Saturday, December 9, 2023

ప్రాణాలు తీస్తున్న మందుబాబులు

- Advertisement -
- Advertisement -
Road accidents involving vehicles intoxicated with alcohol
వేగంగా డ్రైవ్ చేయడంతో రోడ్డు ప్రమాదాలు
ఈ ఏడాది రూ. 10,49,61,000 జరిమానా
25,453మందిపై కేసులు నమోదు
నిందితుల్లో బడాబాబుల పిల్లలు
హత్య కేసులు నమోదు చేస్తున్న పోలీసులు

హైదరాబాద్: మద్యం మత్తులో వాహనాలు నపడిపి రోడ్డు ప్రమాదాలు చేయడంతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని నిబంధనలు ఉన్నా కూడా పట్టించుకోకపోవడంతో చాలామంది ప్రాణాలు పోతున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠినంగా వ్యవహరిస్తున్నా కూడా మందుబాబుల్లో మార్పు రావడంలేదు. ఇలా మద్యం తాగి వాహనాలు నడుపుతు ప్రాణాలు తీస్తున్నవారిలో చదువుకున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. నిబంధనలు అన్ని తెలిసినాన కూడా తమకు ఏమి కాదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కొందరు రాత్రి సమయంలో మద్యం తాగి వాహనాలు నడిపితే, కొందరు పట్టపగలు తాగి వాహనాలు నడుపుతున్నారు. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పబ్బులు ఎక్కువగా ఉండడంతో విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నారు. తెల్లవారుజాము వరకు మద్యం తాగి వాహనాలను అతివేగంగా నడపడంతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.

మద్యం మత్తులో వాహనాలను విచక్షణ రహితంగా వాహనాలను నడిపి, అదుపు తప్పడంతో ప్రాణాలు పోతున్నాయి. ఇలా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చాలామంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఉప్పల్‌కు చెందిన రోహిత్ గౌడ్, స్నేహితుడు సాయిసుమన్‌తో కలిసి సాయంత్రం 6గంటల నుంచి మద్యం తాగి రాత్రి 1.30 సమయంలో విధులు ముగించుకుని వెళ్తున్న ఇద్దరు అమాయకులను ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు కారులో వేగంగా వెళ్తుండగా అయోధ్యరాయ్, దేబేంద్రకుమార్‌ను ఢీకొట్టాడు. రోయిన్‌బో ఆస్పత్రిలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న ఇద్దరు ఒక్కసారిగా ఎగిరి రోడ్డుపై పడడంతో అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు విచారణ చేయగా మూడు ప్రాంతాల్లో మద్యం తాగినట్లు తేలింది. గతంలో నారయణ కాలేజీల యజమాని కుమారుడు మద్యం తాగి వేగంగా కారు నడపడంతో మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టాడు.

దీంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు డాక్టర్లు నిఖిల్ కుమార్ రెడ్డి, అఖిల్ రామకృష్ణ, తరుణ్ కారు డ్రైవ్ చేయడంతో రోడ్డుపై నడిచి వెళ్తున్న నలుగురు కూలీలను ఢీకొట్టారు. ఇన్‌ఆర్బిట్ మాల్ వద్ద జరిగిన ఈ సంఘటనలో నలుగురు అమాయకులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి, వైద్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని పరీక్ష చేయగా 116 ఎంజి వచ్చింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు మద్యం తాగి ఆడికారు వేగంగా నడిపి ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఆటో వెళ్తున్న వ్యక్తి మృతిచెందాడు. ఈ కేసులో యువకుడిని తప్పించేందుకు అతడి తండ్రి తీవ్రంగా ప్రయత్నం చేశాడు. తన వద్ద పనిచేస్తున్న డ్రైవర్‌ను నేరం ఒప్పుకునేలా ఒప్పందం చేసుకున్నాడు. కాని పోలీసులు సిసిటివి ఫుటేజ్‌ను బయటపెట్టడంతో బడాబాబు కుమారుడు కటకటాలకు వెళ్లాల్సి వచ్చింది. కెనడా నుంచి వచ్చిన యువతి స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లి పబ్బులో మద్యం తాగారు, అందులో కారు నడుపుతున్న యువకుడు పీకలదాకా మద్యం తాగడంతో మైహోం వద్ద కారు అదుపు తప్పి భవనాన్ని ఢీకొట్టడంతో యువతి మృతిచెందింది.

మద్యం మత్తులో బైక్‌ను నడపడంతో దుర్గం చెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. మద్యం తాగి వాహనం నడపడంతో ముగ్గురు మృతిచెందిన సంఘటన హైదరాబాద్ యూనివర్సిటీ వద్ద చోటుచేసుకుంది. ఇద్దరు యువతులు ఎం. మానస, ఎన్. మానస జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్నారు. అర్ధరాత్రి వరకు ప్రైవేట్ బ్యాంక్ రికవరీ ఏజెంట్ అబ్దుల్ రహీంతో కలిసి మద్యం తాగారు, జాలీ రైడ్‌కు వెళ్లారు. కారులో వేగంగా వెళ్లడంతో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. దీంతో ఇద్దరు యువతులు, కారు డ్రైవ్ చేసిన రహీం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మద్యం తాగిన యువకులు ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ ఉన్నా కూడా ముందుకు వెళ్లడంతో టిప్పర్ ఢీకొట్టింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు సిసిటివి ఫుటేజ్ పరిశీలించగా వారు ఆగిన చోట మద్యం బాటిళ్లు లభించాయి.

తప్పించేందుకు తల్లిదండ్రుల యత్నం…

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో నిందితులుగా బడాబాబుల పిల్లలు ఉంటున్నారు. వారిని రక్షించేందుకు డబ్బులు వెదజల్లి తల్లిదండ్రులు రంగంలోకి దిగుతున్నారు. రోహిత్ గౌడ్ తండ్రి పెద్ద రియల్టర్ కావడంలో ఏకంగా ఓ ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు తెలిసింది. ఎలాగైన తన పిల్లలను తప్పించేందుకు వీరు వెనుకముందు చూడడంలేదు. తన వద్ద పనిచేస్తున్న కారు డ్రైవర్లను నేరం చేసినట్లు ఒప్పుకోవాలని, జైలుకు వెళ్తే కుటుంబాన్ని తాము చూసుకుంటామని ఒప్పందం చేసుకుంటున్నారు. ఇలాంటి కేసుల్లో రోడ్డు ప్రమాదాలు జరిగన సిసిటివి ఫుటేజ్‌లను పోలీసులు విడుదల చేయడంలేదు. బడాబాబుల పిల్లలు చేసిన రోడ్డు ప్రమాదాల సిసిటివి ఫుటేజ్ బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు పోలీసులు సిసిటివి ఫుటేజ్‌ను విడుదల చేయడంలేదు.

భారీగా జరిమానా…

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 25,453మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారికి రూ.10,49,61,000 జరిమానా విధించారు. మందుబాబులు 10,109మందిపై కోర్టులో ఛార్జిషీట్ వేశారు, 206మందికి జైలు శిక్షపడగా, 25మంది లైసెన్స్‌లు ఆర్టిఏ అధికారులు రద్దు చేశారు. నగరంలోని పోలీసులు విస్కృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. 2020లో 6,588 కేసులు నమోదు చేయగా ఈ ఏడాధి భారీగా పెరిగాయి.
ఒక వ్యక్తి మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ మూడు సార్లు పట్టుబడితే వారి లైసెన్స్ రద్దు చేస్తున్నారు. అయినా కూడా మద్యం ప్రియులు ఏమాత్రం మారడంలేదు.

రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా…

మద్యం తాగి వాహనాలు నడపడంతో నియంత్రణ కోల్పోయి చాలా మంది మరణించడానికి కారణం అవుతున్నారు. మధ్యాహ్నం మద్యం తాగా కారును అతివేగంగా నడపడంతో చిన్నారి రమ్య మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో నగర ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగా వాహనాలు నడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించడం ప్రారంభించారు. రాత్రి సమయంలోనే కాకుండా మధ్యాహ్నం కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలు చేయడంతో చాలా మంది జీవితాలు, కుటుంబాలను కోల్పోయాయి. చేయని తప్పుకు వారి శిక్ష అనుభవిస్తున్నారు. పోలీసులు నగరంలో రోడ్ల మీద మద్యం తాగి డ్రైవింగ్ చేయడం నేరమని ప్రకటనలు ఇస్తున్నారు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి చాలా ప్రత్నాలు చేస్తున్నారు.

కౌన్సెలింగ్ ఇచ్చినా మారడంలేదు…

మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ వారికి పోలీసులు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వారిలో మార్పు తీసుకురావడానికి మద్యం తాగి వాహనాలు నడిపితే జరిగే పరిణామాలను వీడియోలు చూపిస్తున్నారు. వారి తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల్లో ఒకరి సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. నగరంలో బేగంపేట, గోషామహల్‌లో కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అయినా కూడా వారిలో మార్పు రావడంలేదు. ఇటీవల సైబరాబాద్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఓ సీరియల్ నటుడు పట్టుబడ్డాడు. తన కెరీర్ నశనం అవుతుందని, అవకాశాలు రావని ఎంతగా మొత్తుకున్న పోలీసులు వినకుండా కేసు నమోదు చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయవద్దని, డ్రైవర్లను నియమించుకోవాలని పోలీసులు చెబుతున్నా వినడ కుండా వాహనాలను నడుపుతూ పోలీసులకు పట్టుబడుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు హత్యకేసులు నమోదు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News