Monday, April 29, 2024

తెలంగాణ ప్రజల స్వప్నం కాంగ్రెస్‌తోనే సాధ్యం:రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

బోదన్: తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వప్నం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని ఎఐసిసి నాయకులు రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ పథకాలను చట్టాలుగా చేస్తామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ విజయ భేరి యాత్ర సభ పట్టణంలోని బాలానగర్ గ్రౌండ్‌లో శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 24 గంటలు మోడీ తన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, మోడీ కలలో తనను కూడా వదలడం లేదన్నారు. తనపై 24 కేసులు పెట్టారని, సిబిఐ, ఈడి, అన్ని దర్యాప్తు సంస్థలు తనపై దాడి చేస్తున్నాయని అన్నారు. తన ఇల్లు లాక్కున్నారని, కానీ తనకు ఇల్లు భారతదేశంలోని ప్రతి పేదవాడి గుండెల్లో ఉందన్నారు. కేసులు పెట్టి లోక్‌సభ నుండి వెళ్లగొట్టారని, మోడీకి వ్యతిరేకంగా పోరాడితే కేసులేనని, కానీ కేసిఆర్‌పై ఎలాంటి కేసులు లేవని అన్నారు. బిజెపి, ఎంఐఎం పార్టీలు బిఆర్‌ఎస్‌కు మద్దతిస్తున్నాయన్నారు.

కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని, ఎంఐఎం పార్టీ తమపై వ్యతిరేకంగా పోరాడటానికి బిజెపి డబ్బులిస్తుందన్నారు. కాంగ్రెస్ ముఖ్య కర్తవ్యం రాష్ట్రంలో కేసిఆర్‌ను, కేంద్రంలో మోదీని ఓడించడమేనని పేర్కొన్నారు. తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్, రాష్ట్రం కోసం కలలు కన్న స్వప్నాన్ని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నెరవేరుస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి మహిళకు నేరుగా రూ.2500 బ్యాంకులో వేస్తామని, రూ.లు 500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామన్నారు. అలాగే మహిళలకు బస్‌లో ఉచిత ప్రయాణం, ప్రతి రైతుకు ఎకరానికి రూ. 15 వేలు రైతు బంధు ఇస్తామన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్, ఇళ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం రాగానే మొట్టమొదటగా ఇంటి కొరకు 5లక్షల సహాయం అందిస్తామన్నారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు ఇల్లు నిర్మించి ఇస్తామని, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ కడతామన్నారు. ఉద్యోగాల కోసం ట్రైనింగ్ తీసుకునే వాళ్లకు 5లక్షల రూ.లు అందిస్తామన్నారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఒక్కసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని, గతంలో ఓడినా గెలిచినా ప్రజల మధ్యనే ఉంటున్నానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని ఆమె రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గంలోని పలు మండలాల నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రజలతో మా కుటుంబానికి రక్తసంబంధం : రాహుల్
తెలంగాణతో తమ కుటుంబానికి రాజకీయ బంధం కాదని రక్త సంబంధం అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. శనివారం బోధన్‌లో బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ప్రజల సర్కారు వస్తుందని ప్రజలు భావించారని కెసిఆర్ కుటుంబ పాలన వచ్చిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఏం చేసిందని కెసిఆర్ పదేపదే అడుగుతున్నారని కెసిఆర్ చదివిన స్కూల్ మొదలుకొని యూనివర్సిటీ వరకు అన్ని తామే కట్టించామన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలును హామీ ఇచ్చామన్నారు. సిఎం కెసిఆర్ పాలన సాగిస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని సైతం కాంగ్రెస్‌తోనే సాధ్యమైందని గుర్తు చేశారు.

కాంగ్రెస్ ఆరు గ్యారంటీ స్కీములను అధికారంలోకి వచ్చిన తొలి కేబినెట్‌లోనే ఆమోదించి అమలు చేస్తామన్నారు. మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు 24 కేసులు పెట్టారని కేసులకు భయపడేది లేదన్నారు. తనపై కక్షతో పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేశారని, ఇల్లు ఖాళీ చేయించారని ఆయన బాధపడలేదని దేశ ప్రజల గుండెలే తన ఇల్లు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సుదర్శన్‌రెడ్డి మండవ వెంకటేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, సునీల్‌రెడ్డి, తాహెర్‌బిన్‌హందాన్, మోహన్‌రెడ్డి, గంగాశంకర్, తూము పద్మావతి, శరత్‌రెడ్డి, అనిల్, అరికెల నర్సారెడ్డి, అంతిరెడ్డి రాజిరెడ్డి, నగేష్‌రెడ్డి, గంగాధర్ పట్వారి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News