Saturday, April 27, 2024

తేలి పోతున్న జో రూట్

- Advertisement -
- Advertisement -

Series of failures by England captain Joe Root in Test series

 

అహ్మదాబాద్: భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో అసాధారణ రీతిలో రాణించిన రూట్ ఆ మ్యాచ్‌లో ఏకంగా డబుల్ సెంచరీని బాదేశాడు. ఇక ఇంగ్లండ్‌కు చారిత్రక విజయం అందించడంలో రూట్ కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో కూడా రూట్ పరుగుల వరద పారించాడు. తొలి టెస్టులో రూట్ బ్యాటింగ్‌ను చూసిన వారికి అతన్ని కట్టడి చేయడం భారత బౌలర్లకు శక్తికి మించిన పనిగా అభివర్ణించారు.

అయితే చెన్నైలోనే జరిగిన రెండో టెస్టు నుంచి రూట్ బ్యాటింగ్‌లో స్పష్టమైన మార్పు కనిపిస్తూ వస్తోంది. తొలి టెస్టులో ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన రూట్ ఆ తర్వాత ఫామ్‌ను కోల్పోయి వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. అతని వైఫల్యం ఇంగ్లండ్‌పై బాగానే ప్రభావం చూపుతోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన రూట్ ఫామ్ కోల్పోవడంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఆ తర్వాత జరిగిన రెండో, మూడో టెస్టులో ఇంగ్లండ్ ఘోర పరాజయాలు చవిచూసిందంటే దానికి రూట్ వైఫల్యం కూడా ఒక కారణంగా చెప్పాలి.

రూట్ విజృంభిస్తే ఎంతటి పెద్ద బౌలర్‌కైన చుక్కలు కనిపించడం ఖాయం. కానీ రూట్‌ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారనే చెప్పాలి. ఒక్క తొలి టెస్టులో మినహా తర్వాతి మ్యాచుల్లో రూట్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో భారత బౌలర్లు పైచేయి సాధించారు. ఇక రూట్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దాన్ని తట్టుకోవడంలో అతను విఫలమవుతున్నాడు. దీంతో బ్యాటింగ్‌లో జోరు తగ్గింది. ఇది ఇంగ్లండ్‌కు అతి పెద్ద సమస్యగా తయారైంది. రూట్ ఫామ్ లేమితో సతమతమవడం జట్టును వెంటాడుతోంది. ఇక ఆఖరి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో కూడా రూట్ తేలి పోయాడు. రూట్ తక్కువ స్కోరుకే పరిమితం కావడంతో ఇంగ్లండ్ 205 పరుగులకే కుప్పకూలింది. ఈ సిరీస్‌లో రూట్‌పై ఇంగ్లండ్ భారీ ఆశలు పెట్టుకుంది. కానీ అతను మాత్రం తన స్థాయికి తగ్గ ఆటను కనబరచడంలో విఫలమవుతున్నాడు.

రూట్ పేలవమైన ఫామ్ ఇంగ్లండ్ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తోంది. బెన్ స్టోక్స్, బెయిర్‌స్టో, సిబ్లి, పోప్, క్రాలీ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నా జట్టుకు ప్రయోజనం లేకుండా పోతోంది. భారత స్పిన్నర్లను ఎదుర్కొవడంలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమవుతున్నారు. ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ అసాధారణ బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తిస్తున్నారు. రూట్‌తో సహా స్టోక్స్, పోప్, సిబ్లి, బెయిర్‌స్టో వంటి ప్రతిభావంతులైన బ్యాట్స్‌మెన్‌లు కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. మరోవైపు భారత బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News