Friday, April 26, 2024

సాహిత్యం సాహసం సంస్కరణం

- Advertisement -
- Advertisement -

PV Narasimha Rao

పీవీ గురించి మూడు మాటల్లో చెప్పాలంటే, సాహిత్యం, సాహసం, సంస్కరణం అని చెప్పవచ్చు! ఆయన శారీరకంగా చూడడానికి అంత బలంగా, దేహ దారుఢ్య నిర్మాణంతో కనిపించడు . కానీ ఆయన జ్ఞానం, విజ్ఞానం, సాహిత్యం, పాండిత్యం పరంగా మాత్రం అత్యంత బలవంతుడు! ఆయనకున్న బలాలు భాష, సాహిత్యాలే! బహు భాషలపై పట్టు, ఆయా భాషలలోని లోతైన సాహిత్య విషయాల పట్ల అవగాహన ఆయనను మేధోపరంగా సుసంపన్నునిగా చేశాయి. ఆయా ప్రజల అవసరాలను, కష్టాలను అర్థం చేసుకోవడానికి కావలిసిన ఆలోచనను ఆయనలో ఈ భాష సాహిత్యాలు కలిగించాయి. దీనిని అనుసరించే ఆయన ఎన్నెన్నో సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకోగలిగారు. భూసంస్కరణలు, ఆర్ధిక సంస్కరణలు వంటివి అన్నీ ఆయనలోని సాహసికున్ని తెలియచేసేవే! ప్రతీ హోదాలో ఆయన ప్రవేశపెట్టిన ప్రణాళికలు, ఆచరించిన నిర్ణయాలు అన్నీ ఆ యా కాలాలలో అప్పటి వ్యవస్థలను, వ్యక్తులను, సవాళ్ళను , సమస్యలను అధిగమించి అమలు చేసినవే! ఇక ఆయన సంస్కరణల ప్రధాన లక్ష్యం అంతా ప్రజా వికాసమే, వారి అభ్యున్నతే!!
సాహితీవేత్తగా – రాజనీతిజ్ఞుడిగా

గ్రీక్ తత్వవేత్త ఫ్లేటో ‘King should be a Philosopher or Philosopher should become a King. Then only they will rule the subjects for the maximum benefit of the subjects’ అని చెప్తాడు. ఇక్కడ పీవీ కూడా అంతే! పీవీ తాత్వికత, సాహిత్యం తెలిసిన పాలకుడు! అలాంటి పాలకుడి పాలనావిధానంలో ఖచ్చితంగా ఒక తేడా కనిపిస్తది. ఒక ఆర్తి, ఒక మానవీయ స్పర్శ, ఒక స్పందన మనకు కనిపిస్తది. ఎందుకంటే కళాకారుడు, సృజనకారుడు, సాహిత్యవేత్త సాధారణంగా సున్నిత మనస్కులు అయివుంటాడు. ఎవరైతే ప్రపంచంలో జరిగే ప్రతి సన్నివేశానికి, సంఘటనకు, సందర్భానికి దుఃఖ పడతారో, స్పందిస్తారో, వారే కళాకారుడో, సృజనకారుడో, సాహితీవేత్తనో అవుతారు. ఈ స్పందించే సుగుణం, ఇది వారిని మిగతా వాళ్ళందరి నుంచి ప్రత్యేకంగా చూపిస్తుంది. వారి ఆలోచన,ఆచరణలో ఆ తేడా కనిపిస్తుంది. మిగతా వాళ్లందరూ స్పందిస్తరు కానీ సాహితీవేత్త తొందరగా స్పందిస్తాడు. అందుకే ఏదన్న చిన్న సంఘటన జరిగిందంటే మొదట కవితలే వస్తాయి.!

లాగే స్పందించే సంవేదనా హృదయం పీవీకి ఉండడం వల్ల వారు వెంటనే ప్రజల విషయంలో, పరిపాలన విషయంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. వేర్వేరు మంత్రిత్వ శాఖల్లో మంత్రిగా పివి తీరును పరిశీలిస్తే ఇది అర్ధం అవుతుంది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు విద్యారంగంలో, భూసంస్కరణల విషయంలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. దాని వెనక తను నడిసొచ్చిన బాట ఉంది, తన అనుభవాల సారం ఉంది. నిజానికి చెప్పాలంటే ఆయన వంగర ప్రాంతంలో ఉండే ఎన్నో వందల ఎకరాల భూమికి అధినేత అయినప్పటికీ అందరికంటే ముందు దాదాపు 900 ఎకరాల భూమిని అక్కడి స్థానిక ప్రజలకి పంచిపెట్టారు. ఒక భూస్వామి నుండి మనం ఇలాంటి ఔదార్యాన్ని ఉహించగలుగుతమా? భూస్వామి అంటే తన భూమిని కాపాడుకుంటారు. మిగతా వాళ్ళు అందరూ అదే పని చేసారు. కానీ పీవీ అందుకు భిన్నంగా చేసాడు. ఎందుకు చేశాడంటే ఆయనలో ఉండే ఆ సాహిత్యపరమైన చైతన్యం ఒక మానవీయ స్పర్శ, ఒక ఆత్మీయ భావనలే బహుశా దానికి కారణమని భావించవచ్చు. అందుకనే తను చదువుకున్న సాహి త్యం, తను చూసిన ప్రపంచం, సమాజము ఇవన్నీ ఆయనలో ఒక గొప్ప మానవీయ కోణం రావడానికి దారితీసాయని చెప్పవచ్చు.

పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ అనే విధానాన్ని కూడా ప్రవేశపెట్టిండు. భారతదేశంలో ఎక్కడా అప్పటివరకు ఇంకా రెసిడెన్షియల్ విధానమే లేని కాలంలో అయన ఈ పంథాకు శ్రీకారం చుట్టాడు. దానికి అయనలోని సంప్రదాయవాదమే ప్రేరకమై ఉండవచ్చు! మొదటినుంచి భారతీయ మూలాల్లోంచి తాత్వికతని తన జీవన విధానాన్ని నిర్మించుకున్న వ్యక్తి.. బాగా ఆకళింపు చేసుకున్న వ్యక్తి పీవీ ! గనక ఆయన గురుకుల పద్దతిలో ఈ విధానము ప్రవేశపెట్టాడు. ఎప్పుడో ప్రాచీనకాలంలో వేద అధ్యయనాలు చేయడానికి గురుకుల ఆశ్రమాలు ఉండేవి. ఈ ఆశ్రమాల్లోకి వెళ్ళి గురువుల దగ్గర శిష్యరికం చేసుకుంటూ విద్యార్థులు విద్యను అభ్యసించే విధానం ఇది.. అలాంటిదాన్నే ఈయన రెసిడెన్షియల్ అవాస విద్యాలయాలు అనే పేరుతో ప్రవేశపెట్టిండు. సర్వేల్ ప్రాంతంలో చేసిన ఈ ప్రయోగం, ఆ తరువాత ఎన్ని వందలమంది గొప్పగొప్ప వ్యక్తులను సృష్టించిందో మనకు చరిత్ర చెప్తోంది. ఎంతోమంది ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, గొప్పగొప్ప డిప్లొమాట్స్, పాలసీ మేకర్స్ సర్వేల్ స్కూల్ నుంచే చదువుకొని పైకొచ్చిన వాళ్ళున్నారు.

అలాగే ఆయన కేంద్రమంత్రి అయిన తరువాత మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి (human resources development minister) గా ఉండి అప్పుడు మళ్ళీ నవోదయ విద్యాలయ విధానానికి కూడా బీజం వేశారు. అంటే ఇక్కడ విద్య అనే అంశాన్ని ఆయన ఎందుకు ప్రత్యేకంగా భావించాడంటే, ప్రజల్లో జ్ఞానులుంటారు అన్ని సామాజికవర్గాల్లో అన్నిరకాల ప్రజల్లో జ్ఞానం అనేది ఉంటుంది. జ్ఞానం అనేది ఎవరి సొత్తు కాదు. అలాంటప్పుడు ఎవరైతే జ్ఞానాన్ని అన్వేషించే క్రమంలో ప్రతిభావంతంగా ఉంటరో వారికొక చేయూతని, సౌకర్యాలని, ప్రోత్సాహాన్ని, ఒక ఉత్సాహాన్ని ఇవ్వాలి! ఒక ఎదుగుతున్న మొక్కకి చుట్టూ ఒక మంచి నిర్మాణాన్ని ఇవ్వడం ద్వారా ఆ మొక్కని గొప్ప చెట్టుగా మలచొచ్చు అనే ఒక నిర్మాణాత్మక వైఖరి, భవిష్య దృక్పథం పీవీ నరసింహారావు గారికి మొదటినుంచి ఉంది. అందుకే ఆయన అలాంటి కొత్త సంస్కరణలకి పాదువేయగలిగాడు.

మరొక అంశం – బహిరంగ (ఓపెన్) జైల్స్. మనం ఉహించగలుగుతామా ? ఎవరైన నేరస్తులను, తప్పుచేసినవారిని సామాజిక నియమాలను, సామాజిక స్థితిని భంగం చేసినవాళ్ళని తీసుకెళ్ళి మనం జైల్లో పెడతాం. వారిలో పరివర్తనకోసం జైల్లో పెట్టడం అనేది సాధారణం. కానీ ఓపెన్ జైలు విధానం భారతదేశంలో ఎక్కడాలేని ఒక కొత్త ప్రయోగం ! ప్రారంభించింది పీవీ నరసింహారావు గారే! అదొక గొప్ప సంస్కరణ. అది అయన అనూహ్య సంస్కారం నుంచి పుట్టింది. నేరస్తులు కూడా ఎదగడానికి, మారడానికి తోడ్పాటును అందించాలి. వారిని వేర్పాటు చేయడంకాదు, వారిని సమాజంలో అంతర్భాగం చేయడం ద్వారానే వాళ్ళలో పరివర్తన తీసుకురావచ్చు. తప్పు పట్ల, అన్యాయం పట్ల వారిలో అవగాహన కలిగించేలాగా ఒక అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో చేసిన కార్యం ఇది. ఆయనకుండే వ్యక్తిగత అనుభవాలకు తోడు అయన సాహిత్య అనుభవం, సాహిత్య అధ్యయనం వల్ల వచ్చిన విశాల దృక్పధం, మానవీయ స్పర్శ వల్ల నే ఇది వచ్చిందని భావించవచ్చు. లేకపోతే వచ్చేది కాదు.
అలాగే భూసంస్కరణలు కూడా! అసలు భారతదేశం మొత్తంమీద భూసంస్కరణలు తీసుకొచ్చి ల్యాండ్ సీలింగ్ యాక్టు, పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టాలు చేయడం ఒక విప్లవమే అని చెప్పాలి. కమ్యూనిస్టులందరు చెప్పిన విధానం, సోషలిజం, కమ్యూనిజం చెప్పిన సిద్ధాం తం ఏందంటే దున్నేవాడికే భూమి ఉండాలి, భూమి అందరి సొత్తుకావాలి, కొంతమంది చేతుల్లో మాత్ర మే ఉండకూడదు, భూస్వాముల చేతుల్లోనే భూమి ఉండకూడదు శ్రామికుడికి దక్కాలి ’ అనేవి వారి సైద్దాంతిక భూమికలు. కానీ ఇక్కడ ఈయన ఆచరణలో చూ పించాడు. ఎంత సంప్రదాయవాదో, అంత ఆధునికవాది, అంతే ప్రజాస్వామ్యవాది.! అందుకే ఆయన వెంటనే దాన్ని అమలుచేసి భూ గరిష్ట పరిమితి చట్టం తీసుకొచ్చాడు, అలాగే భూమిలేని వాళ్ళకి, వ్యవసాయ కూలీలకు, నిరుపేదలు ఎంతోమందికి భూమి వచ్చేలాగా, భూ పంపిణీ జరిగేలాగా భూసంస్కరణలు తీసుకువచ్చారు. దీనివెనుక అంతా సాహితీవేత్తగా ఆయనకున్న సునిశితత్వం, సున్నితత్వమే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఖచ్చితంగా కారణం అని చెప్పవచ్చు.

అందుకే ఒక సాహితీవేత్త, ఒక కళాకారుడు, ఒక సృజనశీలి, ఒక అక్షర ప్రేమికుడు అధికారంలో ఉంటే, పదవిలో ఉంటే ఆ మేరకు పాలనలో ఆ తేడా అనేది ఖచ్చితంగా కనిపిస్తది. పీవీ నరసింహారావు విషయంలో నిజమైన సత్యమిది. అందుకే ఆయన పాలకుడిగా చేసిన నిర్ణయాలు అన్నింటి వెనక సాహితీవేత్తగా ఆయన ఎదిగిన తీరు, అక్షరాల సాంగత్యంతో తాను నిర్మించుకున్న వ్యక్తిత్వం అంతా ప్రతిబింబితం అయిందనే చెప్పవచ్చు.
పీవీ చతురత – భాషా ప్రావీణ్యత

పీవీ భాషా పాండిత్యం వల్లనే ఆయన వేరు వేరు సందర్భాలలో ఎన్నెన్నో మేధాపరమైన. చమత్కారాలు చేసారని చెప్పవచ్చు. మనందరం ఆయనను ముని, మౌని అని అనుకుంటుంటాం. అయితే అయన మాట్లాడిన మాటలన్నీ ఎంతో గొప్పగా ఇప్పటికి ఒక జాతీయాలుగా, సూక్తులుగా మిగిలిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు నిర్ణయం తీసుకోకపోవడం కూడా ఒక నిర్ణయమే లాంటి కొత్త కోణాలు పాలనా విధానంలో మనకు తెలిసొచ్చాయి. అలాగే ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అనే మాట! ఆయన ప్రధానమంత్రి అయిన తరువాత హైదరాబాద్ లో సన్మానం చేసినప్పుడు ఢిల్లీకి రాజును కావచ్చుగానీ తల్లికి కొడుకునే అని ఒక్కమాట చెప్పి మనదైన పదబంధాల్లోంచి మనదైన సామెతల్లోంచే మట్టిపట్ల, ప్రజలపట్ల, ఎదిగొచ్చిన నేలపట్ల ఉండే ప్రేమను వ్యక్తంచేసిన మనిషి పీవీ నరసింహారావు! అలాగే ఇంకోమాట కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. (Law can take it’s own due course) అనే మాట! అది ఇప్పటికే కాదు ఏ సందర్భంలోనైనా వాడుకోవడానికి వీలుగా వచ్చిన ఒక పదంగా పరిణమించింది !.

ఇలాంటి పద చమక్కులు ఎవరు మాట్లాడగలుగుతారంటే జీవనసారాన్నంతా చెప్పగలిగిన వాళ్ళు మాత్రమే ఇలాంటి మాటలు చెప్పగలుగుతారు. అందుకే ఆయన మౌనంగా ఉండొచ్చు! ఎక్కువ సందర్భాలలో మితభాషిగా ఉండవచ్చు. కానీ అది తాత్వికత! జీవితాన్నంత తెలుసుకున్న ఒక జ్ఞాని తాలూకు మౌనం అది! ఆయన ప్రతి సందర్భంలోనూ నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం చాలా సాహోసోపేత నిర్ణయాలు తీసుకొని ప్రపంచానికి ఒక కొత్త మార్గాన్ని చూపించినాడు! దీనివెనుక అంతా ఆయనకుండే సాహితీ నేపథ్యం, భారతీయ తాత్విక జీవనం, ధార్మికచింతన, ఆధ్యాత్మిక స్పూర్తి..వాటి వల్ల ఒన గూడిన నిండుతనమే ఆయనలో మనకు కనిపిస్తది.

ఇదే సందర్భాల్లో పీవీ ప్రయోగించిన కొన్ని చమత్కారాలు ఉన్నాయి. ఆయనకు చరిత్ర పట్ల, భాష పట్ల ఎంత పట్టు ఉందో అన్న విషయం చెప్పడానికి ఒక ఉదాహరణలివి. ఒకసారి పాకిస్తాన్ లో, అక్కడి మేధావులు ‘మీరు తాజ్ మహల్ ఉందని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ తాజ్ మహల్ ని మాకు ఇవ్వొచ్చు కదా‘ అన్నారట. అప్పుడు ఆయన వెంటనే తడుముకోకుండా క్షణకాలం ఆలస్యం చేయకుండా ‘మీరు హరప్పా మొహంజదారో మాకు ఇచ్చేయండి‘ అన్నారు. చూడం డి ఎంత అద్భుతమో, హరప్పా మొహంజదారో ప్రాచీన నాగరికతలు! అవి ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నాయి. చరిత్ర ఆనవాళ్లు అవి. అంటే అంత సమయ స్ప్హూర్తి తో, లాజికల్ గా, మేధస్సుతో ఒక చారిత్రిక దృక్కోణంతో రిటార్ట్ ను ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి.
అలాగే ఒకసారి లండన్ లో ఒక కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు ఆ కాన్ఫరెన్స్ లో పీవీ బ్రిటిష్ ఇంపీరియలిజం అని మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే అందులో ఉన్న ఒక స్కాలర్ ‘మీరు బ్రిటిష్ ఇంపీరియలిజం (బ్రిటిష్ సామ్రాజ్యవాదం) అంటున్నారు ఇది కరెక్ట్ కాదు, నేను వ్యతిరేకిస్తున్నా‘ అన్నాడు. వెంటనే ఈయన అన్నాడట But we are also not snake charmars, you know అని! అంటే బ్రిటిష్ వాళ్ళల్లో భారతీయులు అంటే పాములు ఆడిచ్చేటోల్లే అనే భావన అప్పట్లో బాగా ఉండేది. మీ దృష్టిలో మాత్రం మేం snake charmars గా ఉండొచ్చు, మా దృష్టిలో మాత్రం మీరు ఇంపీరియలిస్ట్ గా ఉండకూడదా. మా అభిప్రాయం ఇది. ఎందుకంటే మీరు వచ్చారు. ఆక్రమించుకున్నారు ఇవన్నీ జరిగాయి అని అన్నారు. అట్లా వెంటనే రిటార్ట్ ఇవ్వడమనేది పీవీ సమయోచిత జ్ఞానం! అయన చతురత ! ఇలాంటి సమయ సందర్భోచిత చురకల చతురత ఆయనకు అబ్బడానికి సాహిత్యమే కారణం! Only because he is having that hold over language and on litera ture and all the historical evidences, he made these statements with elan and sharp spontan eity!

ఇక్కడ గుర్తుచేసుకోవల్సిన మరో విషయం ఏమిటంటే, కేంద్రంలో ఆయన పదవులలో ఉన్న సమయంలోనే తెలుగు ప్రాంతానికి జాతీయస్థాయిలో అవార్డులు వచ్చాయి. ఉదాహరణకు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణకి జ్ఞానపీఠ్ అవార్డు రావడం వెనుక గూడా వారే ప్రధానపాత్ర పోషించారనేది మనకు చరిత్ర చెప్తున్న సత్యం. అలాగే కాళోజి నారాయణరావుకి పద్మవిభూషణ్ అవార్డు రావడంలో ప్రధానమైన భూమిక పీవీ నరసింహారావుదే. రాకూడదని కాదు తెలుగు సాహిత్య లోకంలో ప్రతిభా సంపన్నతకు కొదువలేదు. కానీ అక్కడ మనవైవు నుండి వాదించడానికి, కావలసిన సందర్భంలో పీవీ నరసింహారావు తెలుగు వారి ఔన్నత్యాన్ని తెలుగు సాహిత్యం యొక్క సొబగును, గొప్పతనాన్ని తనకు ఇతర భాషలతో పరిజ్ఞానం ఉంది గనక వాళ్ళకి సరిగా వివరించి ఒప్పించగలిగారు. హిందీ ప్రాంత జడ్జీలకి, అక్కడుండే జ్యూరీ మెంబెర్స్ అందరికి తెలుగు రచనల్లోని ఔన్నత్యాన్ని వివరించి, వారిని ఒప్పించి అవార్డులు రావడంలో కీలకమైన భూమికని వారు పోషించారని చెప్పొచ్చు. దీనివెనుక వారికి సాహిత్యం పట్ల ఉండే ప్రేమ, భాష పట్ల ఉండే అనురక్తి, తన మూలాల పట్ల ఉండే అభిమానమే ప్రధాన కారణం.
పీవీ జీవితం – నిత్యస్ఫూర్తిదాయకం

పుస్తకం చాలా చిన్నది జీవితం ఎంతో పెద్దది! ఒక వ్యక్తికి సంబంధించిన జీవితాన్ని ఒక పుస్తకంలోకి కుదించడమనేది జరక్కపోవచ్చు. ఎందుకంటే ‘ఆఫ్ ద రికార్డ్’, ‘ఆన్ ద రికార్డ్’ ఎన్నో విషయాలు ఉంటాయి. అందుకే తను స్వతహాగా ఆటో బయోగ్రఫీ అనేది రాయకపోయినా ‘ఇన్ సైడర్‘ అని రాసుకున్న అత్మకథనాత్మక పుస్తకం ఉంది, Half Lion పేరుతో వినయ్ సీతాపతి రాసిన పుస్తకం ఉంది. ఇంకా ఎంతో మంది ఎన్నెన్నో పుస్తకాలు రాసారు. కానీ ఇంకా రావలసివుంది. ఆయన గురించి ఇంకా అన్వేషణ చెయ్యాలి. ఆయనలో ఎన్నెన్నో కోణాలు ఉన్నాయి. వాటిని అన్వేషించాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. దాన్నొక పరిశోధనలాగా రీసెర్చ్ చేసి చారిత్రక ఆధారాల్లోంచి వాటిని వెలికితీయాల్సిన సందర్భం కూడా ఉంది.అయితే తన సమకాలీనులకే కాకుండా నేటి యువతకు సైతం నిరంతర స్ఫూర్తిగా నిలవగలిగే జీవితం పీవీది. ఒక్కసారి ఆయన ప్రస్థానాన్ని గమనిస్తే చాలు! ఒడలు పులకరిస్తయ్, గొప్ప స్ఫూర్తి వస్తది. మనం ఇప్పటికే ఆయన గురించి పాఠ్యపుస్తకాల్లో చేర్చుకున్నాం. ఒక మనిషి ఒక జీవితంలో 15, 16 భాషల్లో ప్రావీణ్యత సాధించడం సాధ్యమా, మామూలు గ్రామం నుంచి మొదలైన మనిషి ప్రస్థానం ఢిల్లీ పీఠాన్ని ఎక్కేంత వరకు ఎదగడం సాధ్యమా? ఒక మాములు మట్టి మనిషి ఒక ముఖ్యమంత్రిగా ఎన్నెన్నో కీలక నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం సాధ్యమా? ఒక పల్లెటూరులో పుట్టిన పట్వారి ప్రధానమంత్రిగా దేశ చుక్కానిగా నిలవడం సాధ్యమా? నిజం చెప్పాలంటే ఇవన్నీ ఒక సాధారణ మనిషికి అసాధ్యం. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఒక విన్నింగ్ స్టోరీని లిఖించిన విజేత పీవీ! విజేత కథ అనగానే మనం అనుకుంటాం బిల్ గేట్స్, జుకర్ బర్గ్ ని, స్టీవ్ జాబ్స్ ని సక్సెస్ స్టోరీగా చెప్తున్నాం. మనం West వైపే చూస్తున్నాం, సక్సెస్ అంటే పాశ్చ్యాత్య దేశాలదే అన్నట్టుగా మనం భావించేలా ఇంగ్లిష్ లోని పుస్తకాలన్నీ వాళ్ళనే సక్సెస్ స్టోరీగా చెప్తూ రావడం వల్ల, ఆ పుస్తకాలనే చదువుతూరావడం వల్ల, ఆ పుస్తకాల్లో అక్కడి జీవితాలకు సంబంధించిన అంశాలనే పుస్తకీకరించబడడం వల్ల, మనం అనుకోకుండా వాటినే అనుసరిస్తూ వాళ్ళవే సక్సెస్ స్టోరీస్ అనుకుంటున్నాం. కానీ పీవీ గారే విదేశీ దౌత్య విధానంలోLook East అని చెప్పినట్టు, ఇదే సూత్రాన్ని జీవన గమనానికి కూడా అన్వయించి చూస్తే, తెలంగాణలో, భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డది ఒక అద్భుతమైన విజయగాధే! అలాంటి సక్సెస్ స్టోరీల్లో తలమానికం, మణిభూషణం లాంటి విజయగాధ ఖచ్చితంగా పీవీ నరసింహారావు గారిదే! ఎందుకంటే ఆయన గమనం చూస్తేనే మనకు అర్థం అవుతుంది. ఎన్ని ప్రతి బంధకాలను, ఎన్ని ప్రతికూల అంశాలను, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఆయన నిలబడ్డాడు. గెలిచాడు, ఇన్నిటిమధ్య కూడా భారతీయత చెప్పిన, భగవద్గిత విశదీకరించిన స్థితప్రజ్ఞతను ఎక్కడా కోల్పోలేదు.

అలాగే రాబిన్ శర్మ, దీపక్ చోప్రా, స్టీవెన్ కోవి, డెయిల్ కార్నెజ్ మొదలైన వాళ్ళందరు వ్యక్తిత్వ వికాసం గురించి గొప్పగా రాసారు అని అనుకుంటాం కానీ వారు చెప్పిన సూత్రాలన్నీ మనకు భారతీయ తాత్వికతలో అంతర్భాగంగా కనిపిస్తాయి. పీవీ జీవితాన్ని ఒకసారి అధ్యయనం చేస్తే ఇవన్ని మనకు అర్ధం అవుతాయి. అన్ని సందర్భాలలో రాగద్వేషాలకు అతీతంగా ఉన్నవాడు. ఎలాంటి పరిణామం వచ్చినా చలించకుండా వీరత్వంతో సమస్యను ఎదుర్కున్న వాడు. మెజారిటీ లేకున్నా కూడా ఐదేళ్ళపాటు పాలనని అవిరామంగా కొనసాగించినవాడు. ఇవన్నీ ఎవరికి సాధ్యం అవుతాయి? ఖచ్చితంగా పీవీ లాంటి మహనీయుడికే సాధ్యం అవుతాయి. అందుకని యువత ఆయన జీవితాన్ని కొత్తగా అధ్యయనం చెయ్యాలి. కొత్తగా అన్వేషించాలి. ఇప్పుడు వారెన్ బఫెట్, JK రోలింగ్ ను మాత్రమే కాదు పీవీ నరసింహారావు జీవితంలో వచ్చిన సవాళ్ళు, సమస్యలు వాటిని ఆయన అధిగమించిన తీరుని ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క జీవన పాఠం లాగా గమనిస్తూ మనం మన జీవితానికి ఏవిధంగా అన్వయించుకోగలుగుతామో, ఏవిధంగా దాన్ని స్ఫూర్తిగా తీసుకోగలుగుతామో ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇన్ని కోణాల్లోంచి చూస్తే యువతకి New Icon ఎవరన్న ఉంటే అయన ఖచ్చితంగా పీవీనే అని అర్ధం అవుతుంది. అంటే మనం విస్మరించిన ఐకాన్ (The Forgotten Icon is PV) అని గుర్తు వస్తుంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి చొరవ వల్ల మళ్ళీ పీవీ ఔన్నత్యాన్ని మరొక్కసారి మట్టిలోంచి పెల్లగించి పైకి తీసి ప్రపంచానికి చూపి ంచే అవకాశం వచ్చింది.

పీవీ ఒక వజ్రం! ఈ వజ్ర ప్రకాశాన్ని చూపించే అవకాశాన్ని ఈ శత జయంతి సంవత్సరం మళ్ళీ కలిగించింది. మన లో ఆలోచన రేకెత్తిచ్చింది.

మామిడి హరికృష్ణ

8008005231

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News