Sunday, April 28, 2024

సాయిబాబా విడుదలపై స్టే ఇవ్వలేం: సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో యుఎపిఎ చట్టం కింద యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తూ ఇటీవలే నిర్దోషిగా విడుదలైన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా, మరో ఐదుగురి విడుదలపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. సాయిబాబా, మరో ఐదుగురిని నిర్దోషులుగా పేర్కొంటూ బాంబే హైకోర్టుకు చెందిన నాగపూర్ బెంచ్ ఇటీవల ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తాము దాఖలు చేసిన పిటిషన్‌ను త్వరితంగా విచారించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వం మౌఖిక అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

నిర్దోషులుగా పేర్కొంటూ ఇచ్చిన తీర్పును మార్చాలని కోరడానికి అత్యవసరం లేదని, అదే తీర్పు వేరేగా ఉంటే దాన్ని పరిశీలించే వారమని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం తెలిపింది. నాగపూర్ బెంచ్ ఇచ్చిన తీర్పు చాలా సహేతుకంగా ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆరుగురు నిందితులను రెండు వేర్వేరు ధర్మాసనలు రెండు సార్లు నిర్దోషులుగా నిర్ధారించాయని సుప్రీంకోర్టు తెలిపింది.

సాయిబాబాను యుఎపిఎ కింద ప్రాసిక్యూట్ చేసేందుకు చట్టబద్ధమైన అనుమతి పొందలేదని 2022లో బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. గతవారం నాగపూర్ బెంచ్ కూడా సాయిబాబా, ఇతరులకు మావోయిస్టులతో ఆధారాలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్న నాగపూర్ బెంచ్ మహారాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులపై కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. నిందితులపై నమోదు చేసిన కేసులను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని బాంబే హైకోర్టుకు చెందిన నాగపూర్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ కేసును సుప్రీంకోర్టు ప్రస్తావిస్తూ సాయిబాబాను అరెస్టు చేసి 2014లో నాగపూర్ సెంట్రల్ జైలులో ఉంచిన తర్వాత ఆయనను నిర్దోషిగా బాంబే హైకోర్టు నిర్ధారించిందని పేర్కొంది. సాయిబాబా నర్దోషిత్వాన్ని కష్టపడి సాధించుకున్నదిగా జస్టిస్ మెహతా అభివర్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News