Monday, April 29, 2024

వాట్సప్ మెసేజ్ పంపండి.. మీ సమస్యలు పరిష్కరిస్తాం

- Advertisement -
- Advertisement -

Revenue officials are tackling issues as WhatsApp platform

 మండలాల వారీగా వాట్సప్ గ్రూపులు అందుబాటులోకి
స్వయంగా పర్యవేక్షిస్తున్న తహసీల్దార్లు
ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి కృషి

హైదరాబాద్ : కరోనా కట్టడిలో భాగంగా రెవెన్యూ సిబ్బంది వినూత్న పద్ధతిలో ప్రజలకు సేవలందిస్తున్నారు. ప్రజలు కార్యాలయాలకు రాకుండానే వారి సమస్యలను ఆన్‌లైన్ వేదికగా పరిష్కరించడానికి రెవెన్యూ శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే సందర్శకుల సంఖ్యను తగ్గించే ప్రయత్నంలో రెవెన్యూ అధికారులు సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. ఇప్పటికే పలు రెవెన్యూ కార్యాలయాల్లో ఫిర్యాదుల పెట్టెను ప్రారంభించిన రెవెన్యూ అధికారులు, సోషల్‌మీడియా వేదికగా ప్రజలకు చేరువ కావడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే వాట్సప్ మెసేజ్ పంపండి….మీ సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు మంచిర్యాల జిల్లా మందమర్రి రెవెన్యూ అధికారులు.

ప్రతిరోజు రెవెన్యూ కార్యాలయానికి 150 పైగా ఫిర్యాదులు

వీరి కోవలోనే మరికొన్ని జిల్లాల రెవెన్యూ అధికారులు వాటప్స్ వేదికగా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. నిత్యం మండల రెవెన్యూ కార్యాలయానికి 150 పైగా ఫిర్యాదుదారులు వస్తుంటారు. ఇప్పటికే మీ సేవా ద్వారా ఈ పాలనా సౌలభ్యం ఉన్నప్పటికీ కొందరు నేరుగా తహశీల్దార్ కార్యాలయాలను ఆశ్రయిస్తుంటారు. అయితే, ఇక మీదట నేరుగా రావాల్సిన అవసరం లేకుండానే ఫిర్యాదుల బాక్స్‌ల ఏర్పాటుతో పాటు, వాటప్స్, సోషల్‌మీడియాను వేదికగా ప్రజల సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆఫీసును అందుబాటులోకి తీసుకురావడం, రానున్న రోజుల్లో ప్రజలతో నేరుగా కలవాల్సిన అవసరం లేకుండా ఈ సరికొత్త ఆలోచనలకు రెవెన్యూ అధికారులు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చాలా జిల్లాల్లోని ఆయా మండల రెవెన్యూ కార్యాలయ పరిధిలో వాట్సప్ గ్రూపులను అందుబాటులోకి తీసుకొచ్చి ఆ నెంబర్ ప్రజల్లోకి తీసుకెళ్లేలా తహసీల్దార్‌లు చర్యలు చేపట్టారు.

వైరస్ నిర్మూలనకు తమవంతు కృషి

ఈ నేపథ్యంలో ప్రజలు సైతం తమ సమస్యలను వాట్సప్ ద్వారా తహసీల్దార్‌లకు విన్నవించుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఇలాంటి చర్యలు చేపట్టి వైరస్ నిర్మూలనకు తమవంతు కృషి చేస్తున్నారని స్థానికులు ప్రశంసిస్తున్నారు. రెవెన్యూ కార్యాలయాలకు ప్రజలు రాకుండానే వారి సమస్యలు పరిష్కారం కావాలని రెవెన్యూ అధికారులు చేపట్టిన నూతన సంస్కరణలు రానున్న రోజుల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయో వేచి చూడాల్సిందేనని పలువురు పేర్కొంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News