Monday, April 29, 2024

ప్రైవేటు ఆసుపత్రులకు పరేషాన్ !

- Advertisement -
- Advertisement -

ఒ.పిలు బంద్… అత్యవసర సేవలకు కష్టాలే
ప్రభుత్వ నోటిఫికేషన్‌తో నర్సుల్లో కొత్త ఆశలు

out patient

 

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు పరేషాన్‌లో పడ్డాయి. ఇప్పటికే ఒ.పి సేవలు బంద్ కాగా అత్యవసర ఆపరేషన్లకు సైతం కష్టాలు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిని ఇప్పుడు కరోనా బాధితుల కోసమే కేటాయించారు. అత్యవసర కేసులేమి చూడటం లేదు. దీంతో పేషెంట్లు ప్రైవేట్‌కు వెళ్తున్నారు. అయినా అక్కడా కూడా అత్యవసర సేవలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇందుకు నర్సులు, టెక్నిషియన్లు తగిన సంఖ్యలో అందుబాటులో లేకపోవడమే కారణంగా ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ బాధితులకు, లక్షణాలు కలిగిన వారికి ఐసొలేషన్ వార్డుల్లో తగిన సంఖ్యలో వైద్య సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేకపోవడంతో డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ల సేవలను వినియోగించుకోవాలనుకుంటోంది. ఇందుకోసం పత్రికా ప్రకటన (నోటిఫికేషన్)ను కూడా విడుదల చేసింది. అయితే ఎన్ని నర్సు పోస్టులు, ఎంతకాలం వరకు అనే స్పష్టత నోటిఫికేషన్‌లో లేదు.

అయినా ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వేలాది మంది నర్సులు ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వ కాంట్రాక్టు లేదా ఔట్‌సోర్సింగ్ నర్సుగా చేరితే తరువాత పర్మినెంట్ అవుతుందనే ఆశతో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుతున్నదానికంటే ఎక్కువ జీతం వస్తుందన్న ఆశతో నర్సులు దరఖాస్తు చేసుకోడానికి ఉత్సాహం చూపుతున్నారు. కొందరు మాత్రం కరోనా పేషెంట్లకు సేవలు చేయలేమంటూ భయపడి వెనక్కి తగ్గుతున్నారు. కరోనా వైరస్ సంగతెట్లా ఉన్నా నర్సుల కొరత కారణంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యవసర సేవలందక వందలు, వేల సంఖ్యలో పేషెంట్లకు ముప్పు పొంచి ఉందంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఆశతో నర్సులంతా ప్రైవేటు ఆసుపత్రులను విడిచిపెట్టి వెళ్ళిపోతే రాష్ట్రంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదం ఉందంటున్నారు. ఇప్పటికే ఒ.పి సేవలను, ఎలక్టివ్ సర్జరీలను ప్రభుత్వ ఆదేశాలతో బంద్ పెట్టాయి. దీంతో చాలా మంది పేషెంట్లు తాత్కాలిక మెడికేషన్‌పైనే ఆధారపడ్డారు.
కాంట్రాక్టు పద్ధతేనా.. ఔట్‌సోర్సింగ్‌లోనా

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేసిన నోటిఫికేషన్‌లో మాత్రం నర్సులకు ప్రతీ నెలా రూ. 23 వేల చొప్పున వేతనం చెల్లించనున్నట్లు పేర్కొని వారిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకోనున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 3వ తేదీ గడువు విధించినప్పటికీ ఆన్‌లైన్‌లో సబ్‌మిట్ ఆప్షన్ దగ్గర బ్రేక్ పడుతోంది. అయినా నర్సులు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. మరోవైపు ఈ తాత్కాలిక నియామకాల కోసం ఈ నెల 21వ తేదీన విడుదల చేసిన జిఒలో మాత్రం ’ఔట్‌సోర్సింగ్’ పద్ధతిలో 1640 మంది నర్సులను రిక్రూట్ చేసుకోడానికి పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి విడుదల చేసిన దాంట్లో ఉంది.

ఇంతకూ నర్సుల రిక్రూట్‌మెంట్ కాంట్రాక్టు పద్ధతా లేక ఔట్‌సోర్సింగ్ విధానమా అనే వైరుధ్యం తలెత్తింది. జి.ఒలో వచ్చే ఏడాది మార్చి 31 వరకు లేదా రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ అయ్యేవరకు ఔట్‌సోర్సింగ్ ద్వారా నియామకం అయిన నర్సులు ఉంటారని ఉంటే, రెండు రోజుల క్రితం నర్సింగ్ సంఘం ప్రతినిధులు రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్‌ను కలిసి మాట్లాడినప్పుడు మాత్రం ప్రభుత్వం ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు వెళ్ళిపోవాల్సి ఉంటుందనే సమాధానం లభించింది.

 

Out Patient closed in Telangana with Corona virus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News