Friday, May 3, 2024

గుజరాత్‌లో 24 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం

- Advertisement -
- Advertisement -

24 new ministers sworn in in Gujarat

పటేల్ వర్గీయులు ఆరుగురికి అవకాశం
విజయ్‌రూపానీ మంత్రివర్గంలో ఏ ఒక్కరికీ దక్కని చోటు

గాంధీనగర్ : ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కొత్త మంత్రివర్గం గురువారం కొలువు తీరింది.గుజరాత్‌లో వచ్చే ఏడాది ఆఖరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెపి సరికొత్త ప్రయోగం నో రిపీట్ విధానాన్ని అవలంబించింది. దీనికి తగ్గట్టు కొత్త మంత్రి వర్గం లోకి అంతా కొత్తవారికే అవకాశం కల్పించింది. గతంలో విజయ్ రూపాణి కేబినెట్‌లో పనిచేసిన ఎవరికీ కూడా తాజా మంత్రివర్గంలో చోటు కల్పించక పోవడం గమనార్హం. గాంధీనగర్ లోని రాజ్‌భవన్‌లో గురువారం మధ్యాహ్నం 1.30 కు మొత్తం 24 మంది కొత్త మంత్రులచే గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణస్వీకారం చేయించారు. వీరిలో 10 మంది కేబినెట్ మంత్రులు కాగా, 14 మంది సహాయ /స్వతంత్ర మంత్రులు.అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేదిని మంత్రివర్గం లోకి తీసుకున్నారు.

ప్రమాణ స్వీకారానికి కొద్ది గంటల ముందు రాజేంద్ర త్రివేది తన సభాపతి పదవికి రాజీనామా చేశారు. ఇక నేడు ప్రమాణస్వీకారం చేసిన వారిలో 21 మంది తొలిసారిగా మంత్రులు కావడం విశేషం. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన భూపేంద్ర పటేల్ కూడా తొలిసారి ఎమ్‌ఎల్‌ఎనే. ఒక్క రాజేంద్ర త్రివేది, రాఘవ్‌జీ పటేల్, కిరీట్‌సిన్హ్ రాణాకు గతంలో మంత్రి పదవి చేపట్టిన అనుభవం ఉంది. కొత్త మంత్రుల్లో గజేంద్ర సిన్హ్ సర్కార్, రాఘవ్‌జీ మక్వానా, వినోదీ మొరాడియా, దేవభాయ్ మాలం, వార్ష్ సంఘ్వీ, ముఖేశ్ పటేల్, నిమిష సుతార్, అర్వింద్ రాజ్యాని, కుబేర్ దిన్‌దాస్, కీర్తిసిన్హ్ వాఘేలా, జగ్దీశ్ పంచాల్, బ్రిజేశ్ మెర్జా, జితూ చౌదరి, మనీశ వకీల్, కానూభాయ్ దేశాయ్, కీర్తిసిన్హ్ రాణా, నరేశ్ పటేల్, ప్రదీప్ సిన్హ్ పర్కార్, అర్జున్ సిన్హ్ చౌహాన్, రాజేంద్ర త్రివేది, జితూ వాఘానీ, రిషీకేశ్ పటేల్, రాఘన్జీ పటేల్, పూర్ణేశ్ మోదీ ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులకు గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అభినందనలు తెలిపారు.

కేంద్ర మంత్రులు, బిజెపి నేతలు శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్ మార్క్ పాలనను కొనసాగించాలని ఆకాంక్షించారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ పరిణామాలు అనేక ఊహాగానాలకు దారి తీశాయి. పటేల్ వర్గీయుల మద్దతు కోసమే బిజెపి అధిష్ఠానం ముఖ్యమంత్రి మార్పు చేపట్టినట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారి ఎమ్‌ఎల్‌ఎ అయిన భూపేంద్ర పటేల్ (పాటిదార్ వర్గీయుడు)కు రాష్ట్ర పగ్గాలు అప్పగించడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చినట్టయింది. మరో వైపు కొత్త మంత్రి వర్గం లోనూ పటేల్ వర్గీయులకు అధిక ప్రాధాన్యం కల్పించడం విశేషం. కొత్త మంత్రివర్గంలో ఆరుగురు పటేల్ వర్గీయులకు చోటు కల్పించారు. ఒబిసిలకు చెందిన వారు ఇద్దరు, షెడ్యూల్డు తెగలకు చెందిన వారు నలుగురు, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు ముగ్గురు, బ్రాహ్మణ , క్షత్రియ వర్గాలకు చెందిన వారు ఇద్దరేసి వంతున, జైను లొకరికి మంత్రి వర్గంలో అవకాశం ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News