Wednesday, May 1, 2024

సిలబస్‌పై వారంలో స్పష్టత

- Advertisement -
- Advertisement -

9, ఆ పై తరగతులకు ప్రత్యక్ష బోధన
డిజి, పిజి విద్యార్థులందరికీ ఆఫ్‌లైన్ క్లాసులు
ఇంటర్ పరీక్షలు, సిలబస్‌పై వారంలో స్పష్టత
విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి
ప్రారంభంపై ప్రైవేట్ యాజమాన్యాలతో సమావేశం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాల స్థాయిలో 9,10 తరగతులతో పాటు ఇంటర్మీడియేట్, డిగ్రీ, పిజి కోర్సుల విద్యార్థులందరికీ ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలకు అనుగుణంగా కొవిడ్ నిబంధనలకు లోబడి తరగతులు కొనసాగుతాయని అన్నారు. ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పిజి, ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు, పేరెంట్స్ కమిటీ ప్రతినిధులతో మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యాజమాన్యాలకు పలు సూచనలు చేశారు. పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతినిధులతో చర్చించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్రా రామచంద్రన్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తరగతుల నిర్వహణకు సంబంధించి ప్రతి విద్యాసంస్థ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని అన్నారు. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల విద్యా సంవత్సరాన్ని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాబోధన చేయాలని అన్నారు. విద్యాసంస్థల పునఃప్రారంభంపై ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు.

ఈ అంశంపై రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల ప్రతినిధులతో చర్చించామని చెప్పారు. కొవిడ్‌పై అవగాహన కల్పిస్తూనే విద్యార్థుల ఆరోగ్యంపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతినిధులను కోరామన్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారని మంత్రి పేర్కొన్నారు. పాఠశాలలకు సంబంధించి పలు సమస్యలను ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని, ప్రభుత్వం తరఫున సాధ్యమైనంతవరకు వారి సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులు పాఠశాలలకు హాజరుకావాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. విద్యార్థులు తప్పనిసరిగా పాఠశాలలకు హాజరు కావాలని ఒత్తిడి చేయడం లేదని, విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి పత్రం ఉంటేనే ప్రత్యక్ష తరగతులకు అనుమతిస్తామని పేరెంట్స్ కమిటీకి తెలిపారు. పాఠశాలలకు వెళ్లని విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు వినేలా ఏర్పాట్లు చేయాలని పాఠశాలల యాజమాన్యాలకు సూచించామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
వారంలో ఇంటర్ సిలబస్, పరీక్షల తేదీలపై స్పష్టత
ఇంటర్మీడియేట్ పరీక్షలకు సంబంధించిన సిలబస్, పరీక్షల తేదీలు, ప్రాక్టికల్స్ విషయంలో వారం రోజుల్లో స్పష్టత ఇస్తామని మంత్రి తెలిపారు. జాతీయ స్థాయిలో జరిగే ప్రవేశ పరీక్షల సిలబస్‌కు అనుగుణంగా ఎంసెట్ ఎంసెట్ షెడ్యూల్, సిలబస్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అత్యుత్తమ విద్యను అందించే ప్రక్రియలో ప్రైవేట్ భాగస్వామ్యం తప్పనిసరి అని, అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తూ తరగతులను నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం భవిష్యత్తులో రూపొందించే విధానాల రూపకల్పనలో ప్రైవేట్ విద్యాసంస్థలను కూడా భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు 6, 7, 8 తరగతుల కూడా ప్రారంభించాలని కోరారని, దీని మీద ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి పరిష్కరిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.
మంత్రి దృష్టికి ప్రైవేట్ యాజమాన్యాల సమస్యలు
ప్రైవేట్ యాజమాన్యాల ప్రతినిధులు తమ సమస్యలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. చర్చలో భాగంగా 14 డిమాండ్లను పరిష్కరించాలని పాఠశాలల ప్రతినిధులు మంత్రిని కోరినట్లు తెలిసింది. అంచెలంచెలుగా అన్ని తరగతులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దాదాపు ఏడాదిగా ఫీజులు లేనందున పాఠశాలలు నిర్వహణ కష్టతరంగా మారిందని యాజమాన్యాలు మంత్రికి తెలిపారు. జూన్ వరకు విద్యా సంవత్సరం నిర్వహించాలని, కనీస హాజరు ఉండేలా నిబంధన పెట్టాలని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది.

Sabitha Reddy meeting with Private Colleges Owners

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News