Sunday, May 5, 2024

వలస కార్మికుల జాబితా?

- Advertisement -
- Advertisement -

SC is angry at central govt for not yet preparing list of Migrant Workers

 

వలస కార్మికుల జాతీయ జాబితాను ఇంకా సిద్ధం చేయనందుకు కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహించడాన్ని హర్షించకుండా ఉండలేం. జాతీయ స్థాయి అవ్యవస్థీకృతరంగ కార్మికుల వివరాలతో కూడిన జాబితా తయారు చేయాల్సిందిగా 2018లోనే ఆదేశించగా ఇంత వరకు ఏమి చేస్తున్నారని ప్రభుత్వాన్ని న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఎంఆర్ షాల సుప్రీం ధర్మాసనం సోమవారం నాడు నిలదీసింది. గత ఏడాది మార్చి చివరి వారం లో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం సందు సమయం ఇవ్వకుండా ప్రధాని నరేంద్ర మోడీ దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రకటించారు. దానితో నగరాలు, పట్టణాల్లోని పని స్థలాలు మూతపడిపోయి దిక్కుతోచని స్థితిని ఎదుర్కొన్న లక్షలాది మంది కార్మికులు పొట్ట చేతపట్టుకొని పిల్లా జెల్లాతో రోడ్లు నెత్తురోడేలా వందల కిలోమీటర్ల దూరంలోని స్వస్థలాలకు పాదయాత్రగా వెళ్లిన దృశ్యాలు గుండె తరుక్కు పోయేలా చేశాయి. కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడంతో వారిని ఆదుకోలేకపోయిన నిస్సహాయతకు జాతి తలవంచుకోవలసి వచ్చింది.

సరిగ్గా ఏడాది గడిచిన తర్వాత ఇప్పుడు, అప్పటి కంటే అనేక రెట్లు క్రూరంగా కరోనా సెకండ్ వేవ్ విరుచుకు పడి ఎక్కడికక్కడ స్థానిక లాక్‌డౌన్లకు తెర లేపింది. దీనితో దేశమంతటా ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. వలస కార్మికులు మళ్లీ దయనీయ స్థితిలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఆ మహా నగరాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల పరిస్థితిని సుప్రీం ధర్మాసనం స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించింది. ఎటువంటి ఆధార పత్రాలులేని అసంఘటిత రంగంలోని వలస కార్మికులకు సహాయపడడానికి తోడ్పడే జాతీయ జాబితాను గురించి కేంద్రాన్ని ప్రశ్నించింది. గత ఏడాది లాక్‌డౌన్ వల్ల స్వస్థలాలకు తిరుగు వలసలు కట్టిన కార్మికులు దేశ విభజన నాటి మహా జన యాత్ర తర్వాత సంభవించిన రెండవ ప్రజా ప్రస్థానంగా రూపు కట్టారని నిపుణులు భావించారు. దేశ విభజన సమయంలో కోటి 40 లక్షల మంది ఉన్న చోట ఉనికి కోల్పోయి తరలిపోగా, గత ఏడాది లాక్‌డౌన్ వల్ల ఆరు రాష్ట్రాల్లోని 116 జిల్లాలకు చెందిన 67 లక్షల మంది స్వస్థలాలకు వెళ్లారని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ నిర్ధారించింది. అయితే వీరు ఆరు కోట్ల మంది వరకు ఉంటారని స్వతంత్ర గణాంకాలు చెబుతున్నాయి.

వీరి స్వస్థల యాత్ర ఎంతటి హృదయ విదారకమైనదంటే రైళ్లు, బస్సులు, లారీలు కూడా బందై కాలి నడక తప్ప వేరే మార్గం లేకపోయింది. రేషన్ కార్డుల వంటి ఆధార పత్రాలు కొరవడడంతో ప్రభుత్వాలిచ్చిన అరకొర ఆహార ధాన్యాలకూ అర్హులు కాలేదు. దారిలో మనసున్న దాతలు చేసిన సాయం మినహా బతకడానికి మరో దారి కనిపించలేదు. ఆకస్మిక రోగాలకు అనేక మంది మార్గ మధ్యంలోనే కన్ను మూశారు. స్వస్థలాలకు వెళ్లిన తర్వాత అక్కడ కూడా పనులు దొరకలేదు. ఐసిఆర్‌ఐఇఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్), ఐఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్ (ఇన్‌ఫెరిన్సియల్ సర్వే స్టాటిస్టిక్స్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్) కలిసి ఇటీవల జరిపిన ఒక సర్వే ప్రకారం గత ఏడాది లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకు వెళ్లిపోయిన వలస కార్మికుల్లో 38.6 శాతం మందికి అక్కడ కూడా పనులు దొరక లేదు. వారి గృహ ఆదాయాలు 85 శాతం మేరకు పడిపోయాయి. ఆ విధంగా వారి బతుకులు ముందు చూస్తే సింహం వెనుక చూస్తే పులి అన్నట్టు తయారయ్యాయి.

దీనితో వలస కార్మికుల సమస్య సరికొత్త తరణోపాయాల ఆవశ్యకతను ముందుకు తెచ్చింది. స్థూల దేశీయోత్పత్తిలో పది శాతం, వలస కార్మికుల శ్రమ నుంచే సంక్రమిస్తున్నది. అయితే వీరిని ఎలా, ఎక్కడ నుంచి పనుల్లోకి తీసుకుంటున్నారు, వీరు ఎక్కడ ఉంటారు అనే వివరాలు ప్రభుత్వాల వద్ద ఇంత వరకు లేవు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత ఏడాది మే లోనే అంగీకరించారు. రూ. 704 కోట్లతో వలస కార్మికులు సహా అవ్యవస్థీకృత రంగంలోని పని వారి సమగ్ర సమాచార సేకరణకు నీతి ఆయోగ్ నడుం కట్టినట్టు వార్తలు వచ్చాయి. ఈ మార్చి 31న ఈ ప్రక్రియ మొదలైనట్టు చెబుతున్నారు. దీనిని వీలైనంత త్వరగా పూర్తి చేయవలసి ఉంది. ఈ కేసులో క్రియాశీల సంస్థలు, కార్యకర్తల తరపున వాదించిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వలస కార్మికుల దయనీయ స్థితిని ధర్మాసనానికి వివరించారు. సెకండ్ వేవ్ లాక్‌డౌన్ కారణంగా 24 కోట్ల మంది దారిద్య్ర రేఖ దిగువకు దిగజారిపోయారని చెప్పారు. జాతీయ జాబితా సిద్ధమయ్యే వరకు వేచి చూడకుండా ఉచిత రేషన్, ఉచిత భోజనం అందించాలని సూచించారు.

దానితో సుప్రీం ధర్మాసనం లాక్‌డౌన్ వల్ల పనులు కోల్పోయి ఎక్కడికక్కడ చిక్కుపడిపోయిన వలస కార్మికులకు రేషన్ కార్డులున్నా లేకపోయినా బియ్యం, పప్పులు వంటివి సరఫరా చేయాలని సామాజిక వంట శాలలు నిర్వహించి అన్నం వండి వడ్డించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. వీటిని తక్షణమే అమలు చేయడంతో పాటు వలస కార్మికుల సమగ్రమైన సమాచారాన్ని సేకరించి భద్రపరిచే పనిని త్వరగా పూర్తి చేయాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News