Saturday, April 27, 2024

సైన్స్ పేరుతో అభూత కల్పనలు

- Advertisement -
- Advertisement -

పురాణాలలో వుంది అని అంటే జనం లోగడ ప్రతిదీ నమ్మేవారు. ఈ ఆధునిక కాలంలో ట్రెండ్ మారింది. సైన్స్ అని చెపితేనే నమ్ముతున్నారు. అందువల్ల ప్రతి విషయంలో మనువాదులు లేని సైన్స్‌ను బయటికి తీస్తున్నారు. దాన్ని చూపుతూ తమ పబ్బం గడుపుకొంటున్నారు. తామేమీ వెనకబడలేదనీ ముందుండి సమాజానికి దిశా నిర్దేశం చేస్తున్నామనుకొంటూ ఆత్మవంచన చేసుకొంటున్నారు. లోగడ పుణ్యం, పాపం, మోక్షం, పునర్జన్మ, స్వర్గం, నరకం వంటి మాటలకు జనం పడిపోయేవారు. మూఢభక్తిలో పడి కొట్టుకుపోయేవారు. ఇప్పుడు తరం మాదింది. ఆ మాటలు క్రమంగా OUT DATED అయిపోయాయి. ఎక్స్‌పైరీ డేట్ అయిపోయినట్లు ఈ మాటలకు కాలం చెల్లిపోయింది. అందుకే ఇప్పుడు ప్రతి పనికిరాని విషయానికీ సైన్స్‌తో సంబంధం కలుపుతున్నారు. సూడో సైన్స్‌తో ఊదరగొడుతున్నారు. అసలైతే సైన్స్ అని చెప్పినప్పుడు రుజువులు, నిరూపణలు కావాలి! పిట్టకథలు చెప్పినట్లు చెపితే కుదరదు.

మనువాదులు ప్రచారం చేస్తున్న కొన్ని సూడో సైన్స్ విషయాలు చూద్దాం. దేవాలయాల్లో భక్తులు గంట మోగించి హడావుడిగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారని, అలా వెళ్ళకూడదని చెపుతున్నారు. గంట కొట్టిన తరువాత ఆ గంట కింద మూడు నిమిషాలు నిలబడితే శరీరంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని, మనసు ప్రశాంతంగా వుంటుందని.. అందులో ఎంతో సైన్స్ వుందని బ్రాహ్మణిజం ప్రచారం చేస్తోంది. ఆలయం పైకప్పు నుండి ఈ గంటల్ని వేలాడదీసి, కొంత ఎత్తులో వాటిని బిగిస్తారు. ఎందుకంటే గంట కొట్టినప్పుడు వెలువడే ప్రకంపనలు గంట కొట్టిన వారి శరీరంలోకి ప్రవేశించాలన్నది వారి ఉద్దేశమట! గంటలు మామూలు ఇత్తడితో కాకుండా, ఇతర లోహాలు కూడా కలిపి, ఒక లోహ మిశ్రమంతో వాటిని తయారు చేస్తారు. ఈ గంటలు తయారు చేసేవారిని ‘ఘంటా సాజ్’ అని పిలుస్తారు.

గంట కొట్టిన తర్వాత అది రెండు నిమిషాల యాభై అయిదు సెకండ్లు పాటు ప్రకంపనల్ని విడుదల చేయాలంటే అలా చేసే విధంగా ఈ గంటల కార్మికులు లోహాల నిష్పత్తిని ఏర్పాటు చేసుకొంటారని, అందుకు కొంత సాంకేతిక పరిజ్ఞానం అవసరమనీ చెపుతారు. ఇవన్నీ నిజమే కాని ఆ ప్రకంపనలు ఆగిపోయే వరకు ఆ గంట కిందే నిలబడితే వెలువడే పాజిటివ్ ఎనర్జీకి కొలమానం లేదు. వెలువడుతుందన్న దానికీ రుజువు లేదు. ఆ పాజిటివ్ ఎనర్జీ శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుందీ అన్న దానికీ నిరూపణ లేదు. గుడులకు భక్తులు తగ్గిపోతున్నారనీ, ఆ వచ్చిన కొందరు గుళ్ళలోంచి త్వరత్వరగా వెళ్ళిపోతున్నారని బ్రాహ్మణవాదులకు భయం పట్టుకున్నట్టుగా వుంది. అంతే! అలాంటి ప్రకంపనల ప్రభావం శరీరం మీద ఎలా వుంది? మానసికంగా కాని, ఆరోగ్యపరంగా కాని ఎలాంటి మేలు జరుగుతుంది అనేది ప్రాయోగికంగా చూపాలి. చూపలేకపోతే, అది ఉట్టి గ్యాసే

2. అలాంటిదే ఆరా గురించి ఓ కథ అల్లి ప్రచారం చేస్తున్నారు. ‘ఆరా’ అంటే మనిషి తల చుట్టూ వుంటుందని భావించే కాంతి పుంజం తేజస్సు. చిత్రాలలో హిందూ దేవీ దేవతల తలల చుట్టూ గుండ్రంగా కాంతి పుంజం వెలుగు వున్నట్టు చిత్రకారులు చిత్రిస్తారు. అదే ఆరా. అలాంటి ఆరా మనుషులకు కూడా వుంటుందని మైసూరు దత్తపీఠం దత్త విజయానంద తీర్థ స్వామీజీ ఒక వీడియోలో సందేశం ఇచ్చారు. విదేశీయులతో కలిసి ఓ ఇరవై మందిని తీసుకొని ఆయన గోశాల దగ్గరికి వెళ్ళారట. వీరితో పాటు ఒక డాక్టర్‌ను, ఒక సైంటిస్టును కూడా తీసుకొని వెళ్ళారట. వీళ్ళు ఆరాను కొలిచే పరికరాలు కూడా తీసుకొని వెళ్ళారట. విషయమేమంటే మొదట పరీక్షించినపుడు ఆరా లేని వాళ్ళకు, గో ప్రదక్షిణ చేసి రాగానే ఆరా పెరిగిందట. మొదట మూడు అడుగులు లేని ఆరా, గో ప్రదక్షిణ తర్వాత నూరు, నూటా యాభై అడుగుల వరకు పెరిగిందట. అది రికార్డు అయిందని స్వాములు సెలవిచ్చారు. దేశీయ గోవుల ప్రదక్షిణ హిందూ ధర్మానికి అవసరం అని ఆయన చెప్పారు. గో పూజ, గో సన్నిధి, గో ప్రదక్షిణ, గో సంరక్షణను ప్రమోట్ చేయడం కోసం ఆ స్వాములు అల్లిన కట్టుకథ అని తెలుస్తూనే వుంది. సరే, నిజమే కాబోలని ఒప్పుకొందాం అయితే ఆ ఆరా వల్ల కలిగిన లాభమేమిటీ? ఆ ఆరా వున్న మనిషికి లాభమా? చుట్టూ వున్న వారికి లాభమా? లేక సమాజానికే లాభమా? పాపం స్వాములు చెప్పలేకపోయారు.

ఆధ్యాత్మికత, అనుష్ఠానం వంటి బ్రాహ్మణిజానికి సంబంధించిన గాలి కబుర్లు చెప్పి జనాన్ని మోసం చేయడం తప్ప, వీరు, వీరి ఆరా, వీరి గో ప్రదక్షిణ వాస్తవంగా దేనికి ఉపయోగమో రుజువు చేయాలి. ఇందులో డాక్టరు, సైంటిస్టుల ప్రసక్తి తెచ్చారు. ఎందుకంటే సైన్స్ సాంకేతిక పరికరాలూ అంటేనే జనం నమ్ముతారు గనక! ఊరికే చెప్పడం వల్ల లాభం లేదు. ఆ వీడియోలోనే ఆరాను ఎలా కొలిచారో కూడా చూపించాల్సింది. ఆ ఆరా ఎవరికి ఏ విధంగా ఉపయోగపడిందో కూడా ప్రత్యక్షంగా జనానికి చూపించాల్సింది కదా? ఇలా సైన్సు పేరును తమ అంధ విశ్వాసాల వ్యాప్తికి వాడుకోవడం దుర్మార్గమైన పని. వివేకమున్న అధికారులు, ప్రభుత్వాధినేతలు వుంటే ఇలాంటి వారిని సత్వరమే అరెస్టు చేసి జైల్లో పెట్టేవారు. కాని, ఈ దేశంలో అలాంటి పని జరగదు. ఎందుకంటే ప్రభుత్వాలే గుడ్డి నమ్మకాల్లో కళ్ళు మూసుకొని వున్నాయి. కాబట్టి! గుళ్ళు గోపురాల కట్టడాలకు ప్రజాధనం వృథా చేస్తుంటారు కాబట్టి! కనిపించే ప్రజల అవసరాల కంటే, వీరికి కనపడని దేవుడికి కట్టడాలు కట్టడం కావాలి కాబట్టి! శతాబ్దాలుగా యజ్ఞయాగాల పేరుతో గోవుల్ని బలి ఇచ్చిన విషయం చెప్పుకోరెందుకూ? తమ పూర్వీకులు చేసిన తప్పిదాల గూర్చి విచారించరెందుకూ? ఇంకా వాటినే పట్టుకొని వేలాడుతున్నామన్న ఆత్మవిమర్శ చేసుకోరెందుకూ? మనోభావాలు దెబ్బతిన్నాయని గగ్గోలు పెట్టే మూర్ఖులంతా తమ మనోభావాలు తక్షణం మార్చుకోవాలి. ఎందుకంటే వాస్తవాలు, నిజాలు ఎప్పుడూ అలాగే వుంటాయి.

3. ఒక పరిశోధనా సంస్థ బయట కొందరు బ్రాహ్మణార్యులు తచ్చాడుతూ కనిపించారు. గేటు దగ్గర సెక్యూరిటీ వాళ్ళకు మాయ మాటలు చెప్పి లోపలికి వెళ్ళి వరండాలో కూర్చున్నారు. వాళ్ళను గమనించిన ఓ పరిశోధకుడు ‘పాపం! ఏమిటో వీరి బాధ’ అనుకొని మాట్లాడించాడు. వారి సంభాషణ ఇలా వుంది
‘ఏమిటండీ! మీరు ఇక్కడిక్కడే తిరుగుతున్నారు. మీరు ఎవరిని కలవాలి?’ అని అడిగాడు.
“అబ్బే ఏం లేదండి. లోపల మన వాళ్ళు పరిశోధనలు చేస్తున్నారు. కదండీ! వారేదైనా విషయం కనిపెట్టి ప్రకటించగానే మేం వెళ్ళి మన పురాణాల్ని తిరగేస్తామండీ అంతే!” కొంచెం ఎబ్బెట్టుగా అన్నాడు. ‘అంతేనా? అంతకన్నా మీరు ఎక్కువే చేస్తారు! ఎన్నిసార్లు చూడలేదూ? ఇప్పుడిక్కడ మేం కనిపెట్టింది చెపితే అది తీసుకొని మీరు బయటికి వెళతారు. ఫలానా అంశం మా పూర్వీకులు మా పురాణాలలో ఎప్పుడో రాసి పెట్టారు అని టముకు వేస్తారు’.
“అంటే మరేనండీ! మన జాతి ఔన్నత్యం పూర్వ కాలం నుండి ఎలా ఉందో అది చెపుతా మన్నమాట!”
‘చెపుతారు. బాగానే వుంది గాని, మేం వైజ్ఞానికంగా కొనుగొని చెప్పిన దానికీ, మీరు ఉత్తుత్తిగా పుట్టించి చెప్పిన దానికి పొంతన వుండదు. మీరు చెప్పేదానికి సరైన వివరణలు, రుజువులూ వుండవు. ఇంకా ఎందుకు వృథా ప్రయాస!

“వృథా ప్రయాస ఎలా అవుతుందండీ?మమ్మల్ని నమ్మే వాళ్ళు కూడా దేశవ్యాప్తంగా వున్నారు. మీరు చెప్పేది అర్థం చేసుకోవాలంటే, ఆ విషయంలో కొంత పరిజ్ఞానం వుండాలి. మేం చెప్పేది నమ్మాలంటే ఏదీ అవసరం లేదు. చెప్పింది చెప్పినట్టు గుడ్డిగా నమ్మితే చాలు. అయినా బాగోగులు ఆలోచించి చెప్పడానికి మేం వున్నాం గదండీ? సామాన్యులు ఎందుకండీ ఆలోచించడం?”
‘చాలు. చాలు.. దేశానికి మీరు చేసిన నష్టం చాలా వుంది. ఇక ఆపండి
ఒళ్ళు అలిసిపోకుండా, కూచుని తింటూ పిచ్చి మాటలు బాగానే చెపుతారు. ఇక అయిపోయింది మీ పని. మీరేం చెప్పినా ఏ పురాణం ప్రసక్తి తెచ్చినా జనం ఎవరూ నమ్మరు. రుజువులు, సాక్షాలు చూపితేనే నమ్ముతారు. మా పరిశోధనకు అన్ని ఆధారాలు, రుజువులూ వున్నాయి. కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు. వారికి మా మీద విశ్వాసం వుంది. మూఢ విశ్వాసాలు వ్యాప్తి చేసే మీ మీదే లేదు. మేం ఏం కనిపెడతామో కనుక్కొని, దాన్ని మీ ఖాతాలో అక్రమంగా వేసుకోవాలని గోరికాడి నక్కల్లాగ’ మీరు ఎదురు చూస్తున్నారు. వెళ్ళండి బయటికి పొరపాటున కూడా మిమ్మల్ని లోపలికి రానివ్వొద్దని మా సెక్యూరిటీ డిపార్టుమెంటు వారికి గట్టిగా చెపుతాను. ‘అయ్యా! అంత పని చేయకండయ్యా మా నోటి కాడి బుక్క అయ్యా దాన్ని లేకుండా చేయకండయ్యా”

‘స్వంత బుర్ర లేదు. స్వంత ఆలోచన లేదు. అన్నీ ఇతరుల నుండి కాపీ కొట్టి గొప్పలు చెప్పుకోవడమే కదా మీరు చేసే పనీ? పదండి… పదండి. మళ్ళీ మా గేట్లోకి కూడా రాకండి! జనం ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ సొళ్ళు కబుర్లు పిచ్చివాగుడూ ఎవరు వింటారు? వినిపిస్తోందా? పదండి! మళ్ళీ రాకండి!! చెప్తున్నది మీకే మీ అబద్ధాల ఫ్యాక్టరీ ఇక బంద్!
4. సైన్స్ చుట్టూ, సైన్స్ పరిశోధనా సంస్థల చుట్టూ తిరిగిన ఒక విష ప్రచారం ఇలా వుంది. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్ 3 కార్యక్రమం: 14 జులై 2023 నాడు 2.35 ని.లకు సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి దిగ్విజయంగా ప్రయోగించబడింది. అది 23 ఆగస్టు 2023న అంటే 40 రోజుల తర్వాత చంద్రుడి మీదికి చేరుతుందని అంచనా? ఇది వాస్తవం! కాని, దీని ఆధారంగా వారం రోజులకే అంటే 20 జులై నాటికే మనువాద బ్రాహ్మనిజ కాషాయ మూకలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు.

అదేమిటంటే…అంతరిక్ష నౌక చంద్రుడి మీదికి చేరినట్టూ, అక్కడి నుండి అది కొన్ని ఫోటోలు పంపినట్టు …(మార్ఫింగ్ చేసిన) ఆ ఫోటోలో కొద్ది దూరంలో ఒక హిందూ దేవాలయం కనిపించినట్టూ పోస్టులు సృష్టించారు. “చంద్రుడిపై హిందువుల గుడి చంద్రయాన్ 3 నుండి విడుదలైన ఫోటో” అని దానికి హెడ్డింగ్ కూడా! ఆ పోస్టు కింద జైశ్రీరామ్ అని, ఇది హిందువుల పవర్ అని కొందరు కామెంట్లు కూడా రాశారు. హిందువులే కాదు, దేశమే తలదించుకునేంత ఫేక్ ఫోటోల ప్రదర్శన అవసరమా? వీళ్ళు ఈ సమాజాన్ని ఎటు తీసుకుపోతున్నారోనని భయంగా వుంది. ముఖ్యంగా యువతీ యువకులు ఇలాంటి అసత్యాల్ని గుర్తు పట్టి జాగ్రత్తగా వుండడంతోపాటు, ఎండగడుతూ వుండడం అవసరం!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News