సమాజంలో గౌరవాన్ని పెంచుతాయి” అంటాడు.
ఒంటరి జీవితం ఒక శాపం : ఒంటరిగా జీవించేవారు నలుగురితో కలిసి జీవించే వారికంటే తొందరగా చనిపోయే అవకాశం ఎక్కువంటారు కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రజ్ఞులు. ఒంటరిగా ఉన్న మనిషిలో ప్రతికూల ఆలోచనలు ఎక్కువ. వాటి ఫలితంగా మనిషిలో తెల్ల రక్త కణాలు తక్కువవుతుంటాయి. ఎన్నో శారీరక సమస్యలు మొదలవుతాయి. ఆహార విహారాల పట్ల అవగాహన లోపిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉండవచ్చు. మనసు పద్ధతిలో మార్పు వస్తుంది. ఆ కారణంగా జ్ఞాపకశక్తి తగ్గుతూ అల్జీమర్స్ వంటి మస్తిష్క అపసవ్యత చోటు చేసుకుంటుంది. అందుకే ఒంటరిగా ఉన్నవారు ఏదో ఓ పనిలో నిమగ్నమైనప్పుడు మెదడు నిర్మాణాత్మకంగా పనిచేస్తూ సానుకూల ఆలోచనలకు తెరలేపుతుందంటారు చికాగోలోని రష్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ శాస్త్రజ్ఞులు.
సానుకూల ఆలోచనల కోసం… సానుకూల ఆలోచనల కోసం మెదడుకు తగు తర్ఫీదు

ఇవ్వవచ్చంటారు సైకాలజిస్టులు. డా॥ రియుతా కవాశియా అనే జపాను దేశ మనో వైజ్ఞానికుడు ట్రైన్ యువర్ బ్రైన్ అనే పుస్తకంలో తెలిపిన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

* ఇతరులతో మాట్లాడేటప్పుడు సానుకూల శబ్దాలు మాత్రమే
ఉపయోగించే అలవాటు పడాలి.
* తరుచుగా సానుకూల స్వయం సలహాలు ఇచ్చుకుంటుండాలి.
* ఆత్మవిశ్వాసంతో కూడిన మాటలు, చేతలకు మాత్రమే
ప్రాధాన్యతనివ్వాలి.
* ఇతరుల పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగుండాలి.
* తప్పులు జరిగినప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి.
* నిపుణుల వద్ద సెల్ఫ్ హిప్నోటిజం నేర్చుకునే ప్రయత్నం
చేయాలి.
* ఓడిపోయినప్పుడు గతంలో గెలుపొందిన సంఘటనలు గుర్తు
చేసుకుని ప్రస్తుతం జరిగిన వాటిని విశ్లేషించుకోవాలి.
* ఎప్పుడూ ఇతరులను చూసి ప్రేరణ పొందే అలవాటు
చేసుకోవాలి.
* ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని సానుకూలంగా
మార్చుకునే ప్రయత్నం చేయాలి.
* ఎప్పుడు పెదాలమీద చిరునవ్వు పులుముకునే ప్రయత్నం
చేయాలి.
* సానుకూల విజువలైజేషన్ పట్ల అవగాహన ఏర్పరుచుకుని
విజయ చిత్రాలు ఊహించుకుంటుండాలి.
* పనులు వాయిదా వేసే అలవాటు మానుకోవాలి.
* “ సెల్ఫ్ హెల్ప్‌” పుస్తకాల ద్వారా సెల్ఫ్ రిలాక్సేషన్, జాకబ్
సన్ రిలాక్సేషన్ పద్ధతి నేర్చుకునే ప్రయత్నం చేయాలి.
డా॥ సైగల్ “ లవ్ మెడిసన్ అండ్ మినరల్స్‌”లో ఇతరులతో ప్రేమగా ఎలా వ్యవహరించాలో చెబుతూ నవ్వుతూ నవ్విస్తుండడం వల్ల ఎంత పెద్ద జబ్బునైనా నయం చేసుకోవచ్చు అంటారు.

పరికిపండ్ల సారంగ పాణి
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, ఫోన్: 98496 30290

తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి

తీసుకునే ఆహారంతోనే ఆలోచనా విధానం ముడిపడి ఉందని అంటున్నారు నిపుణులు.
తాజా పండ్లను, కూరగాయలను తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని
పరిశోధనలు చెబుతున్నాయి.
క్యారెట్లు : ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తాయి. క్యారట్లలో ఉండే బీటా-కెరోటిన్ మెదడు పనితీరులో సానుకూలమైన ప్రభావాన్ని చూపుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో సంచరించే రాడికల్స్ నుంచి శరీర కణాలు నష్టపోకుండా కాపాడుతాయి. శరీర రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాద తీవ్రతను తగ్గిస్తుంది.
అరటి : దీనిలో ఉండే పొటాషియం మెదడుకు సందేశాలను చేరవేసేందుకు సహాయకారిగా పనిచేస్తుంది. నరాల పనితీరు కోసం అవసరమైన పోషకాలను అందిస్తుంది. చేయాల్సిన పనిపై ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని కలిగిస్తుంది. ఆకలిని నియంత్రించడం ద్వారా మెదడుకు సహాయం చేస్తుంది.
యాపిల్స్ : మెదడు కణజాలాన్ని దెబ్బతీసే హానికరమైన రియాక్టివ్ ఆక్సిజన్ తీవ్రతను తగ్గించడంలో సహాయపడి మానసిక రుగ్మతను తగ్గిస్తుంది. వయస్సుతో పాటు క్షీణించే న్యూరోట్రాన్స్మిటర్, అసిటైల్కోలిన్ను కాపాడుతుంది.
బచ్చలికూర (పాలకూర) : ముదురు ఆకుపచ్చని రంగులో ఉండే బచ్చలికూరలో ఉండే అధిక ఫోలేట్లు మెదడుకు మేలు చేస్తాయి. బచ్చలికూర మానసిక స్థైర్యాన్ని, స్వల్పకాలిక జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఫోలేట్ లోపం వల్ల అధిక ఒత్తిడి, అలసట, నిద్రలేమి కలుగుతుంది.
ఆమ్ల ఫలాలు : నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మెదడు పనితీరును సరిచేస్తుంది.
దోసకాయ : ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. వయస్సు సంబంధిత రుగ్మతల నుంచి నరాల కణాలను రక్షించడంలో సహాయపడతాయి.

ఒత్తిడిని వదిలేయండిAbsent Mindedness

మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉన్నప్పుడే శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకుని ప్రశాంతమైన జీవనం సాగించాలి. మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవాలంటే.. మెదడును ఉత్తేజంగా ఉండేలా చూసుకోవాలి. మెదడు చురుగ్గా ఉంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఫలితంగా మానసిక సమస్యల నుంచి కూడా బయటపడొచ్చు.
* రోజూ కనీసం 6 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి. దాంతో మెదడు పునరుత్తేజం చెందుతుంది.
* మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. ఫలితంగా మానసిక సమస్యలు పోయి మెదడు చురుగ్గా మారుతుంది.
* మనం నిత్యం తీసుకునే ఆహారం కూడా మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. కనుక రోజూ సరైన పోషకాలు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి.
* ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండే ఆహారాలను నిత్యం తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
* నిత్యం వ్యాయామం చేయడం వల్ల కూడా మానసిక సమస్యలు పోతాయి.
* రోజూ కొత్త విషయాలను నేర్చుకోవడం, పద వినోదం, పజిల్స్ నింపడం, సుడోకు ఆడడం వంటి మెదడుకు మేత పనులు చేస్తే మంచిది.

Brain is Thinking Awesome

ప్రతికూల ఆలోచనలు వద్దు

* నెగెటివ్ ఆలోచనల వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోతారు. ఎదుటివాళ్లకి మనమీద నమ్మకం లేకుండా చేస్తాయి. ఇలాంటి ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడటానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు మానసిక నిపుణులు.
* ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని ఓ పుస్తకంలో రాసుకోవాలి. అవి మీ జీవితంలో తీసుకొనే నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలి. అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయో కనుక్కోవాలి. వాటినుంచి బయట పడాలనే తపన బలంగా ఉండాలి.
* భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం వల్ల ఫలితం ఉండదు. అలా జరుగుతుందేమో అనే భయం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. అంతా మంచే జరుగుతుందనే ఆలోచన మంచిది.
* ఎప్పుడైతే మీపై మీకు నమ్మకం లేదో నెగిటివ్ ఆలోచనలు రావడం ఖాయం. ఇతరులు మిమ్మల్ని ఇష్టపడటం లేదనే అనుకుంటారు. మీ మీద మీకు భరోసా ఉండటం వల్ల నెగిటివ్ ఆలోచనలను తరిమేయొచ్చు.
* గతంలో జరిగిన అపజయాలు, అనుభవాల వల్ల ప్రతికూల ఆలోచనలు రావడం సహజం. గతాన్ని మర్చిపోవాలి. మళ్లీ గతంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తపడాలి.
* మనల్నిమనం ప్రేమించుకోవాలి. సాధ్యమైనంత వరకూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి.

నవ్వుతో ఆరోగ్యం

Healthy Mind, Happiness, Healthy tips

నవ్వడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి. రోజూ 100 సార్లు నవ్వినట్లయితే 15 నిమిషాల పాటు సైకిల్ తొక్కడంతో సమానమని అంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు. అదేవిధంగా నవ్వడం అనేది 30 నిమిషాల పాటు వాకింగ్ చేసిన దానికి, 15 నిమిషాల పాటు రన్నింగ్ చేసే దానికి సమానమట. నవ్వడం వల్ల దాదాపుగా 100 నుంచి 150 క్యాలరీల వరకు ఖర్చవుతాయట. వందసార్లు రోజుకు నవ్వగలిగితే వ్యాయామం చేయాల్సిన అవసరం కూడా లేదంటున్నారు. సంతోషంగా ఉండటం వల్ల అధిక బరువు, డయాబెటిస్, గుండె జబ్బులు రాకుండా చూడొచ్చని అంటున్నారు నిపుణులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News