Saturday, April 27, 2024

వారంలోగా ఉద్యోగులందరికీ రెండో డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

ఆసుపత్రుల సౌకర్యాల పెంపుదలకు సిద్ధం
మూడు రోజుల్లో ప్రతిపాదనలు పంపండి
అన్ని ఏరియాల జిఎంలకు డైరెక్టర్ ఎన్.బలరామ్ ఆదేశం

Second dose complete within week

 

మన తెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి ఉద్యోగులకు రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని సంస్థ డైరెక్టర్ ఎన్.బలరామ్ అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లను ఆదేశించారు.హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కరోనా నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా సమీక్షించారు. జనరల్ మేనేజర్ (కో..ఆర్డినేషన్)కె.సూర్యనారాయణ తొలుత అన్ని ఏరియాల వారీగా వ్యాక్సినేషన్ సమాచారాన్ని విశ్లేషిస్తూ.. ఈ ప్రక్రియ మరింత వేగవంతంగా సాగాలని ఛైర్మన్, ఎండి శ్రీధర్ కోరుతున్నారన్నారు. కాబట్టి దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.

అన్ని ఏరియాల నుంచి వ్యాక్సినేషన్ పై సమాచారాన్ని స్వీకరించిన అనంతరం డైరెక్టర్ బలరామ్ మాట్లాడుతూ 40,525 మందికి మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేసి చాలా రోజులైనందని గుర్తు చేశారు. ఇంకా మొదటి డోసు తీసుకోని 2,695 మందికి వ్యాక్సినేషన్ త్వరలోనే పూర్తి చేయాలన్నారు. ఇప్పటి వరకు కేవలం 26,213 మంది ఉద్యోగులకు మాత్రమే రెండో డోసు పూర్తి చేశారని, మిగిలిన 14,312 మందికి వారం రోజుల్లోగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని చెప్పారు.
వ్యాక్సినేషన్‌పై, కంపెనీ ఆసుపత్రులలో సౌకర్యాల పెంపుదలకు సంస్థ ఛైర్మన్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఈ నేపథ్యంలో ఏరియాల జనరల్ మేనేజర్లు సంబంధిత వైద్య విభాగంతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సి ఉన్న వారి పేర్ల జాబితాను సిద్ధం చేసి పర్సనల్, వైద్య అధికారులు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. 90 శాతం మంది పొరుగు సేవల సిబ్బందికి మొదటి డోసును విజయవంతంగా పూర్తి చేయడంపై అభినందించారు.

అలాగే ఏరియా ఆసుపత్రుల్లో వసతులు పెంచడానికి, వైద్య పరికరాల సమకూర్పు, వైద్య సిబ్బంది, సహాయ సిబ్బంది నియామకానికి కూడా యాజమాన్యం సిద్ధంగా ఉందని, ఏరియాల వారీగా తమ పరిధిలోనే ఆసుపత్రులు, డిస్పెన్సరీలకు కావాల్సిన సదుపాయాలు, వసతులపై మూడు రోజుల్లోగా ఏరియా జనరల్ మేనేజర్లు నివేదిక సమర్పించాలని, వీటిని క్రోడీకరించి తగు చర్యలను తక్షణమే తీసుకుంటామని పేర్కొన్నారు.

అలాగే పర్సనల్ విభాగం అధికారులు కార్మికుల సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి పూర్తి స్నేహపూర్వక పద్ధతిలో వ్యవహరించాలని, ఏరియాల వారీగా ఉన్న అన్ని సమస్యలు పరిష్కరించాలని, విధాన పరమైన సమస్యలపై తమకు నివేదించాలని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎటువంటి అలసత్వాన్ని కూడా ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. ఏరియాల వారీగా నిర్వహించిన గ్రీవెన్స్ డేలో వచ్చిన వినతులపై సత్వరమే స్పందించాలన్నారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి చీఫ్ మెడికల్ ఆఫీసర్ మంథా శ్రీనివాస్, జిఎం(స్ట్రాటెజిక్ ప్లానింగ్) సురేందర్, డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలకోటయ్య, ఎస్‌ఇ సంజీవరెడ్డి, కొత్తగూడెం కార్పోరేట్ ఆఫీస్ నుంచి జిఎం సిపిపి కె.నాగభూషణ్ రెడ్డి, ఎఎస్‌ఒ టు డైరెక్టర్ దేవీకుమార్, ఆయా ఏరియాల నుంచి జనరల్ మేనేజర్లు, మెడికల్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News