Friday, April 26, 2024

సంపాదకీయం: తపాలా ఓట్ల తగవు

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం డెమొక్రాటిక్ అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్‌నే వరిస్తున్నదని రూఢి అవుతున్నప్పటికీ పోస్టల్ ఓట్ల లెక్కింపును వివాదాస్పదం చేసి సుప్రీంకోర్టుకు వెళ్లడానికి డోనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది అంతిమ ఫలితం ప్రకటనను ఆలస్యం చేయవచ్చు. పోస్టల్ బ్యాలట్‌పై ట్రంప్ ముందు నుంచే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో అక్రమాలు, అవకతవకలకు అవకాశాలు బహు తక్కువనే చెబుతారు. కాని పోస్టల్ ఓట్లలో తనపై కుట్ర జరుగుతుందనే ప్రచారాన్ని గత కొంత కాలంగా ట్రంప్ పని గట్టుకొని సాగించారు. తాను తిరిగి ఎన్నికయ్యే సూచనలు సన్నగిల్లుతుండడంతో డెమొక్రాట్లు ఓటు దొంగతనానికి పాల్పడుతున్నా రనే ఆరోపణను ఆయన మరింత బిగ్గరగా చేస్తున్నారు.

కరోనా వల్ల ఈ ఎన్నికల్లో దూరం నుంచే ఓట్లు వేసిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దేశమంతటా రెండు లక్షల మందికి పైగా దుర్మరణం పాలవడం ప్రజలలో భీతిని అమితంగా కల్పించింది. ట్రంప్ ఓటమి అనివార్యమయ్యే పరిస్థితికి కూడా అదే ప్రధాన కారణం అవుతున్నదంటున్నారు. ఈసారి 10 కోట్ల మంది ఓటర్లు పోస్టు ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలుస్తున్నది. పోస్టల్ బ్యాలట్ ఉపయోగించుకున్న వారిలో డెమొక్రాట్లే అధికమని భావిస్తున్నారు. అందుచేత నేరు ఓట్లలో ట్రంప్ ఆధిక్యం స్పష్టంగా రుజువైన రాష్ట్రాల్లో కూడా పోస్టల్ ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత బైడెన్‌ది పై చేయి అవుతున్నట్లు సమాచారం. మిషిగాన్, విస్కాన్‌సిన్, పెన్సిల్వేనియా, ఫ్లోరిడా, అరిజోనా వంటి కీలక రాష్ట్రాలలో ఇదే జరిగిందని తెలుస్తున్నది.

విస్కాన్‌సిన్, మిషిగాన్ రాష్ట్రాలు 2016 ఎన్నికల్లో ట్రంప్ వైపు మొగ్గినందున ఆయన గెలుపొందారు. తపాలా ఓట్లు లెక్కిస్తున్న వారి నిజాయితీని కూడా ట్రంప్ శంకిస్తున్నారు. వాటి లెక్కింపు జరుగుతున్న కేంద్రాల్లో తనిఖీదార్లను నియమించే వరకు కౌంటింగ్‌ను నిలిపివేయాలని, ఇప్పటికే లెక్కింపు జరిగిన పోస్టల్ ఓట్లను మళ్లీ కౌంటింగ్ చేయాలని ట్రంప్ వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు.మిషిగాన్ కోర్టులో ఈ మేరకు కేసు దాఖలు చేశారు. పెన్సిల్వేనియాలో కూడా కేసు వేశారు. లెక్కింపు జరుగుతున్న తీరును చూడనీయకుండా తమ ఏజెంట్లను అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఈ కేసు దాఖలయింది. ట్రంప్, బైడెన్‌లిద్దరికీ భారీగా ఓట్లు పడ్డాయి. ట్రంప్‌కి 2016 ఎన్నికల్లో పడిన 6 కోట్ల కంటే 10 శాతానికి మించి అదనంగా ఓట్లు వచ్చాయని ఆయనకు మొత్తం 6 కోట్ల 80 లక్షలు పడ్డాయని, అలాగే బైడెన్‌కు 7 కోట్ల 20 లక్షల ఓట్లు పోలై డెమొక్రాటిక్ అభ్యర్థుల రికార్డును బద్దలు కొట్టాయని భావిస్తున్నారు.

అంటే ఎన్నికల సర్వేలు పదేపదే కుండ బద్దలు కొట్టినట్టు బైడెన్ పరిస్థితి నల్లేరు మీద నడక కాలేదని ట్రంప్ హోరాహోరీ పోటీ ఇచ్చారని స్పష్టపడుతున్నది. అమెరికన్ ఓటర్ల మోహరింపు ఎన్నడూ లేనంత తీవ్రంగా ఈ సారి చోటు చేసుకున్నదని అర్థమవుతున్నది. తీవ్ర జాతీయ వాదాన్ని ఆయుధంగా చేసుకొని శ్వేత ఓటర్లను ట్రంప్ విశేషంగా ఆకట్టుకున్నారు. అందువల్ల ఆయన ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని రుజువవుతున్నది. బైడెన్ విశేషమైన మెజారిటీతో అఖండ విజయాన్ని సాధిస్తారని ఎన్నికల సర్వేలు చెప్పినది పచ్చి అబద్ధంగా రుజువవుతూ ఉండడం ఫలితాల ముందస్తు అంచనాల కరసత్తుపైన అందుకు సంబంధించిన శాస్త్రీయమని చెప్పుకుంటున్న ప్రక్రియపైన అనుమానాలను గట్టి పరుస్తున్నది. లెక్కింపు చివరి దశకు చేరుతున్న సమయంలో ఎలెక్టోరల్ ఓట్లలో బైడెన్ బాగా పైచేయిగా ఉన్నట్టు కనిపిస్తున్నది. అతడు 264 ఓట్ల వద్ద, ట్రంప్ 214 వద్ద ఉన్నట్టు వార్తలు చెబుతున్నాయి.

అమెరికా ఎన్నికల అంతిమ ఫలితం అభ్యర్థులు తెచ్చుకునే సాధారణ ప్రజల ఓట్ల ఆధిక్యతపై నేరుగా ఆధారపడి ఉండదు. ఒక్కొక్క రాష్ట్రానికి కేటాయించే ఎలెక్టోరల్ ఓట్ల మొత్తంలో ఎక్కువ తెచ్చుకున్న వారికే అధ్యక్ష పీఠం దక్కుతుంది. ఒక రాష్ట్రంలో ప్రజా ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే ఆ రాష్ట్ర ఎలెక్టోరల్ ఓట్లన్నీ వారికే చెందుతాయి. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ప్రజా ఓట్లలో గణనీయమైన మెజారిటీ సాధించుకున్న హిల్లరీ క్లింటన్ ఎలెక్టోరల్ ఓట్లలో కిందు చేయి కావడం వల్ల ఓడిపోయారు. పోస్టల్ బ్యాలెట్ల వివాదాన్ని నిజంగానే సుప్రీంకోర్టు వరకు ట్రంప్ తీసుకుని వెళితే అంతిమ ఫలితం అధికారికంగా ప్రకటించడానికి మరి కొంత సమయం పట్టవచ్చు. అయితే ఎలెక్టోరల్ ఓట్లలో బైడెన్ విశేషమైన మెజారిటీ నిరూపించుకుంటున్న నేపథ్యంలో ట్రంప్ అందుకు సాహసిస్తాడా? బైడెన్ విజయం అధికారికంగా ప్రకటితమైతే ఒకే ఒక్క పదవీ కాలంతో అధికార పీఠం నుంచి దిగిపోయిన అధ్యక్షుల కోవలో ట్రంప్ చేరిపోతారు. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇంతటి అత్యంత ఉత్కంఠను సృష్టించడానికి ట్రంప్ విలక్షణ శైలే కారణమని చెప్పక తప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News