Saturday, April 27, 2024

ప్రాంతీయ పార్టీలతోనే రాష్ట్రాల ప్రగతి

- Advertisement -
- Advertisement -

Progress of states is with Regional Parties

 

ఈ మార్చి, ఏప్రిల్ నెలల్లో దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో రెండు తూర్పు, ఈశాన్య రాష్ట్రాలయితే, మిగితా మూడు దక్షిణాది రాష్ట్రాలు. పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాలు తూర్పుదిశ భావజాల ప్రేరేపితాలు కాగా తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ద్రావిడ భూమిలోని దక్షిణాది రాష్ట్రాలు. ఇవి ఉత్తరాది ఆధిపత్య ఆర్యవర్త పార్టీల ఆధీనంలోనే ఉండేవి. ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలిగిస్తూ కేంద్రం లో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బి.జె.పి, పొత్తులతో కమ్యూనిస్టు పార్టీల పాలనలో ఈ రాష్ట్రాల వివక్షకు గురయ్యాయి. కేంద్రం జాతీయ పార్టీలు వివిధ రాష్ట్రాలపై చూపుతున్న వివక్ష నుంచి ప్రాంతీయ పార్టీలు పుట్టాయి. కేంద్రంలో జాతీయ పార్టీలు అధికారంలో ఉన్నా వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఈ పార్టీలు బి.జె.పి. అనుబంధిత ఎన్.డి.ఎ. తో కొన్ని, కాంగ్రెస్ అనుబంధిత యు.పి.ఎ. తో కొన్ని కొంత కాలం ధర్డ్ ఫ్రంటుగా కొన్ని ఉండేవి. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లోనూ ఈ ప్రాంతీయ పార్టీలు రాజ్యామేలాయి. ఒక్క కేరళలో మాత్రం సి.పి.ఎం నాయకత్వంలోని లెప్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ పాలన కొనసాగిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల ప్రత్యేక అవసరాల నుంచి, అనివార్య పరిస్థితుల నుంచి పుట్టుకొచ్చిన ప్రాంతీయ పార్టీలు ఆ రాష్ట్రానికి సంబంధించినంత వరకు మంచి పాలననే అందిస్తున్నాయి.

కేంద్రంలో కాంగ్రెస్ పాలన ఉన్నంత వరకు ప్రాంతీయ పార్టీల జోలీకి పోలేదు. కానీ బి.జె.పి. పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాంతీయ పార్టీల హననానికి పాల్పడుతుంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఇతర ప్రాంతీయ పార్టీలతో పొత్తుపెట్టుకొని ముందు కాంగ్రెస్‌ను, ఆ తరువాత ప్రాంతీయ పార్టీలను మట్టికరిపించే ఎత్తుగడల్లో బి.జె.పి. ఉంది. ప్రాంతీయ పార్టీల్లో పొరపొచ్చాలు సృష్టించి, అవి కలువకుండా చేసి అటు కాంగ్రెస్ ను, ఇటు ప్రాంతీయ పార్టీలను ఓడించ గలుగుతుంది. ప్రాంతీయ పార్టీల కంటే అభివృద్ధికరమైన, మానవీయమైన పనులు చేయడం ద్వారా అధికారంలోకి రావడం వల్ల ఎవరికి అభ్యంతరం ఉండదు. ఇది మామూలే. కానీ మత సెంటిమెంట్లను, వివక్షను, ద్వేష భావాలను రెచ్చగొడుతూ అధికారంలోకి రావాలని చూస్తుంది. కేంద్రంలోనూ, కొన్ని రాష్ట్రాల్లోనూ ఈ విషయంలో విజయం సాధించింది. బీహార్, ఉత్తరప్రదేశ్, అసోం, కర్ణాటకలాంటి రాష్ట్రాల్లోనూ, ఉత్తరాది చాలా రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రాగలిగింది. కేంద్రం లో అధికారంలోకి రావడానికి వివిధ రాష్ట్రా ల్లో అధికారాంలోకి రావడానికి ముఖ్యంగా కాంగ్రెస్‌ను, సి.పి.ఎం లాంటి జాతీయ పార్టీలను ఓడించడం ద్వారా జరిగింది. బి.జె.పి. చాలా వరకు ఉత్తరాది ఆర్యావర్త రాష్ట్రాలు, పశ్చిమ రాష్ట్రాల్లో బలమైన పునాదుల నేర్పరచుకుంది. ఇప్పుడు దక్షిణాదిపై, తూర్పు రాష్ట్రాల్లో బలమైన రాష్టమైన పశ్చిమ బెంగాల్ పై బి.జె.పి. దృష్టి పడింది.

ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీగా ఏ రాష్ట్రంలో నైనా పాలనాధికారాలు సంపాదించుకునే హక్కు పార్టీలకుంది. ప్రజాభిప్రాయాన్ని అనుసరించి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఉపయోగించుకొని ఓట్లు పొంది ఆ హక్కును ఉపయోగించుకోవచ్చు. అలా అనేక పార్టీలు చేశాయి, చేస్తున్నాయి కూడా. ప్రజలకు తమ ఎన్నికల మేనిఫెస్టోను చూపి, తాము చేసిన చేయబోయే ప్రజోపయోగకరమైన పనులను చూసి ఓటేయమని అడగాలి. కానీ బి.జె.పి. అలా చేయడం లేదు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఫెడరల్ స్ఫూర్తిని, లౌకికతను ప్రజాస్వామిక సూత్రాలను తుంగలో తొక్కుతుంది. దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి తన ఇష్టమైన మతాన్ని తద్వారా జీవన విధానాన్ని లేదా మత రహితంగా జీవించే హక్కు ఉంది. అలాంటి హక్కులను, ప్రజాస్వామిక సూత్రాలను తుంగలో తొక్కి బి.జె.పి మనుషులను మతాలుగా విభజిస్తున్నది, మతం ఆధారంగా వివక్షను చూపుతున్నది. మత సెంటిమెంట్లను, మతతత్వాన్ని రెచ్చగొట్టి ఓట్లు అడుగుతున్నది. మత సెంటిమెంట్లను రెచ్చగొట్టడం సులభం. మానవత్వాన్ని మేల్కొల్పేలా చేయడం కష్టంతో కూడుకున్న పని. సులభ పద్ధతిననుసరిస్తూ ఓటు బ్యాంకులను కొల్లగొట్టడం వల్ల దేశంలో ద్వేషభావం పెరుగుతున్నది. బుద్ధుడు చెప్పిన ప్రేమమయ, శాంతియుత, అహింసా మార్గానికి భిన్నమైన హింసా రాజకీయాల వల్లదేశ ప్రగతి కుంటుపడుతుంది. ఇలాంటి సమయంలోనే ప్రాంతీయ పార్టీల గెలుపు అనివార్యమవుతుంది.

స్వాతంత్య్రానంతరం దేశాన్నేలిన కాంగ్రెస్, కమ్యూనిస్టు బి.జె.పి.లు జాతీయ పార్టీలుగా విఫలమైన దేశంలోని కుల, మతవివక్ష, ఆర్థిక, ఆకలి, విద్య సమస్యలను కూడా పరిష్కరించ లేకపోయాయి. వీటన్నింటిన్ని తమతమ రాజకేయాధిపత్యం కొరకే ఉపయోగించుకున్నాయి. ఎలాగైనా సరే, తమ పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే ప్రధానాంశంగా రాజకీయాలు నడిపాయి. భారత రాజ్యాం గం పీఠికలో పొందుపరిచిన సెక్యులర్, సోషలిస్టు పదాలపై కూడా ఈ పార్టీలకు అవగాహన లేదు. కొంచెం ఎక్కువ తక్కువగా రాజ్యాంగ పీఠికలోని అనేక విషయాలను ఇవి అపహాస్య పాలు చేశాయి. బలహీన వర్గాలకు పొందుపరిచిన రిజర్వేషన్ల విషయంలోనూ అంతే. బి.జె.పి. అయితే రాజ్యాంగాన్నే మార్చాలని చూస్తున్నది. అంతులేని ప్రైవేటైజేషన్ పేరు మీద దేశసంపదనంతా కొద్ది మంది పెద్దల చేతుల్లో పెట్టే చర్యల్లో మునిగితేలి వుంది. బి.జె.పి.కి దేశమంటే ఆ దేశంలోని మనుషులు, ఆ మనుషుల బాగోగులు కాదు. దేశమంటే మతమే. దేశభక్తి అంటే ఆ దేశ ప్రజలపై భక్తి కలిగి వుండి, దేశం అనువణువునూ ప్రేమించడం కాకుండా పార్టీ భక్తి, తమ పార్టీని అనుసరించడమే. ఇలాంటి అనేక కారణాల వల్ల జాతీయ పార్టీలపై విసుగుతో ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి.

ప్రాంతీయ పార్టీలతో దేశ సమస్యలన్నీ తీరుతున్నాయని కాదు గాని ఆయా రాష్ట్రాలకు సంబంధించినంత వరకు జాతీయపార్టీల కంటే మెరుగైన పాలననందిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలోనూ, ప్రజాస్వామిక విలువల పరిరక్షణలోనూ, రాజ్యాంగాన్ని కాపాడటంలోనూ, ప్రాంతీయ పార్టీలు బి.జె.పి. కంటే మెరుగైన విధంగా పాలననందిస్తున్నాయి. తమ తమ రాష్టాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ తమతమ అస్తిత్వాలను కాపాడుకుంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటించడంలోనూ ప్రాంతీయ పార్టీలు ముందున్నాయి. ప్రాంతీయ పార్టీల భిన్నత్వంలో ఏకత్వం బి.జె.పి చెప్పే ఒకే మతం ఒకే దేశం లాంటిది కాదు. వివిధ మతాలు, జాతులు, కులాలు, విశ్వాసాలు, బహుళత్వాన్ని కాపాడుకుంటూనే మనుషుల మధ్య ఐక్యత కలిగివుండటం. అది లౌకికతత్వం, వివిధ భాషా, ప్రాంత సమూహాల మధ్య ఐక్యత సాధించడం ద్వారానే సాధ్యం. ఫెడరల్ రాజకీయాల వల్లనే సాధ్యం. ఇవ్వన్నీ కాపాడబడాలంటే దేశం భారతజాతిగా కలిసి ఉండాలంటే లౌకికత్వాన్ని ప్రేమించే పార్టీలు అధికారంలో ఉండాలి.

కమ్యూనిస్టుల కులం, మతం, జాతుల పై అస్పష్టత, కాంగ్రెస్ కుహనా సెక్యులరిజం దేశాన్ని అయోమయంలోకి నెడితే- బి.జె.పి. మతతత్వం, వివక్ష పూరిత రాజకీయాల దేశాన్ని అంధకార యుగంలోకి నెట్టుతున్నాయి. అందుకే ప్రాంతీయ పార్టీల గెలుపు నేటి సామాజిక, రాజకీయ చరిత్రక అవసరం. ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పాలన సాగించిన కాంగ్రెస్ నుండి విముక్తమై పశ్చిమ బెంగాల్ ముప్పై ఐదు ఏళ్ళ పాటు సి.పి.ఎం. పాలనలో ఉంది. కానీ కమ్యూనిస్టుల పాలనలో బెంగాల్‌లో ఏ మౌలికమైన మార్పు రాలేదు. అది మాటల వరకే సెక్యూరిజం, రాజ్యాంగ పైనే నమ్మకం లేని స్థితి. సి.పి.ఎంను ఓడించి తృణమూల్ కాంగ్రెస్ గత పదేళ్లుగా పాలన చేస్తున్నది. ఇప్పుడు బి.జె.పి. అడుగుపెట్టాలని చూస్తోంది. అందుకు సి.పి.ఎం సహకరిస్తున్నట్టు వార్తలు. సామాన్య స్థితి నుండి వచ్చిన మమతా బెనర్జీ అసాధారణంగా ఎదిగి బెంగాల్ ముఖ్యమంత్రి అయింది. జాతీయ పార్టీలన్నింటికంటే మంచి పాలనే అందిస్తున్నారు. మమతను ఓడించి బి.జె.పి.కి స్థానం కల్పిస్తే బెంగాల్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్టే. కానీ సింహబలురాలు, అన్నిటికి ఆమడ దూరంలో ఉన్న మమతను ఓడించడం బి.జె.పి తరం కాదు. ద్రవిడ రాజకీయాలకు, దక్షిణాది అస్తిత్వ రాజకీయాలకు పుట్టినిల్లయిన తమిళనాడులో కాలు మోపాలని బి.జె.పి. పథకాలు పన్నుతున్నది.

డి.ఎం.కె. ప్రత్యర్థి అన్నాడి.ఎం.కె బి.జె.పి.కి సహరిస్తున్నది. కాని ద్రావిడ, లౌకిక, ప్రజాస్వామిక రాజకీయాలకు ఐకాన్‌గా ఉన్న స్టాలిన్ ద్రావిడ భూమిలో బి.జె.పి చొరనీయడన్నది వాస్తవం. అన్నా డి.ఎం.కె. కానీ, వేరే పార్టీయిన బి.జె.పి మత్తులోపడి సహకరిస్తే అది దక్షిణాది, ద్రావిడ రాజకీయాలకు, ద్రోహం చేసినట్టే కాక అతి పెద్ద చారిత్రక తప్పిదమే అవుతుంది. ద్రావిడ రాజకీయాలకు ఆత్మగౌరవానికి కరుణానిధి వేసిన పునాది, స్టాలిన్ నిబద్ధత డి.ఎం.కె.ను గెలిపిస్తుందండంలో సందేహం లేదు. పినరయి చేసిన సుపరిపాలన, సైద్ధాంతిక నిబద్ధత నూటికి నూరు శాతం అక్షరాస్యతా ఉన్న కేరళలో సి.పి.ఎంను గెలిపించి తీరుతుంది. అసోం, పుదుచ్చేరిలలో బి.జె.పి. పెట్టుకున్న ఆశలు అడియాసలవుతాయనడానికి బి.జె.పి. లౌకిక తత్వానికి భంగం కలిగిస్తూ చేస్తున్న పాలనే ప్రబల నిదర్శనం. ఏదేమైనా ప్రాంతీయ పార్టీల చేతుల్లో దేశ భవిషత్తు ఆధారపడుందని ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు నిరూపించబోతున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News