Monday, April 29, 2024

వైద్య సిబ్బందికి ప్రత్యేక బస

- Advertisement -
- Advertisement -

Medical staff

 

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా బాధితులకు చికిత్స చేస్తన్న వైద్య సిబ్బందికి హోటళ్లలో ప్రత్యేక బస కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా బాధితులకు, అనుమానితులకు నోటిఫైడ్ దవాఖానాలో పనిచేసే రోజుల్లో విధులు ముగించుకున్న తరువాత నేరుగా ఇంటికెళితే, కుటుంబ సభ్యులకు ఇబ్బంది అవుతుందన్న భావనతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. వీరు హోటళ్లు, హాస్పిటళ్లల్లో ఉన్నన్ని రోజులు కుటుంబానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అందరూ ఒకేసారి రేయింబవళ్లు పనిచేయకుండా, కొందరు కొన్ని రోజులు పనిచేసేలా వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. అవిశ్రాంతంగా పనిచేసి ఎవరూ అనారోగ్యానికి గురికాకుండా చేయాలన్నదే ఈ బ్యాచ్‌ల ఉద్దేశం.

వారిని మంచిగా కాపాడుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే చెబుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రకారమే హోటళ్లలో సౌకర్యవంతమైన రూమ్‌లను బుక్ చేస్తారు. కమిటీ నివేదిక ఇచ్చాక హోటళ్లు బుక్ చేసి వైద్య సిబ్బందికి బస ఏర్పాట్లు చేస్తామని ఒక సీనియర్ అధికారి తెలిపారు. అయితే షిఫ్టులను ఎన్ని రోజులకోసారి మార్చుతారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. దాన్ని బట్టి వారు ఎన్ని రోజులు డ్యూటీలోనూ, హాటళ్లలోనూ ఉంటారనేది తెలుస్తుంది. వైద్య సిబ్బందిని ఎన్ని బ్యాచ్‌లుగా ఏర్పాటు చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంది.

బసపై ముగ్గురు ఐఎఎస్‌లతో కమిటీ
ఎక్కడెక్కడ వారికి బస ఏర్పాటు చేయాలి? భోజన వసతి తదితర అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు ఐఎఎస్‌లతో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్‌కుమార్, పర్యాటకశాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావులతో కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి కన్వీనర్‌గా పర్యాటకశాఖ కార్యదర్శి వ్యవహరిస్తారు. గాంధీ, ఫీవర్, ఛాతి తదితర ఆసుపత్రుల్లోని కరోనా రోగులకు, అనుమానిత లక్షణాలతో ప్రభుత్వ క్వారంటైన్లలో ఉన్నవారికి చికిత్స చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి ప్రత్యేక వసతి కల్పించనున్నారు. వారికి షిఫ్టుల ప్రకారం డ్యూటీలు వేస్తారు. కొన్నాళ్లపాటు విధులు నిర్వహించాక, వారికి కరోనా నిర్దారణ పరీక్షలు చేసి ఇంటికి పంపుతారు. ఇలా కొన్ని రోజులు కొందరికి, మరికొన్ని రోజులు ఇంకొందరికి ఇలా ఆసుపత్రుల్లో షిఫ్టుల వారీగా డ్యూటీలు వేస్తారు. డ్యూటీలో ఉన్న కాలంలో వారు నిర్ణీత హోటళ్లలోనే ఉంటారు. ఇది ఒకరకంగా ఐసోలేషన్.

పర్యాటక హోటళ్లు, ప్రభుత్వ అతిధి గృహాలు
నోటిఫైడ్ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్య సిబ్బందికి పర్యాటక శాఖకు చెందిన హోటళ్లు, ప్రభుత్వ అతిధి గృహాల్లో బస ఏర్పాటు చేస్తారు. హోటళ్లను ఖరారు చేయడం, వారి భోజన ధరలను నిర్ణయించడం వంటి వాటిని ఐఎఎస్‌ల కమిటీ పర్యవేక్షిస్తుంది. సీనియర్ డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కీలకమైన కరోనా సేవల్లో ఉంటున్నందున వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. వారి ఆహారం, వ్యాయామం వంటి విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఢిల్లీలో డాక్టర్లకు ఫైవ్ స్టార్ హోటళ్లలో బస ఇచ్చినట్లు తెలిసింది. అలాగే కేరళలోనూ మంచి ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా వారి స్థాయికి తగినట్లు, అత్యంత ఆరోగ్యకరమైన ఆహారం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తారు. వారు తాము పనిచేసే ఆసుపత్రులకు వచ్చి వెళ్లేందుకు ప్రత్యేకంగా వాహన సౌకర్యం కూడా కల్పిస్తారు.

Special stay in hotels for Medical staff
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News