Friday, April 26, 2024

హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Raju accused of murder commits suicide

స్టేషన్‌ఘన్‌పూర్ దగ్గరి నష్కల్ రైల్వేస్టేషన్
సమీపంలో రైలు పట్టాలపై గురువారం
ఉదయం ఆత్మహత్య, బందోబస్తు నడుమ పోస్టుమార్టం, వరంగల్‌లో అంత్యక్రియలు పూర్తి

మనతెలంగాణ/హైదరాబాద్ : సైదాబాద్ హత్యాచార ఘటన నిందితుడు రాజు స్టేషన్‌ఘన్‌పూర్ దగ్గరి నష్కల్ రైల్వే స్టేషన్ సమీపంలోని గురువారం ఉదయం రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కు పాల్పడిన రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ధృవీకరించారు. ఈ సందర్భంగా సంఘటన ప్రదేశాన్ని పరిశీలించిన సిపి తరుణ్ జోషి మీడియాతో మాట్లాడుతూ ఘట్‌కేసర్-, వరంగల్ మధ్య స్టేషన్ ఘన్‌పూర్ మండలం పామునూరు దగ్గర రాజారాం వంతెన రేల్వే ట్రాక్‌పై రాజు మృతదేహం లభ్యమైందన్నారు. మొహం గుర్తుపట్టలేనంతగా ఉందని, అయితే చేతిపై మౌనిక అనే టాటూ, మనిషి పొడుగు అన్నీ సరిపోయాయన్నారు. రాజు కుటుంబ సభ్యులు కూడా గుర్తించారన్నారు. ఇది ఖచ్చితంగా ఆత్మహత్యేనని సిపి స్పష్టం చేశారు. ఇక్కడికి ఎలా, ఎప్పుడు వచ్చాడు, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నది విచారణ జరుపుతున్నామన్నారు. ఇందులో భాగంగా సిసి కెమెరాలు పరిలీస్తామని చెప్పారు.

గురువారం ఉదయం 8:45 గంటలకు కోణార్క్ ఎక్స్‌ప్రెస్ కాజీపేట్ నుంచి సికింద్రాబాద్‌కు వస్తుందని అదే సమయంలో రాజు ట్రాక్‌పై నడుచుకుంటు వెళుతుండగా రైల్వే సిబ్బంది చూసి పట్టుకోడానికి ప్రయత్నించినా సాధ్యంకాలేదని, ట్రైన్ కింద పడి నిందితుడు రాజు చనిపోయాడని సిపి తరుణ్ జోషి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిందితుడు రాజు కోసం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో అతడి ఫోటోలు విస్తృతంగా ప్రచారం జరగడంతో ఆత్మహత్య చేసుకుంటాడనని పోలీసులు భావిస్తున్నారు. కాగా నిందితుడు రాజు ఆచూకీ కనిపెట్టేందుకు ఆటోలు, రైళ్లు, బస్సులు ఇలా ప్రతి చోట వెయ్యి మందికిపైగా పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఈ నెల 9న సైదారాబాద్‌లో చిన్నారిని చిదిమేసిన రాజు వారం రోజుల పాటు తప్పించుకొని తిరిగాడు. స్వయంగా డిజిపి మహేందర్‌రెడ్డి రంగంలోకి దిగి నేరుగా గాలింపు చర్యలు పర్యవేక్షించారు. ప్రధాన రహదారులు, వీధులతో పాటు కాలనీల్లోని దాదాపు 1000 సిసిటివి కెమెరాలను నిశితంగా పరిశీలించారు. జనసమర్థ ప్రాంతాల్లో ప్రజలకు రాజు చేసిన నేరం గురించి వివరిస్తూ ఆచూకీ చెప్పాలని పోలీసులు ప్రచారం చేసిన విషయం విదితమే.

డయల్ 100కి ఫోన్

హత్యాచార నిందితుడు రాజు మృతదేహాన్ని గురువారం ఉదయం 8:45 గంటల సమంలో రైల్వే కార్మికులు గుర్తించి రైల్వే ఉన్నతాధికారులకు కార్మికులు సమాచారం ఇచ్చారు. ఈక్రమంలో రైల్వే ఉన్నతాధికారులు డయల్ 100 ద్వారా వరంగల్ సిపికి సమాచారం అందించారు. దీంతో రాజు ఆత్మహత్యకు పాల్పడిన ప్రాంతాన్ని వరంగల్ సీపీ తరుణ్ జోషి పరిశీలించారు. ఎడమచేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా ఆత్మహత్యకు పాల్పడింది రాజేనని నిర్ధరించామని, రాజు స్టేషన్‌ఘన్‌పూర్‌కు ఎలా వచ్చాడో దర్యాప్తు చేస్తున్నట్లు సిపి వివరించారు.

భయంతోనే ఆత్మహత్య : సిపి అంజనీకుమార్

సైదాబాద్ చిన్నారి అత్యాచార కేసులో నిందితుడు రాజు భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ పేర్కొన్నారు. మృతుని చేతులపై మౌనిక అనే టాటూతో పాటు మరో చేతికి 5 స్టార్ మార్క్‌లు ఉన్నాయని నిందితుడి కుటుంబ సభ్యులు రాజు మృతదేహాన్ని గుర్తించారని పేర్కొన్నారు. గత 5,6 రోజులుగా రాజు కోసం రాష్ట్రమంతా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారని, పోలీసుల నుంచి తప్పించుకోలేనని నిందితుడి మైండ్‌లో పడిపోవడంతో పాటు భయం మొదలై రాజు ఆత్మ హత్య చేసుకున్నాడని సిపి వెల్లడించారు.

పోలీసులే చంపారు : మృతుని తల్లి,భార్య

ఆరేళ్ల చిన్నారి హత్యాచార కేసు నిందితుడు పులికొండ రాజు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియడంతో మృతుని తల్లి వీరమ్మ, భార్య మౌనికలు రాజును పోలీసులే చంపేశారంటూ అనుమానం వ్యక్తం చేశారు. తనకు, తన బిడ్డకు, అత్తకు న్యాయం చేయాలని రాజు భార్య మౌనిక వేడుకుంది. ఈ సందర్భంగా తల్లి వీరమ్మ, భార్య మౌనికలు మీడియాతో మాట్లాడుతూ మమ్మల్ని పోలీస్ స్టేషన్‌లో 10 రోజులు ఉంచారని, ఒకసారి రాజు దొరికాడని చెప్పారనిచ ఇంకోసారి దొరకలేదన్నారని తెలిపారు. ఈక్రమంలో బుధవారం నాడు తెల్ల పేపర్ మీద సంతకాలు పెట్టించుకున్నారని, సంతకాలు ఎందుకు సర్ అని అడిగితే ఊరికే అని చెప్పారని తెలిపారు. ఈక్రమంలో బుధవారం రాత్రి 10గంటల సమయంలో ఉప్పల్ దాకా తీసుకొచ్చి బస్ ఎక్కిచ్చి డబ్బులిచ్చి వీడియో కూడా తీశారన్నారు. పోలీసులే రాజును చంపేశారని అనుకుంటున్నామని ఇప్పుడు నా పాపతో నేను ఎలా బతకాలి, మమ్మల్ని చూసేవాళ్లు కూడా ఎవరూ లేరని, మాకు న్యాయం చేయాలని వారు వేడుకున్నారు.

ఎంజిఎంలో పోస్టుమార్టం

హత్యాచార కేసు నిందితుడు రాజు మృతదేహాన్ని గురువారం మధ్యాహ్నం రైల్వే సిఐ రామ్మూర్తి నేతృత్వంలో బందోబస్తు నడుమ ప్రత్యేక వాహనంలో పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజిఎం మార్చురీకి తరలించారు. రాజు మృతదేహానికి వైద్యులు శవ పరీక్షలు నిర్వహించి అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా రాజు కుటుంబ సభ్యులు, బంధువులకు పోలీసులు సమాచారమందించగా మృతదేహాన్ని చూసేందుకు వారు ఇష్టపడడం లేదని పోలీసులు వెల్లడించారు. మృతదేహం మార్చురీకి చేరుకోగానే పోలీసులు గేట్లను మూసివేశారు.

అంబులెన్స్‌పై చెప్పులు విసిరిన ప్రజలు

రైల్వే పట్టాలపై నుంచి రాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలిస్తున్న అంబులెన్స్‌పై కొందరు వ్యక్తులు చెప్పులు విసిరారు. సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం చేసిన రాజు చనిపోయినా, ప్రజల్లో అతడిపై నెలకొన్న తీవ్ర ఆగ్రహావేశాలు ఇంకా చల్లారలేదనడానికి చెప్పులు విసిరిన ఘటనే నిదర్శనం. ఓ వ్యక్తి విపరీతమైన ఆవేశంతో చెప్పు తీసుకుని అంబులెన్స్ ను కొడుతుండడం వీడియోలో కనిపించింది. కాగా మార్చురీకి చేరుకున్న వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు విసిరారు.

అంత్యక్రియలు పూర్తి

సింగరేణి చిన్నారి ఘటనలో నిందితుడైన రాజు అంత్యక్రియలు గురువారం రాత్రి పూర్తయ్యాయి. రాజు మృతదేహానికి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అయితే రాజు మృతదేహాన్ని స్వగ్రామానికి కాకుండా వరంగల్ నగరంలోని పోతన కాలనీ సమీపంలోని స్మశానంలో బంధువులు అంత్యక్రియలను పూర్తి చేశారు.

సింగరేణి కాలనీలో ఆందోళన

హత్యాచార కేసులో నిందితుడు రాజు మృతదేహాన్ని తమకు అప్పగించాలని మహిళా సంఘాలు నిరసనకు దిగాయి. సింగరేణికాలనీకి వచ్చి రాజు మృతదేహాన్ని చూపించాలంటూ డిమాండ్ చేశాయి. రెండు రోజుల క్రితం రాజును అరెస్ట్ చేసి తీసుకొస్తున్నామని అధికార పార్టీ నేతలు చెప్పారని, ఇప్పుడు రాజు ఆత్మహత్య చేసుకున్నారని చెప్తే ఎలా నమ్మాలని మహిళా సంఘాల నేతలు ప్రశ్నించారు. చిన్నారి తల్లిదండ్రులపై పోలీసులు వ్యవహరించిన తీరు దారణమన్నారు. రాజును చంపారో.. ఆత్మహత్య చేసుకున్నాడో.. సింగరేణి కాలనీకి మృతదేహాన్ని తీసుకొస్తే తాము గుర్తిస్తామని మహిళా సంఘాలు నేతలు పేర్కొన్నారు.

బాలిక కుటుంబానికి మంత్రుల పరామర్శ

సైదాబాద్ ఘటన బాధిత కుటుంబానికి తెలంగాణ హోంశాఖ మంత్రి మహమ్ముద్ అలీ, మంత్రి సత్యవతి రాథోడ్లు గురువారం రూ. 20 లక్షల చెక్కును ఇచ్చారు. అయితే, మంత్రులు ఇచ్చిన చెక్కును బాధిత కుటుంబం తిరస్కరించింది. ‘మాకు చెక్ వద్దు.. ఆ దుర్మార్గుడిని ఉరితీయాలని’ వేడుకున్నారు. మంత్రులు ఇచ్చిన చెక్కును మీడియా ముఖంగా తిరిగి ఇచ్చేస్తామని బాలిక తండ్రి తెలిపారు. దీనిపై చిన్నారి తండ్రి తాము చెక్ తీసుకోలేదు.. బల్లపై పేట్టేసి వెళ్లారని తెలిపారు. ఆ చెక్కు మాకోద్దు.. దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని కన్నీటి పర్యంతమయ్యారు. నిందితుడు చనిపోయాడని పోలీసులు చెబితే తాము నమ్మమని, మృతదేహాన్ని తమ ఇంటికి తీసుకురావాలని అన్నారు. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడింది అతనేనా? అనేది తాము గుర్తుపడతామని అన్నారు. బతికి ఉంటే చంపుతామనే భయంతో తీసుకురాకపోవచ్చు ఇప్పుడు ఎలాగూ చనిపోయాడు కాబట్టి ఆ బాడీని మా ముందుకు తీసుకువాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News