Friday, April 26, 2024

పన్నీర్ సెల్వంకు షాక్.. పళనిస్వామికే అన్నాడిఎంకె పగ్గాలు

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాట అన్నాడిఎంకె ఆధిపత్య పోరులో మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వంకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ జనరల్ సెక్రటరీగా ఎడప్పాడి పళనిస్వామి ఎన్నిక సరైనదేనని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెపింది. ఈ మేరకు పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఇపిఎస్ కొనసాగేలా మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అన్నాడిఎంకె తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా గత ఏడాది పళనిస్వామి ఎన్నికైన విషయం తెలిసిందే. దీనిపై పన్నీర్‌సెల్వం తొలుత మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో గత ఏడాది జులై 11న జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశం చెల్లదని, జూన్ 23కు ముందున్న పరిస్థితే కొనసాగుతుందని గత ఏడాది ఆగస్టులో ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ జయచంద్రన్ తీర్పు ఇచ్చారు. దీనిపై పళనిస్వామి మద్రాసు హైకోర్టులో అప్పీల్ చేయగా.. జస్టిస్ జయచంద్రన్ తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేసింది.

జులై 11న జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశం చెల్లుతుందనిపేర్కొంటూ పళనిస్వామి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కొనసాగేందుకు అనుమతిచ్చింది. అయితే ఈ తీర్పును పన్నీర్‌సెల్వం సుప్రీంకోర్టులో సవాలు చేశారు.తాజాగా దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఒపిఎస్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో అన్నాడిఎంకె పగ్గాలు మాజీ సిఎం పళనిస్వామి చేతికే దక్కినట్లయింది. సుప్రీంకోర్టు తీర్పుపై పళనిస్వామి వర్గం శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మదురైలో గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పళనిస్వామి సుప్రీంకోర్టు తీర్పుపై వ్యాఖ్యానిసూ..్త ధర్మం, న్యాయం, నిజం విజయం సాధించాయన్నారు. పార్టీకి దేవుళ్లతో సమానమైన దివంగత నేతలు ఎంజి రామచంద్రన్, జయలలితల ఆశీస్సులవల్లే ఇది సాధ్యమైందని పళనిస్వామి అన్నారు.

తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత మరణించిన తర్వాత పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవిని రద్దు చేశారు. నాటినుంచి పళనిస్వామి సమన్వయకర్తగా, పన్నీర్‌సెల్వం సంయుక్త సమన్వయకర్తగా కొనసాగారు. అయితే ద్వంద్వ నాయకత్వంతో నిర్ణయాలు తీసుకోవడం సమస్యాత్మకంగా మారిందని, పార్టీ సర్వసభ్య జమావేశాన్ని నిర్ణయించాలని నిర్ణయించారు. ఈ విషయంపై జిల్లా కార్యదర్శుల సమావేశం నిర్వహించి చర్చించారు. దానితో పళనిస్వామి వర్గం ఏకనాయకత్వం అంశాన్ని తెరపైకి తెచ్చింది. దానికి సన్నీర్‌సెల్వం వర్గం ససేమిరా అంది. ఈ క్రమంలోనే 2022 జూన్ 23న సర్వసభ్య సమావేశం నిర్వహించగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

ఆ తర్వాత జులై 11న మరోసారి సమావేశం నిర్వహించారు. అందులో పార్టీలో ద్వంద్వ నాయకత్వాన్ని రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించారు. కొత్తగా డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవిని ప్రవేశపెట్టారు. పళనిస్వామిని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పన్నీర్‌సెల్వంను పార్టీనుంచి బహిష్కరించారు. అయితే ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సవాలు చేస్తూ పన్నీర్‌సెల్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సుప్రీంకోర్టు గురువారం తాజా తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో త్వరలో నే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్నికలు నిర్వహించి పళనిస్వామిని పూర్తిస్థాయి ప్రధానకార్యదర్శిగా ఎన్నుకుంటారని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News