Wednesday, May 1, 2024

‘నా నిర్ణయం మారదు..నన్ను బాధపెట్టకండి’: ఫ్యాన్స్ కు రజనీ అభ్యర్థన

- Advertisement -
- Advertisement -

చెన్నై: రాజకీయ ప్రవేశంపై తన తుది నిర్ణయాన్ని ఇదివరకే ప్రకటించేశానని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సోమవారం స్పష్టం చేశారు. రాజకీయాలలోకి ప్రవేశించకూడదన్న నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలంటూ తనపై ఒత్తడి తీసుకురావడానికి ఎటువంటి ప్రదర్శనలు నిర్వహించి, తనను బాధపెట్టవద్దని ఆయన తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. రజనీకాంత్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరుతూ ఆయన అభిమానులు ఆదివారం నాడిక్కడ పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. తన అభిమానులు చేపట్టిన ఆందోళనను పురస్కరించుకుని 70 ఏళ్ల రజనీకాంత్ తన ట్విటర్ ఖాతాలో ఒక ప్రకటన పోస్ట్ చేశారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని తాను నిర్ణయించుకోవడానికి గల కారణాలను ఇదివరకే వివరించానని రజనీ తన ప్రకటనలో తెలిపారు.
నేను రాజకీయాల్లోకి రావాలంటూ ఒత్తిడి తీసుకురావడానికి అటువంటి ప్రదర్శనలు నిర్వహించి నన్ను మరింత వేదనకు గురిచేయకండి అంటూ ఆయన నిన్నటి కార్యక్రమాన్ని నిర్వహించిన అభిమానులను కోరారు. రజనీ మక్కల్ మండ్రమ్(ఆర్‌ఎంఎం)కు చెందిన బహిష్కృత కార్యవర్గ సభ్యులతో సంబంధం ఉన్న వారు నిన్న(ఆదివారం) ఒక ప్రదర్శనను నిర్వహించారని రజనీ తెలిపారు. చెన్నైలోని వల్లువర్ కొట్టంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో క్రమశిక్షణతో నిర్వహించినందుకు నిర్వాహకులను ఆయన అభినందించారు. అయితే ఆర్‌ఎంఎం నాయకత్వం ఆదేశాలను ధిక్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా దూరంగా ఉన్నందుకు ఆర్‌ఎంఎం సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తాను రాజకీయాల్లోకి ప్రవేశించడం లేదంటూ రజనీకాంత్ గత నెల 29న ప్రకటించిన విషయం తెలిసిందే. 2016లో కిడ్నీ మార్పిడి చేయించుకున్న రజనీ తన ఆరోగ్య కారణాలు, కరోనా వైరస్ వ్యాప్తి తదితర కారణాలు చూపుతూ తాను రాజకీయాల్లోకి రావడం లేదంటూ చేసిన ప్రకటనల్లో ఆయన అభిమానుల్లో తీవ్ర నిరాశను నింపింది.

Rajinikanth appeals to fans on his Political entry

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News