Saturday, April 27, 2024

కేంద్రం దాడులపై ప్రతి దాడి తీర్చుకుంటాం: మంత్రులు

- Advertisement -
- Advertisement -

కేంద్రం దాడులపై ప్రతి దాడి తీర్చుకుంటాం
మీలా చేయాలంటే మాకు ఒక గంట చాలు
కేసీఆర్ కూతురు అయినందుకే కవితపై కుట్ర
ఈడీలకు, ఐటీలకు భయపడం
డిసెంబర్ 4న పాలమూరుకు ముఖ్యమంత్రి రాక, నూతన కలెక్టరేట్ ఓపెనింగ్
విలేకర్ల సమావేశంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నీరంజన్ రెడ్డి ఫైర్
మన తెలంగాణ/మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర బీజెపి ప్రభుత్వం చేస్తున్న దాడులకు ప్రతి దాడులతో బాకీ తీర్చుకుంటామని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నీరంజన్ రెడ్డి కేంద్ర బీజెపి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ కూతురు అయినందుకే కవితపై కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని, ఇలాంటి కుట్రలను తిప్పి కొడతామని హెచ్చరించారు. ఈడీలు, ఐటీలతో దాడులు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని అస్తిత్వాన్ని దెబ్బతీయాలని, కేంద్రం కుయుక్తులు పడుతోందని ఆరోపించారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మంత్రి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నీరంజన్ రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ మొదటి నుండి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంపై కక్షగట్టి ప్రభుత్వాన్ని కుల్చాలని ప్రయత్నం చేసి చివరికి ఎమ్మెల్యేలకు ఎరా వేసిందని ఆరోపించారు. నిధుల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వంపై వివక్షత చూపిస్తుందన్నారు. బీజెపి కుట్రలకు, కుతంత్రాలకు తెలంగాణ ప్రభుత్వం కానీ, ప్రజా ప్రతినిధులు కానీ భయపడరన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. ఈడిలు, ఐటీలతో భయపెట్టాలని చూస్తే మాకు ఒక గంట చాలని, మిమ్ములను ఒక ఆడుకుంటామని హెచ్చరించారు. దమ్ముంటే మంత్రి మల్లారెడ్డిపై ఫిర్యాదు చేసిన వారి పేరు బయట పెట్టాలని ప్రశ్నించారు. తెలంగాణ రాకపూర్వం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వలసలు, నిరక్షరాస్యత, పేదరికంతో అవస్థలు పడుతుండేదని, అలాంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఇప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలమై వలసలను నివారించుకోగలిగామని అన్నారు. డిసెంబర్ 4న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించి బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మొట్టమొదటి మెడికల్ కళాశాల మహబూబ్ నగర్‌కే వచ్చిందని, ఇప్పుడు అన్ని జిల్లాలో కూడా మెడికల్ కళాశాలలు వచ్చాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం అన్ని రంగాలకు ప్రాధాన్యతను ఇస్తున్నదని, గురుకులాలు, మెడికల్ కళాశాలల ఏర్పాటు, ఎండాకాలంలో కూడా సాగునీరు, తాగునీటికి ఇబ్బంది లేకుండా అందించే ఏర్పాటును తెలంగాణ ప్రభుత్వం చేసిందన్నారు. దేశంలో రైతులకు ఉచిత విద్యుత్‌ను ఇవ్వడమే కాకుండా, సాగునీటి రంగానికి, పరిశ్రమలకు నాణ్యమైన కరెంటును ఇస్తున్న రాష్ట్రం ఏది లేదన్నారు. అంతేకాకుండా రైతుబంధు, రైతుభీమా అందజేస్తున్నామని, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నో అవార్డులలో తెలంగాణ రాష్ట్రం ముందుందని, అన్ని ప్యారామీటర్లలో తెలంగాణ రాష్ట్రం ముందున్నదన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఇప్పుడిప్పుడే భరోసా కలుగుతున్నదని మంత్రి తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసికట్టుగా ఉమ్మడి జిల్లాను కాపాడుకుంటామని, మరింత అబివృద్ది చేస్తామని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోథల పథకానికి కేంద్ర ప్రభుత్వం నీటి పంపకాల వివాదాన్ని పరిష్కరించి కేటాయింపులను ఇవ్వాలని అన్నారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నీరంజన్ రెడ్డి మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం ప్రజలకు పాలనను చేరువలోకి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలలో సమీకృత కార్యాలయ బవనాల నిర్మాణాన్ని చేపట్టిందని, అట్టి కార్యాలయ భవన సముదాయం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పూర్తయినందున డిసెంబర్ 4న రాష్ట్ర ముఖ్యమంత్రి దానిని ప్రారంభించేందుకు వస్తున్నారని తెలిపారు. వేగంగా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానం మేరకు ఫలితాలు వారికి నేరుగా అందేలా మధ్య దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా అందించడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు. మన రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలలో నిర్మించిన సమీకృత ప్రభుత్వ కార్యాలయ భవనాలు ఇతర రాష్ట్రాలలోని సచివాలయాలకు సమానంగా ఉన్నాయని, కొన్ని చోట్ల సెక్రటేరిట్‌లను మించి ఉన్నాయన్నారు. ఈ కార్యాలయాల నిర్మాణం వల్ల అధికార యంత్రాంగం ప్రజలకు మరింత చేరువలో ఉంటుందని, కేవలం గంటలోపే పరిపాలన కార్యాలయం చేరుకుని సమస్యలను పరిష్కరించుకునే వెసులుబాటు కలుగుతుందని తెలిపారు.

గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఉమ్మడి జిల్లాలో వరి పంట విస్తారంగా పండుతున్నదని, రైతులు ఎప్పుడు వరి పంటనే వేసుకోకుండా ఇతర పంటలు వేసుకోవాలని, అవకాశం ఉన్నంత మేరకు వరిని తగ్గించాలని మంత్రి కోరారు. వరికంటే ఏ పంట వేసినా ఎక్కువ లాభాలు వస్తాయని, అందువల్ల వరి సాగు చేయకుండా పప్పు దినుసులు, వాణిజ్య పంటలను సాగు చేయాలని కోరారు. రైతుబంధు పథకం కింద ఇప్పటి వరకు 9 విడతలలో రూ 50వేల కోట్ల నిధులను రైతులు ఖాతాలలో జమ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. తెలంగాణలో వేరుశనగకు మద్దతు ధర కంటే ఎక్కువ రేటు పెట్టి బహిరంగ మార్కెట్‌లో కొంటున్నారని, అందువల్ల వేరుశనగ సాగుపై దృష్టి సారించాలని, దేశంలో తెలంగాణలో పండించిన వేరుశనగకకు ఎక్కువ డిమాండ్ ఉందని, ప్రపంచ వ్యాప్తంగా మన వేరుశనగను బాగా ఇష్టపడతారని, ఇందులో అప్లాటాక్సిన్ లేనందున దీనికి ఎక్కువ గిరాకీ ఉన్నట్లు మంత్రి తెలిపారు. పొద్దుతిరుగుడు, నూనె గింజలు, పప్పు ధాన్యాల సాగుపై రైతులు దృష్టి పెట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నీటి పంపకం చేయకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆటంకాలు కలిగిస్తున్నదని, అందువల్ల నీటి పంపకాలు చేసి సమస్య పరిష్కరించే విధంగా చూడాలని ఆయన తెలిపారు. జిల్లా సాగునీటి కోసం తహతహాలాడిందని, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతుందన్నారు.

Srinivas Goud fires on Centre over ED Raids 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News