Monday, April 29, 2024

సంపాదకీయం: సహకార బ్యాంకుల సంస్కరణ

- Advertisement -
- Advertisement -

RBI control cooperative Banks ప్రైవేటైజేషన్ ఊపు, ఉరవడిలో ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్న కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఎప్పుడు ఏ చర్య తీసుకున్నా అక్కడికే వెళ్తుందనే అనుమానం పీడించటం సహజం. దేశం కరోనా కోరల్లో చిక్కుకొని ప్రాణాలు అరచేత పట్టుకున్న సమయంలో కూడా ప్రధాని మోడీ ప్రభుత్వ సంస్కరణల వడి, వాడి అపూర్వ స్థాయిలో పదునెక్కాయి. పంజాబ్, మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు (పిఎమ్‌సి) కుంభకోణానికి బలైపోయిన దాని డిపాజిటర్ల దీనావస్థను చూసిన తర్వాత ఈ ఏడాది బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్ తీసుకున్న నిర్ణయం మేరకు అర్బన్, మల్టీస్టేట్ సహకార బ్యాంకులను రిజర్వు బ్యాంకు అదుపులో ఉంచుతూ కేంద్ర మంత్రివర్గం బుధవారం నాడు ఆమోదించిన ఆర్డినెన్స్ వాటిని క్రమశిక్షణలో పెట్టి డిపాజిటర్లకు కొంతైనా మేలు చేస్తుందనడానికి సందేహించనక్కరలేదు. దేశవ్యాప్తంగా ఇటువంటి బ్యాంకులు 1540 ఉన్నాయి. వీటికి 8 కోట్ల 60లక్షల మంది డిపాజిటర్లు ఉన్నారు. వారు పొదుపు చేసుకున్న సొమ్ము రూ.4లక్షల 84వేల కోట్లు. ఇంత భారీ విత్తం ఉన్న ఈ బ్యాంకుల డిపాజిటర్ల గురించి కేంద్రప్రభుత్వం గానీ, ఆర్‌బిఐ గానీ ఇంతవరకు తగిన రీతిలో పట్టించుకోకపోవడమే విషాదం.

అయితే, పిఎమ్‌సి, చార్మినార్ వంటి సహకార బ్యాంకులు డిపాజిటర్లకు టోపీ పెట్టినా మిగతా కొన్ని బ్యాంకులు ఇంకా బాగానే నడుస్తున్నాయి. గతంలో సికింద్రాబాద్ కేంద్రంగా నడిచి మంచి సేవలందించిన ఫ్రుడెన్షియల్ కో ఆపరేటివ్ బ్యాంకు ఆ తర్వాత రుణ గ్రహీతల ఎగనామాలకు గురై మూతపడిన సంగతి తెలిసిందే. లోకల్ ఏరియా బ్యాంకుల కింద నడుస్తున్న కొన్ని మాత్రం పటిష్ఠంగా ఉన్న మాట కూడా వాస్తవమే. ఇంత భారీ మొత్తం పొదుపు సొమ్ము గల అర్బన్, మల్టీస్టేట్ బ్యాంకుల పర్యవేక్షణ బాధతను కేంద్ర బ్యాంకుకు అప్పగించటం వల్ల ఎవరికి ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందో చూడాలి. ఇక నుంచి ఈ సహకార బ్యాంకులు మిగతా షెడూల్డు బ్యాంకులకు ఉన్న నిబంధనలననుసరించి నడవాల్సి ఉంటుంది. వీటిని నడిపించే అత్యున్నత స్థాయి అధికారులను కూడా ఆర్‌బిఐ నియమిస్తుంది. వీటి బోర్డులు రద్దవుతాయి.

మొన్నటి బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ బ్యాంకుల డిపాజిటర్ల ఖాతాల్లోని 5లక్షలకు మించని సొమ్ముకు భద్రత ఉంటుంది. అంతకుముందు రూ.లక్షకే పరిమితమై ఉండేది. ఇటీవల దివాళా తీసిన యస్ బ్యాంకు వాణిజ్య బ్యాంకు కావడం వల్ల ఆర్‌బిఐ దానికి తిరిగి భారీ స్థాయిలో ద్రవ్యత కల్పించి ఆదుకున్నది. పిఎమ్‌సి సహకార బ్యాంకు అయినందున అటువంటి అండ లభించలేదు. అందులో భారీ మొత్తాలు దాచుకున్న డిపాజిటర్లు నిలువునా మునిగిపోయారు. ముంబైకి చెందిన ఓ డిపాజిటరు ఆస్తి అమ్మగా వచ్చిన రూ.50లక్షలు పిఎమ్‌సిలో ఉంచి దారుణంగా మోసపోయాడు. దేశంలో సహకారోద్యమం వెలుగు చీకట్లు తెలిసినవే. గ్రామీణ వ్యవసాయ రంగం నుంచి పట్టణ వ్యాపారస్థుల వరకు వివిధ వర్గాలకు ఎంతో దన్నుగా నిలిచిన ఈ బ్యాంకులు కేవలం పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్న వారి ఎగవేతల వల్ల, రాజకీయ నేతల శల్యసారథ్యం వల్ల నాశనమైపోయాయి. నమ్మకాన్ని కోల్పోయాయి.

2001–02లో సంభవించిన మాధవపుర సహకార బ్యాంకు కుంభకోణంతో వీటి పతనం మొదలైంది. మార్కెట్ వాటా 6.4శాతం నుంచి క్రమక్రమంగా సన్నగిల్లిపోయి 2017 నాటికి సగానికి పడిపోయింది. దాంతో ఆర్‌బిఐ నియమించిన ఆర్.గాంధీ కమిటి ఈ బ్యాంకులపై మరిన్ని అధికారాలను, అదుపును పొందడానికి చట్టాన్ని సవరించాలని సూచించింది. పంజాబ్, మహారాష్ట్ర సహకార బ్యాంకు యాజమాన్యం రుణాలిచ్చిన సొమ్ములో 70శాతం హెచ్‌డిఐఎల్ గ్రూపు అనే ఒకే కంపెనీకి చెందిన సంస్థలకు లభించింది.. ఆ రుణాల వివరాలను దాచిపెట్టారు. చివరికి దివాళా స్థితికి చేరుకున్నప్పుడు ఆర్‌బిఐ కళ్లు తెరిచింది. షెడ్యూల్డు బ్యాంకులు కూడా భారీ బడా మోసగాళ్ళ వలలో చిక్కుకొని విలవిలలాడుతున్న దేశంలో ఇప్పుడు ఆర్‌బిఐ అదుపులోకి పోతున్న ఈ బ్యాంకుల భవిష్యత్తు అయోమయంలో పడితే ఆశ్చర్యపోనక్కర్లేదు.

మేనేజర్ల కుమ్మక్కులకు మరింత పటిష్ఠమైన విరుగుడు వ్యవస్థ కావాలి. అత్యున్నతస్థాయి అధికారులు సైతం లాలూచీకి దిగితే దిక్కేమిటి? ఐసిఐసిఐ బ్యాంకులో జరిగింది కళ్ల ముందరి కఠోర వాస్తవమే. చేను మేస్తున్న కంచెలను గట్టిగా కట్టడి చేస్తే గాని బ్యాంకుల కుంభకోణాలకు తెరపడదు. ఇంతవరకు ఈ బడాబాబులకు కఠిన శిక్షలు పడిన సందర్భం లేకపోవడమే మన వ్యవస్థ బలహీనతకు నిదర్శనం. ఎల్‌ఐసి వంటి కంటికిరెప్పల సొమును కూడా ఇటువంటి బ్యాంకుల పునరుద్ధరణకు ఉపయోగించాల్సి రావడం అత్యంత ఆందోళనకరం. ప్రస్తుతం ఆర్‌బిఐ అదుపులోకి పోతున్న అర్బన్, మల్టీస్టేట్ సహకార బ్యాంకులు అంతిమంగా బలీయమైన కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోరాదని కోరుకుందాం. అవినీతి మూలాలు బాగా దిగబడి ఉన్న దేశంలో ఏది జరిగినా ఆశ్చర్యపోలేం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News